ప్ర‌భుత్వ అనాలోచితం.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు తిప్ప‌లు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో డీఎస్సీ అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో డీఎస్సీ అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు. చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సర్టిఫికెట్టు అంటూ పరుగులు తీస్తున్నారు. సర్టిఫకెట్లు లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఒక నిమిషం ఆలోచిస్తే లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు ఊరట లభిస్తుంది.

డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశముంది. ఎంతమంది దరఖాస్తు చేసినా ఉద్యోగాలు వచ్చేది 16,347 మందికి మాత్రమే. అలాంటప్పుడు దరఖాస్తు చేసే ఆరు లక్షల మంది తమ సర్టిఫికెట్లను అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం ఏముంది?

డీఎస్సీ ముగిసిన తరువాత క్వాలిఫై అయిన వారిని తమ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయమంటే సరిపోతుంది. అలా కాకుండా దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలనే నిబంధన పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ సర్టిఫికెట్లతో పాటు 4వ తరగతి నుంచి పదో తరగతి దాకా స్టడీ సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం వుంది. మార్కుల జాబితాలైతే వున్నాయిగానీ స్టడీ సర్టిఫికెట్లు లేవు. దీంతో నిరుద్యోగులు ప్రిప‌రేష‌న్‌ ఆపేసి సర్టిఫికెట్ల కోసం ఎప్పుడో చదువుకున్న స్కూళ్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అదీ ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో స్కూళ్ల వద్ద హెడ్మాస్టర్‌, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సర్టిఫికెట్లు తెచ్చుకోలేక, రోజుల త‌ర‌బడి స్కూళ్ల చుట్టూ తిరుగుతూ అవస్థపడుతున్నారు. కొన్ని ప్రైవేట్‌ స్కూల్స్‌ ఉనికిలోనే లేవు. అలాంటి వారు సర్టిఫికెట్ల కోసం ఎంఈవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఇక క్యాస్ట్‌ సర్టిఫికెట్‌తో కూడా ఇలాంటి సమస్యే వుంది. సర్టిఫికెట్‌ నెంబరును డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులో నమోదు చేస్తే, అది ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి వివరాలను పరిశీలించుకుని, తనంతట తానే కాస్ట్‌ వివరాలను భర్తీ చేసుకుంటుంది. కాస్ట్‌ సర్టిఫికెట్‌ నమోదు చేయకున్నా, సదరు సర్టిఫికెట్‌ నెంబరు ఆన్‌లైన్‌లో వెరిఫై కాకున్నా ఇక దరఖాస్తు ముందుకు సాగదు. దీంతో కాస్ట్‌ సర్టిఫికెట్‌ కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు డీఎస్సీ ఉద్యోగార్థులంతా పట్టణాలు, నగరాల్లో కోచింగ్‌లో వున్నారు. అలాంటి వారు కూడా కోచింగ్‌ తరగతులు వదిలేసి, సర్టిఫికెట్ల కోసం స్వస్థలాలకు ప‌రుగులు పెడుతున్నారు. సర్టిఫికెట్ల కోసం కీలకమైన సమయంలో విలువైన సమయం వృథా అవుతోందని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

దరఖాస్తు సమయంలో కేవలం వివరాలు మాత్రమే నమోదు చేయమంటే సరిపోయేది. పోస్టింగ్‌ ఇచ్చేటప్పుడు ఎటూ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అప్పటిలోపు సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోమని చెబితే సరిపోయేది. అలాకాకుండా దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయమని చెప్పడంతో…. ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరూ సర్టిఫికెట్ల కోసం హైరానా పడాల్సి వస్తోంది.

తమది స్మార్ట్‌ ప్రభుత్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఇప్పటికైనా సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ అంశాన్ని పున:పరిశీలించాలని డీఎస్సీ అభ్య‌ర్థులు కోరుతున్నారు. డీఎస్సీ పరీక్ష అయిన తరువాత, క్వాలిఫై అయిన వారు మాత్రమే సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసేలా నిబంధన మార్చాలని కోరుతున్నారు.

5 Replies to “ప్ర‌భుత్వ అనాలోచితం.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు తిప్ప‌లు!”

  1. బురద జల్లాలి అనే తాపత్రయామె కానీ వాస్తవం అక్కర్లేదు మనకి

  2. స్టడీ సర్టిఫికెట్ చూసే లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారు

  3. టైంపాస్ కోసం లేదా నాలెడ్జి చెక్ చేసుకోవటం కోసం పరీక్ష రాసే వాళ్ళను నియంత్రించటం కోసం ఇలా చేస్తున్నారేమో

  4. Picha GA Venkat,

    vella names vaadukuni cbn gaadu , tdp pandi kukkalu block money bi white chestharu , kotha account lu open chesi… 

Comments are closed.