ఎంపీ, ఎమ్మెల్యేలు పేదలా… పాతిక వేల గిఫ్ట్ కూపన్లు!

ఎమ్మెల్యేలు, ఎంపీలు పేదలని భావిస్తున్నారా? లేక కార్పొరేటర్లకు గిఫ్ట్‌లు ఇవ్వాలని అనుకుంటున్నారా?

బడ్జెట్ సెషన్ అంటే చాలు, చట్టసభలలో సభ్యులకు వివిధ రకాల గిఫ్ట్‌లు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇది ఎవరు తెచ్చిన సంప్రదాయమో తెలియదు, కానీ బడ్జెట్ అంటే పద్దులు, కొత్త పన్నుల వాయింపు ఉంటుంది. ప్రజలకు భారం, మోసమో, ఖేదమో కానీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులకు మాత్రం హర్షామోదమే.

అందుకే బడ్జెట్ సెషన్ అంటే అంత స్పెషల్. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) బడ్జెట్ సమావేశాలు తాజాగా జరిగాయి. ఈ సమావేశాలలో భాగంగా జీవీఎంసీ కార్పొరేటర్లకు ఒక్కొక్కరికీ 25,000 రూపాయల విలువ చేసే గిఫ్ట్ కూపన్లు బహుమతిగా ఇచ్చారు.

అలాగే ఎక్స్-అఫీషియో మెంబర్లుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా ఈ గిఫ్ట్ కూపన్లు ఇచ్చారు. దీనిపై సీపీఎం కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ, “గిఫ్ట్ కూపన్లు మాకు ఎందుకు?” అని ప్రశ్నించారు. ప్రజలు కష్టార్జితంతో చెల్లించిన పన్నులను ఇలా గిఫ్టుల పేరుతో ఖర్చు చేయడం తగదని అన్నారు. మొత్తం 30 లక్షల రూపాయలకు పైగా ఈ విధంగా దుబారా ఖర్చు చేశారని అధికారుల మీద మండిపడ్డారు.

“ఎమ్మెల్యేలు, ఎంపీలు పేదలని భావిస్తున్నారా? లేక కార్పొరేటర్లకు గిఫ్ట్‌లు ఇవ్వాలని అనుకుంటున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ ఈ గిఫ్ట్ కూపన్లను తిరస్కరించి, కార్పొరేషన్‌కు 30 లక్షల ఆదాయాన్ని మిగిలించాలని ఆయన డిమాండ్ చేశారు.

జీవీఎంసీ ఈ నిధులతో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. వామపక్ష ప్రజా ప్రతినిధి కావడంతో ఆయన తిరస్కరించారు, కానీ ఎంత మంది వీటిని తిరిగి వెనక్కి ఇస్తారన్న చర్చ మాత్రం కొనసాగుతోంది. ప్రజల సొమ్మును ఖర్చు చేసే విషయంలో బాధ్యతగా ఉండాలని ఆయన చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. కానీ వాటిని ఎంత మంది ఆచరణలో పెడతారు అన్నది కూడా చూడాలి అని అంటున్నారు.

One Reply to “ఎంపీ, ఎమ్మెల్యేలు పేదలా… పాతిక వేల గిఫ్ట్ కూపన్లు!”

Comments are closed.