బాబుతో డీల్ ఓకే: అసెంబ్లీ బరిలోకి రఘురామ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, తన అయిదేళ్ల పదవీకాలం మొత్తాన్నీ జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లడానికే వెచ్చించిన రఘురామక్రిష్ణ రాజు.. ఇప్పుడు అసెంబ్లీ బరిలోకి దిగాలనుకుంటున్నారు. Advertisement అన్ని పార్టీలూ అన్ని…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, తన అయిదేళ్ల పదవీకాలం మొత్తాన్నీ జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లడానికే వెచ్చించిన రఘురామక్రిష్ణ రాజు.. ఇప్పుడు అసెంబ్లీ బరిలోకి దిగాలనుకుంటున్నారు.

అన్ని పార్టీలూ అన్ని స్థానాలకూ అభ్యర్థులను తేల్చేసిన తర్వాత.. ఇంకా ఎమ్మెల్యే బరిలోకి ఎలా వస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా? లేదా, రఘురామకు ఇండిపెండెంటుగా పోటీ చేసేంత ధైర్యం వచ్చేసిందా? అని ఆశ్చర్యపోతున్నారా? మీ అనుమానాలు సబబే గానీ.. మొత్తానికి ఏదో ఒక అడ్డదారిలో అసెంబ్లీ బరిలో దిగడానికి రఘురామక్రిష్ణ రాజు, మార్గం సుగమం చేసుకున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతో ఈ మేరకు ఆయన డీల్ కుదుర్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సేఫ్ సీట్లలో ఒకటైన ఉండి నుంచి ప్రస్తుతం ప్రకటించిన సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తప్పించి, రఘురామక్రిష్ణ రాజుకు టికెట్ కట్టబెట్టడానికి చంద్రబాబు ఓకే చెప్పినట్టు సమాచారం. ఒకటిరెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది.

రఘురామక్రిష్ణ రాజు.. ప్రస్తుతం ఉన్న నరసాపురం నుంచే మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. ఏ పార్టీ అనేది తర్వాత చెప్తాను గానీ.. పోటీ మాత్రం గ్యారంటీ అని ఆయన అన్నారు. పొత్తులు కుదిరిన తర్వాత.. ఆ సీటు ఎవరికి దక్కినా సరే.. తనను మించి మరొక అభ్యర్థి వారికి దొరకరని విర్రవీగారు

బిజెపి, జనసేన, తెలుగుదేశం అందరితో తాను సఖ్యంగా ఉంటాను గనుక.. సీటు ఖరారు అనుకున్నారు. కానీ.. తీరా నరసాపురం సీటు బిజెపికి దక్కిన తర్వాత వారు మరొకరికి టికెట్ ఇచ్చేశారు. అలా జరగడానికి కూడా జగనే కారణమని, జగన్ తనకు టికెట్ రాకుండా బిజెపి పెద్దలకు చెప్పాడని నిందలు వేసిన రఘురామక్రిష్ణ రాజు.. తీరా ఇప్పుడు ఎమ్మెల్యే బరిలోకి దిగబోతున్నారు.

చంద్రబాబునాయుడు తనకు న్యాయం చేస్తారని, గోదావరి జిల్లాలనుంచే ఎన్నికల బరిలో ఉంటానని ఆయన అంటూ వచ్చారు. తాజాగా తన స్వగ్రామం పెదఅమిరంలోని నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన రఘురామ ఇప్పటికీ ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీచేయడమైతే గ్యారంటీ అని డొంకతిరుగుడుగానే చెబుతున్నారు గానీ.. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఉండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారు.

అక్కడ మంతెన రామరాజు తెలుగుదేశానికి సిటింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు అభ్యర్థి కూడా ఆయనే. ఆయనను పక్కకు తప్పించి.. రఘురామకు టికెట్ ఇచ్చేలా చంద్రబాబుతో డీల్ కుదిరిందట. అధికారిక ప్రకటన కూడా వస్తుందిట. ట్విస్టు ఏంటంటే.. గెలిచిన తర్వాత తనకు ఏ పదవి కావాలో కూడా చెప్పడం. చాలా మంది తనను అసెంబ్లీ స్పీకరుగా చూడాలని కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.