గాజువాకలో మొదట తడబడినా పోలింగ్ తేదీ దగ్గర పడే సమయానికి వైసీపీ బాగా పుంజుకుంది. గాజువాకలో కుల సమీకరణలు వైసీపీకి అనుకూలిస్తున్నాయి. ఒక బలమైన సామాజిక వర్గం పదిహేనేళ్ల తరువాత మళ్లీ ఎమ్మెల్యే పదవి తమకు దక్కాలని అనుకుంటోంది. 2009లో పెందుర్తి నుంచి విడిపోయి గాజువాకగా ఏర్పడిన తరువాత తొలి ఎన్నికల్లో బలమైన ఒక సామాజిక వర్గం నుంచి అభ్యర్థి గెలిచారు.
విభజన తరువాత 2014లో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిగా టీడీపీ నుంచి బరిలోకి దిగిన పల్ల శ్రీనివాస్ విజయం సాధించారు. 2019లో రాజకీయంగా పలుకుబడి కలిగి గాజువాకలో పటిష్టంగా ఉన్న మరో సామాజిక వర్గం నుంచి తిప్పల నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచారు.
ఇప్పుడు చూస్తే వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాధ్ కి టికెట్ ఇచ్చింది. ఆయన మంత్రిగా ఉంటూ పోటీ చేస్తున్నారు. మొదట్లో అమర్నాధ్ కి వ్యతిరేకంగా ఉంది అని వచ్చిన సర్వేలు ఇప్పుడు మెల్లగా మారుతున్నాయి. ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా పరిస్థితిని అనుకూలం చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పాలి.
అదే విధంగా బలమైన సామాజిక వర్గం ఆయనకు అండగా ఉంటోంది. పైపెచ్చు గుడివాడది రాజకీయ కుటుంబం కావడంతో పాటు ఆయన తాత తండ్రులు గెలిచిన సీటు కూడా అక్కడే ఉండడం మంత్రికి పాజిటివ్ వేవ్ క్రియేట్ చేస్తోంది అని అంటున్నారు. గాజువాకలో సామాజిక వర్గాల పరంగా పోలరైజేషన్ స్టార్ట్ అయింది. దాంతో వైసీపీకి గెలుపు ధీమా ఏర్పడింది.
పొలిటికల్ పోలరైజేషన్ కూడా వేగంగా సాగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం టీడీపీ కూటమికి ప్రతికూలంగా మారుతోంది అని అంటున్నారు. అది వైసీపీ ప్లస్ చేసుకునే పనిలో పడింది. జగన్ ఉత్తరాంధ్రా పర్యటన సందర్భంగా జీవీఎంసీ తొలి మేయర్ గా పనిచేసిన పులుసు జనార్ధనరావు వైసీపీలో చేరడం మరింత బలాన్ని ఇస్తోంది.
రానున్న రోజులలో సమీకరణలు పూర్తిగా తమకు సహకరిస్తాయని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గుడివాడ 2019లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి తన సొంత సీటు నుంచి పోటీ చేస్తున్నారు. గాజువాక తమ కుటుంబాన్ని ఆదరించిన ప్రాంతమని శాశ్వత నియోజకవర్గంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నుంచి పోటీలో ఉన్న పల్లా శ్రీనివాసరావు కూడా బలమైన అభ్యర్ధిగానే ఉన్నారు. మొదట్లో ఈజీ అనిపించిన ఈ సీటు టీడీపీకి టఫ్ గా మారుతోంది. ఈ టఫ్ ఫైట్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.