విజయనగరం జిల్లా టీడీపీ సీటు ఎవరికి ఇస్తారు అన్న ఉత్కంఠను కోరి రాజేసింది తెలుగుదేశం అధినాయకత్వం. అక్కడ టీడీపీకి ఇంచార్జ్ ఉన్నారు. ఆయన గత అయిదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయనను పార్టీ నమ్మింది. జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా సైతం చేసింది.
ఆయనే 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున చీపురుపల్లి లో పోటీ చేసిన కిమిడి నాగార్జున. తాజా ఎన్నికల్లో ఆయన పేరుని ఏ దశలోనూ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం ఆయనతో పాటు ఆయన అనుచరులకు తీవ్ర మనస్థాపానికి గురి చేసింది.
విశాఖలో ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శ్రీకాకుళానికి చెందిన మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తో పాటు అనేక పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. వారి పేర్లతోనే సర్వే నిర్వహించారు. చివరికి ఈ సీటు కిమిడి కళా వెంకట్రావుకు వెళ్ళింది. టీడీపీ తాజాగా రిలీజ్ చేసిన జాబితాలో ఆయన పేరు ఉంది. ఆయన ఎవరో కాదు చీపురుపల్లి టికెట్ ని ఆశిస్తున్న కిమిడి నాగార్జునకు స్వయాన పెదనాన్న. ఆయనకు టికెట్ ఇస్తే అబ్బాయి సర్దుకుంటారు అని అనుకున్నారు.
కానీ పేకాటలోనూ రాజకీయాల్లోనూ బంధాలు ఉండవు. అదే నిజం చేస్తూ కిమిడి నాగార్జున టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ కొసం ఆరుగాలం పనిచేస్తున్నా తనకు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగార్జున తన పదవికి రాజీనామా చేశారు.
యువకుడిగా ఉన్న నాగార్జునని పార్టీ గెలుపు కోసం వాడుకుంటూ ఆయనకే టికెట్ ఇచ్చి ఉండాల్సింది అని అంటున్నారు. అయిష్టంగా చీపురుపల్లి వైపు వస్తున్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు నాగార్జున సహకారం దక్కకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పార్టీని అయిదేళ్ళుగా నమ్ముకుని రాజకీయం చేస్తున్న వారికి యువతకు టీడీపీ హై కమాండ్ ఇచ్చే విలువ ఇదేనా అని నాగార్జున అనుచరులు అంటున్నారు.