జగన్మోహన్ రెడ్డి రాయి తగిలి గాయపడగానే.. ఇప్పుడు తెలుగుదేశం దళాలన్నీ కూడా సెకండ్ ఫేజ్ యాక్షన్ ప్లాన్ లోకి దిగాయి. రాళ్ల దాడి వెనుక తమ పార్టీ ప్రమేయం ఉన్నదనే గుట్టు బయటకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలకు దిగుతున్నారు. తమ కుట్ర బయటకు రాకుండా ఉండడం మాత్రమే కాదు. ముఖ్యమంత్రి జగన్ తన మీద తన వాళ్లతోనే రాళ్లు వేయించుకుని గాయపడినట్టుగా ప్రచారం చేయడానికి తెలుగుదేశం దళాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి.
సీబీఐ, ఎన్ఐఏ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి జగన్ మీద జరిగిన రాళ్ల దాడికి సంబంధించి సీబీఐ విచారణ డిమాండ్ చేయడమే అతిపెద్ద కుట్రగా కనిపిస్తోంది.
జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూనే.. ఈఘటన మీద నిష్పక్షపాత విచారణ జరిపించాలని బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని ఈసీ ని చంద్రబాబునాయుడు కోరారు. ఈ మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే.. చంద్రబాబునాయుడు దుర్బుద్ధిని బయటపెడుతున్నాయి.
సాధారణంగా పగవాడు అయినా సరే.. ఒక నాయకుడి మీద దాడి జరిగినప్పుడు, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎవ్వరైనా డిమాండ్ చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుర్మార్గపు పోకడలు రాకూడదు.. అని జనం కోసం అయినా నాలుగు వాక్యాలు వల్లిస్తారు. అలాంటిది.. నలభై నాలుగేళ్ల సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. దాడిచేసిన వాళ్లకు శిక్ష పడాలి అని అడగడం లేదు. ఆయన మెయిన్ ఫోకస్ మొత్తం.. అధికారులకు శిక్ష పడడం మీద మాత్రమే ఉంది. అంటే ప్రభుత్వమే ఇలాంటి దాడిని చేయించినట్టుగా నిరూపించాలని ఉబలాటపడిపోతున్నారు.
చంద్రబాబునాయుడు చాలా లౌక్యంగా ఒక గీత వరకు మాత్రమే మాట్లాడారు. కానీ.. ఆయన తైనాతీలు, అనుచరులు అందరూ జగన్ మీద దాడిని డ్రామాగా కొట్టి పారేయడానికి నానా పాట్లు పడుతున్నారు. దీనిని కోడికత్తి డ్రామా 2.0 గా అభివర్ణిస్తున్నారు. కరెంటు పోవడం, దాడి తర్వాత అంబటి రాంబాబు లైవ్ లోకి వచ్చి ఖండించడం వల్ల దాడి మొత్తం ముందుగా ప్లాన్ చేసుకుని చేయించినట్లుగా అచ్చెన్నాయుడు అభివర్ణించడం అసహ్యంగా ఉంది. సానుభూతి కోసం ఇదంతా చేస్తున్నట్టుగా కేశవ్ లాంటివాళ్లు అంటున్నారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడు తాము భారతీయ జనతాపార్టీతో అంటకాగుతున్నాం గనుక.. సీబీఐ విచారణకు పురమాయిస్తే.. కేంద్రంలోని బిజెపి ద్వారా విచారణను ప్రభావితం చేయవచ్చునేమో అని తెలుగుదేశం దళాలు ఆశిస్తున్నాయేమో తెలియదు. కానీ.. ఇలా దాడి జరిగిన వెంటనే.. ప్రాథమిక వివరాలు కూడా బయటకు రాకుండానే.. సీబీఐ విచారణ అడగడం అనేది వారి ముందస్తు కుట్రగానే ఉన్నదని పలువురు భావిస్తున్నారు.