అయ్యన్న వారసుడికి బీజేపీ మార్క్ షాక్?

టీడీపీలోకి జనసేనలోకి ఆడారిని చేర్చుకోనీయకుండా కూడా రాజకీయదిగ్బంధనం చేశారు. అయితే సడెన్ గా బీజేపీ ఎంట్రీ ఇచ్చేసింది.

భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉందా అంటే ఉంది కదా అన్నదే జవాబు. కూటమిలో ఉన్న పార్టీలు ఒకే మాట మీద ఉండాలి కదా అంటే ఏమో మా పార్టీ మా ఇష్టం అన్నట్లుగా వైసీపీ నుంచి వచ్చేవారిని వచ్చినట్లుగా చేర్చుకుంటోంది. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ని అలాగే చేర్చుకుంది.

దాంతో కూటమిలోని మిగిలిన రెండు పార్టీలూ బీజేపీ పోకడల పట్ల గుర్రుమంటున్నాయి. బీజేపీ జాతీయ పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉంది. దాంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా భరిస్తున్నాయి కానీ కమలం చేసిన పనికి మాత్రం కూటమిలో మెల్లగా రాజకీయ మంట అయితే రాజుకుంటూనే ఉందిట.

విశాఖ డెయిరీ చైర్మన్ గా ఆడారి ఆనంద్ ని తప్పించాలని ఒక భారీ స్కెచ్ వేసి మరీ కొద్ది నెలలుగా ఆయన మీద ఆరోపణలు చేస్తూ వచ్చాయి టీడీపీ అండ్ జనసేన. ఆయనను మాజీని చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో బలంగా ఉంటూ లాభాల బాటలో ఉన్న విశాఖ డెయిరీని తమ పరం చేసుకోవాలన్నదే టీడీపీ తమ్ముళ్ల అజెండా అంటున్నారు. అందుకే ఆరోపణలు కాస్తా సభా సంఘం దాకా వచ్చాయని అంటున్నారు.

విశాఖ డెయిరీ చైర్మన్ పదవి నుంచి ఆనంద్ ని దించేసి తన రాజకీయ వారసుడిగా ఉన్న విజయ్ పాత్రుడిని చైర్మన్ గా చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆలోచించారని ప్రచారం సాగుతోంది. డెయిరీ చైర్మన్ వంటి పదవి చేతిలో ఉంటే ఉత్తరాంధ్ర రాజకీయాల మీద కూడా పట్టు దొరుకుతుందని అలా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు దివ్యంగా సాగుతుందని ఆయన భావించారు.

అందుకోసం పావులు వేగంగా కదిలాయి. టీడీపీలోకి జనసేనలోకి ఆడారిని చేర్చుకోనీయకుండా కూడా రాజకీయదిగ్బంధనం చేశారు. అయితే సడెన్ గా బీజేపీ ఎంట్రీ ఇచ్చేసింది. ఆడారిని అక్కున చేర్చుకుంది. దాంతో టీడీపీ జనసేన షాక్ తిన్నాయి. దాంతో పాటుగా అయ్యన్న వారసుడికి కూడా షాక్ తగిలినట్లు అయింది అంటున్నారు

ఇపుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఆడారి మీద చర్యలు సందేహంలో పడుతున్నాయని అంటున్నారు. అంటే ఆయన విశాఖ డెయిరీ చైర్మన్ గా కొనసాగుతారు అని అంటున్నారు. ఆడారి కొనసాగితే మరి విజయ్ పాత్రుడు పరిస్థితి ఏంటి అన్నది ఒక ప్రశ్నగానే ఉంది.

వెనక్కి వెళ్లి చూస్తే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ కూడా అనకాపల్లి ఎంపీ సీటుకి విజయ్ పాత్రుడు పోటీ పడితే మధ్యలో బీజేపీ ఎంట్రీ ఇచ్చి తన్నుకుని పోయింది. ఇపుడు ఇలా జరిగింది అని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ జిల్లాలో కూటమి నేతల మధ్యన వ్యవహారాలు నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉన్నాయని అంటున్నారు.