ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికల్లో పార్టీలు బలాబలాలు తేల్చుకునేందుకు పోటీ పడుతుంటాయి. పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఎన్నికలు ఉన్నాయి.
వచ్చే నెల చివరి వారంలో మరో ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఇది కేవలం హైదరాబాదుకే పరిమితం. అదే హైదరాబాద్ లోకల్ అథారిటీస్ (ప్రజాప్రతినిధులు) కోటా ఎమ్మెల్సీ ఎన్నిక. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వచ్చే నెల 23న పోలింగ్ జరుగుతుంది. 25న రిజల్టు వస్తుంది. ఇంతవరకు బాగా ఉంది. ఇక అసలు విషయం ఏమిటంటే…ఈ ఎన్నికలో ఎంఐఎం పార్టీ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం పక్కాగా ఉంది. ఇదెలా అంటారా?
ఈ ఎన్నికలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ పోటీ చేయడంలేదు. ఎందుకంటే.. జీహెచ్ఎంసీలో ఆ పార్టీకి బలం లేదు. ఇక కాంగ్రెసుకు బద్ధ శత్రువైన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా పోటీ చేయడంలేదు. ఆ పార్టీకి బలం ఉన్నప్పటికీ ఎందుకో ఎన్నికకు దూరంగా ఉంది. ఇక్కడ విచిత్రమేమంటంటే … కాంగ్రెసు అండ్ బీఆర్ఎస్ రెండు పార్టీలూ ఎంఐఎం పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తమకు మద్దతు ఇచ్చిందని, అందుకే తాము పోటీ చేయకుండా ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెసు చెబుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానికి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెసుకు ఫ్రెండుగా వ్యవహరిస్తోంది.
2020 డిసెంబర్ నెలలో జరిగి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 56 స్థానాలు, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధింగా కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మారిన పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరింది. మరికొంత మంత్రి బీఆర్ఎస్, బీజేపీ కార్పోరేటర్లు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన బలం కాంగ్రెస్ పార్టీకి లేకపోవడంతోనే ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
గత నెల జరిగిన రెండు టీచర్, ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికకు కాంగ్రెసు పార్టీ దూరంగా ఉంది. ఇక ఈ ఎన్నికకు బీజేపీ కూడా దూరంగానే ఉండాలని డిసైడ్ అయింది. మొదట్లో ఈ ఎన్నికకు బీజేపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని.. ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టుగా బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో బీజేపీ.. ఈ ఎన్నికలో పోటీ చేయాలనే ఆలోచనలో పడినట్టుగా వార్తలు వచ్చినా తరువాత పోటీ చేయడం లేదని ప్రకటించింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం తమ పార్టీ అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్‌ను ప్రకటించింది. ఇది చాలా చిన్న ఎన్నిక. మొత్తం 127 ఓట్లు కాగా.. అందులో 9 ఖాళీగా ఉన్నాయి. దీంతో 118 మందికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే 60 ఓట్లు వస్తే గెలిచినట్టుగా లెక్క. పార్టీల వారీగా.. ఎంఐఎంకు 52, బీఆర్ఎస్‌కు 41, బీజేపీకి 25 ఓట్లు ఉన్నాయి. అయితే ఎంఐఎంకు బీఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అనుకోవచ్చు. మూడు పార్టీలు ఎన్నిక నుంచి తప్పుకోవడంతో ఎంఐఎం పంట పండింది.