అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గానికి చెందిన యువ నేత ఒకరు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఆయన విద్యార్ధి ఉద్యమాల జనంలో ఉన్నారు. టీడీపీలో విద్యార్ధి విభాగంతో పాటు యువత విభాగంలో పనిచేసారు. గవర సామాజిక వర్గానికి చెందిన ఆడారి కిశోర్ కుమార్ వైసీపీలో చేరడం టీడీపీకి దెబ్బ అని అంటున్నారు.
చంద్రబాబు గత ఏడాది అరెస్ట్ అయినపుడు విశాఖలో టీడీపీ తరఫున ఉద్యమాలు చేశారు. చంద్రబాబు భక్తుడిగా టీడీపీ వీరాభిమానిగా పేరున్న ఆడారి ఉన్నత విద్యావంతుడు. అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం ఆయన అర్జీ పెట్టుకున్నారు. కూటమి తరఫున పారాచూట్ నేతను పోటీకి దింపిన టీడీపీ స్థానికతను పూర్తిగా విస్మరించింది. దాంతో బలమైన గవర సామాజికవర్గం రగులుతోంది అని అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో ఆడారి జగన్ ని కలసి తన మద్దతు తెలిపారు. వైసీపీలో చేరారు. లోకల్ క్యాండిడేట్ అయిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని వైసీపీ నిలబెట్టింది. ఆయనను గెలిపించేందుకు ఈ యువ నేత ముందుకు వచ్చారు.
పైపెచ్చు వైసీపీలో చూస్తే బలమైన గవర నేతలు తక్కువగా ఉన్నారు. ఫ్యూచర్ లో ఆడారికి వైసీపీలో హామీలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా ఎదగాలని దశాబ్ద కాలంగా వేచి చూస్తున్న ఆడారి పసుపు పార్టీలో ఇమడలేకపోయారు అని అంటున్నారు. గతంలో వైసీపీలో ఫౌండర్ గా ఉన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అలాగే ఆ పార్టీలో రెండు సార్లు చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీ కూటమిలోనే ఉన్నారు.
దాంతో అనకాపల్లి వైసీపీకి గవర సామాజిక వర్గం నుంచి యువ నాయకత్వంగా ఈ నేత ఉంటారని అంటున్నారు. వైసీపీకి ఇది ఒక మంచి పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీకి అనకాపల్లి ఎంపీ సీటులో సానుకూలత ఉంది స్థానికులనే ఎపుడూ గెలిపించుకుంటూ వస్తున్న సంప్రదాయం అనకాపల్లి వాసులది.
వారి ముందు ఎటువంటి తళుకు బెళుకులూ పనిచేయవు. ఎంతమంది బిగ్ షాట్స్ వచ్చినా వారు లోకల్ నే తమ ఓటు అంటారు. అది 2009లో కళ్ళకు కట్టినట్లుగా ఒకసారి రుజువు అయింది. అయినా మరో ప్రయత్నం కూటమి చేస్తోంది. ఈసారి రిజల్ట్ కూడా వైసీపీకి అనుకూలంగానే అని ఆ పార్టీ ధీమాగా ఉంది.