ఎన్నికలు వస్తే టీడీపీకి చెందిన ఆ మాజీ మంత్రికి పండుగ అని వైసీపీ నేత నర్శీపట్నం ఎమ్మెల్యే అభ్యర్ధి పెట్ల ఉమా శంకర్ గణేష్ సెటైర్లు వేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు తన కుమారుడికి టికెట్ అని అడిగిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆ మాట మరచిపోయారని, ఆయనకు డబ్బులు ఉంటే చాలు అని పెట్ల అంటున్నారు.
టికెట్ పట్టుకుని వచ్చిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడమే అయ్యన్న కార్యక్రమం అన్నారు. అందుకే ఆయన ఎన్నికలలో టికెట్లు అడుగుతూంటారని తీరా సమయం వచ్చినపుడు ఆ డిమాండ్ నే సొమ్ముగా మార్చుకుంటారని పెట్ల ఫైర్ అయ్యారు.
గతంలో నూకారపు సూర్యప్రకాశరావు, ఆయన తరువాత అవంతి శ్రీనివాసరావు, ఇపుడు సీఎం రమెష్ వద్ద అయ్యన్న డబ్బులు లాగేసారని అన్నారు. అనకాపల్లి ఎంపీగా ఎవరు పోటీలో ఉంటే వారి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం ద్వారా ఎన్నికలను పండుగగా చేసుకోవడం ఎలాగో అయ్యన్నకే తెలుసు అంటున్నారు.
చాలా మందికి ఎన్నికలు వస్తే అంతా ఖర్చు గా ఉంటుందని కానీ అయ్యన్నకు మాత్రం డబ్బులు మిగులుతాయి తప్ప ఖర్చు అన్నది లేదని అదే ఆయన సీనియర్ నేతగా సాధించింది అని మొత్తం అయ్యన్న గురించి చెప్పేశారు.
అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ కోసం ఎంపీ టికెట్ కావాలని అడిగారు. ఇవ్వకపోయినా ఆయన సర్దుకు పోతున్నారు అంటే టికెట్ సాధించిన వారితోనే ఆయనకు ఎన్నికల పండుగ సాగుతోందని అంటున్నారు. పైకి బీరాలు పలుకుతూ అందరికీ తిడుతూ పోలీసులు తన ఇంటికి వస్తే పారిపోయే రకం అయ్యన్న అన్నారు.
మరో నలభై రోజులు ఆగితే అయ్యన్నను ప్రజలు అంతా తరిమికొడతారు అని పెట్ల అంటున్నారు. ఆయన చేసిన సేవ ఏంటో జనాలకు తెలుసు కాబట్టే ఎన్నికల్లో ఆయనని ఓడించి తీరుతారు అని జోస్యం చెప్పారు. సీఎం రమేష్ అభ్యర్ధి కావడం అయ్యన్నకు పండుగ మాదిరిగా ఉందని పెట్ల చెబుతున్నారంటే అయ్యన్నా మజకానా అంటున్నారు అంతా.