పొత్తు బీజేపీతో పెట్టుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఆ పార్టీ తలచుకుంటే క్షణాల్లో ఆ ప్రక్రియ ఆగిపోతుంది. బీజేపీతో పొత్తు ఎందుకు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోరస్ గా చెప్పే మాట ఒక్కటే. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి అని.
విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదా అని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అనకాపల్లికి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కామెంట్స్ చేశారు.
అవి విన్న వారు ఇదేమి విడ్డూరం అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే ప్రజలంతా రోడ్ల మీదకు రావాలని పవన్ అంటున్నారు అపుడే ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆగుతుంది అని అంటున్నారు. అయితే దీనికి ఉక్కు ఉద్యమ సంఘాలు ఘాటుగానే సమాధానం చెబుతున్నాయి.
మూడేళ్ళుగా తాము రోడ్ల మీదనే ఉన్నామని వారు అంటున్నారు. ఇది రాజకీయంగా తేల్చుకునే అంశమని పైగా బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీ జనసేన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అని షరతు విధించవచ్చు కదా అని అంటున్నారు. కానీ పవన్ మాత్రం ఇది భావోద్వేగాలతో కూడుకున్న అంశమని అంటున్నారు. తాను ఒక్కడినే చేసేది కాదు అని అంటున్నారు.
ఇక్కడ పవన్ తెలుసుకోవాల్సింది ఆయన పోరాటాలు ఏవీ చేయనవసరం లేదని ఉక్కు కార్మికులు అంటున్నారు. కేంద్రంలోని బీజేపీతో మాట్లాడితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. కానీ పవన్ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని నోటితో అంటున్నారు కానీ చేయాల్సిన పని మాత్రం చంద్రబాబుతో కలసి ఆయన చేయవచ్చు కదా అని అంటున్నారు.