ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నది తెలియదు. ఏప్రిల్ తొలివారంలో వుంటాయన్నదే తెలుసు. ఈ మేరకు వైకాపా నేత జగన్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్దులు వీళ్లే అనిపించేలా, నియోజక వర్గాల ఇన్ చార్జ్ లు అంటూ కొన్ని పేర్లు విడతలు విడతలుగా ప్రకటిస్తూ వచ్చారు. అలా ప్రకటించినపుడల్లా గడబిడే. అలకలు, రాజీనామాలు, పార్టీ మారడాలు. మర్నాడు ఎల్లో మీడియాకు వార్తల పండగే పండగ. అప్పటికి ఇంకా తెలుగుదేశం-జనసేన, భాజపా వ్యవహారం టికెట్ ల పంపిణీ వరకు రాలేదు. వైకాపా నుంచి బయటకు వస్తున్నవారిని అక్కున చేర్చుకునే పని మొదలుపెట్టింది ఈ కూటమి. అయితే తెలుగుదేశం లేదా జనసేన కండువా కప్పడం స్టార్ట్ చేసారు. ఈ నేపథ్యంలో ఇక వైకాపా పనైపోయింది అనేంతగా రాతలు.
కట్ చేస్తే, కాలం గడిచింది. వైకాపా నుంచి వెళ్లిన వాళ్లు వెళ్లారు. సర్దుకున్న వాళ్లు సర్దుకున్నారు. సర్దుబాటులు చేయగలిగినవి చేసారు. ఈ లోగా తేదేపా-జనసేన సీట్ల లెక్క మొదలైంది. అప్పుడు అసలు పండగ ఆరంభమైంది. జనసేన నుంచి నిట్టూర్పులు, నిరసనలు. మెల్లగా టికెట్ ల కేటాయింపు ప్రారంభమైంది అన్ని పార్టీల్లో. అప్పుడు చూడాలి మజా. ఎల్లో మీడియా రాయమన్నా రాయదు. అక్షరాల వెనుక కప్పి పెట్టడం తప్ప. కానీ సోషల్ మీడియా ఆగదుగా.
పిఠాపురం నుంచి అనపర్తి మీదుగా అనంతపురం వరకు ఎక్కడ అసంతృప్తి జ్వాలలు ఎలా రాజుకున్నాయో, తెలుగుదేశం జెండాలే కాదు, చంద్రబాబు ఫొటొలు కూడా ఎలా తగలబెడుతున్నారో కళ్లకు కట్టినట్లు సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
తెలుగుదేశం- జనసేన- భాజపా కూటమిలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడానికి కూడా కారణం ఈ ఎల్లో మీడియానే. తెల్లవారి లేస్తే చాలు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది, వైకాపా పాతాళానికి పడిపోయింది అనే వార్తలు వండి వారుస్తున్నారు. దాంతో ప్రతి చోటా, తాము పోటీ చేసేసి, గెలిచేసి అధికారం అనుభవించేయాలి, మంచి తరుణం మించిన దొరకదు అనుకుంటున్నారు. అలాంటి అవకాశం చేజారేసరికి అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు.
అదే సమయంలో అటు జనసేనకు..భాజపాకు కలిపి అసెంబ్లీ అయితేనే, పార్లమెంట్ అయితేనే దాదాపు 40 స్ధానాలకు పైగా ఇచ్చేయాల్సి వచ్చింది. దాంతో ఆ నలభై స్ధానాల్లో కనీసం 30 చోట్ల తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకులు వున్నారు. వారంతా గడబిడ మొదలుపెట్టారు.
మొత్తం మీద ఈ గడబిను కనీసం నామినేషన్ పర్వం వచ్చే వరకు భరించాలి. ఎందుకంటే ఎంత అల్లరి చేస్తే అంత ఎఫెక్ట్ వుంటుంది.. ఇచ్చిన టికెట్ క్యాన్సిల్ చేసి, తమకు ఇస్తారు అనే ఆశ వుంటుంది. అందువల్ల ఈ గడబిడ కొనసాగుతూనే వుంటుంది. కొన్ని చోట్ల రెబల్స్ తప్పవు. ముఖ్యంగా భాజపాకు ఇచ్చిన సీట్లు మళ్లీ తామే లాగేసుకునేందుకు రెబల్స్ ను ఎంకరేజ్ చేయడం అన్నది తెలుగుదేశం పార్టీకి అలవాటే.
గమ్మత్తేమిటంటే ఈ గడబిడకు కొన్ని వారాల ముందే వైకాపా గడబిడ ముగిసిపోయింది. వెళ్లి పోయిన వాళ్లకు బై చెప్పేసారు. వాళ్లకి వెల్ కమ్ చేప్పి తేదేపా కూటమి టికెట్ లు ఇచ్చేసుకుంది. దాంతో ఆ పార్టీ తెరవెనుక సర్దుబాటులు వీలైతే చేసుకుంది. లేదంటే ఊరుకుంది. కానీ కిందా మీదా అయిపోయి సోషల్ మీడియాలో నానుతోంది తెలుగుదేశం-జనసేన కూటమి మాత్రమే.