వంగవీటి రాధాకృష్ణ… దివంగత వంగవీటి రంగా కుమారుడు. టీడీపీ హయాంలో దీక్షలో ఉన్న రంగాను అత్యంత పాశవికంగా చంపారు. రంగా హత్య టీడీపీని అధికారానికి దూరం చేసింది. రంగా హత్య తర్వాత ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు, కమ్మల మధ్య స్పష్టమైన విభజన వచ్చింది.
రంగా వారసుడిగా రాధా రాజకీయాల్లోకి వచ్చారు. ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇంతకు మించి వంగవీటి రాధా ఎదగలేకపోతున్నారు. దీనికి ఆయన స్వీయ తప్పిదాలే కారణం. రాజకీయంగా రాధా వేస్తున్న తప్పటడుగులు, ఆయన రాజకీయ పంథాను సవ్యంగా సాగనివ్వడం లేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకున్న సమయంలో, ఆయన ఆ పార్టీని వీడి తన తండ్రిని చంపిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీలో చేరారు.
పోనీ, ఆ పార్టీలో అయినా నిబద్ధతతో రాజకీయాలు చేశారా? అంటే …అదీ లేదు. కనీసం ఆయనకు ఒక సీటు ఇచ్చే దిక్కుకూడా లేకపోయింది. కానీ రంగాకు కాపుల్లో ఉన్న పలుకుబడిని రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ఆయన్ను వాడుకుంటున్నారు. చివరికి తిరుపతి జిల్లా చంద్రగిరికి రాధాను రప్పించాలనే ఆలోచన వచ్చిందంటే టీడీపీ నేతలు ఎంతగా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
అనకాపల్లికి కూడా రాధాను తీసుకెళ్లి ప్రచారం చేయించుకున్నారు. రాజకీయాల్లో సీరియస్‌గా వుండాలని గట్టిగా నిర్ణయించుకుంటే, ఎమ్మెల్యే లేదా ఎంపీగానో పోటీ చేయాలి. అవన్నీ వదిలేసి.. ఇతరుల పల్లకీ మోయడానికి దివంగత రంగా పేరును వాడుకోవడం ఏ మేరకు సబబో రాధా ఆలోచించాలి. వంగవీటిని కాస్తా…వంగేవీటిగా మార్చే హక్కు రాధాకు ఎవరిచ్చారనే ప్రశ్న దివంగత రాధా-రంగా మిత్రమండలి నుంచి వస్తోంది.
కావున తన తండ్రి, పెదనాన్న ప్రతిష్ట పెంచే రాజకీయాలు చేయడం చేతనైతే, కొనసాగాలి. ఆ పని తన వల్ల కాదు అని భావిస్తే, గౌరవంగా గుడ్ బై చెప్పడం రాధాకే మంచిది. ఎక్కడెక్కడో ప్రచారానికి పనికొచ్చే రాధా… ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్‌కు అర్హుడు కాదా? అనే రంగా అభిమానుల ప్రశ్నకు టీడీపీ సమాధానం చెప్పాలి. తాను ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నానో వంగవీటి రాధా ఆలోచించుకోవాలి. ఇప్పటికే రాధాకు అంతోఇంతో ఉన్న గౌరవం కూడా సడలింది. రాధాలో మార్పు రాకపోతే, అభిమానుల్లో మార్పు చూడాల్సి వుంటుంది.