ఒక్కసారి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డామంటే, ఆ డబ్బు మొత్తాన్ని వెనక్కు రాబట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా చెబుతుంటారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ.. అప్పటికే ఎకౌంట్ నుంచి జారిన డబ్బు, వివిధ ఎకౌంట్లకు, వ్యాలెట్లకు చేరిపోతుంది. దీంతో అన్నింటినీ ఒకచోటుకు చేర్చి, నగదును రికవరీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది.
అయినప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నారు. చాలామందికి పోగొట్టుకున్న డబ్బు వెనక్కి తిరిగిచ్చిన సందర్భాలున్నాయి. కానీ వారణాసిలో జరిగిన అతిపెద్ద సైబర్ మోసంలో ఇప్పటివరకు ఇంకా రికవరీ జరగలేదు.
గత నెలలో వారణాసికి చెందిన ఓ రిటైర్డ్ మహిళా ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలలో పడ్డారు. ఏకంగా 3 కోట్ల 55 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ రికవరీ అవుతున్న మొత్తం మాత్రం లక్షల్లోనే ఉంది. ఇంకా మరిన్ని అరెస్టులు జరుగుతాయని చెబుతున్నారు.
సిగ్రా పోలీస్ స్టేషన్ పరిథిలో ఉండే సంపా రక్షిత్ అనే రిటైర్డ్ ఉద్యోగికి ట్రాయ్ అధికారులమంటూ కాల్ వచ్చింది. మరో 2 గంటల్లో ఫోన్ పనిచేయడం ఆగిపోతుందని, ఆ వెంటనే పోలీసులు వస్తారని భయపెట్టారు. ఆ వెంటనే పోలీస్ అంటూ మరో వ్యక్తి కాల్ చేసి, ఆమె ఎకౌంట్ నుంచి దశలవారీగా రూ.3.55 కోట్లు జమ చేయించుకున్నాడు.
జరిగిన ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. 12 మందిని అరెస్ట్ చేశారు, తాజాగా మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. లక్షా 20వేల నగదు, 32 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా రాజస్థాన్ లోని కేక్రి జిల్లాకు చెందిన ఒకే ముఠా సభ్యులు. అయితే డబ్బు ఇంకా వెనక్కురాలేదు. మరిన్ని అరెస్టులు చేస్తామంటున్నారు పోలీసులు.