ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమలలో టిప్పర్ డ్రైవర్ అయిన నిరక్షరాస్యుడికి టికెట్ ఇచ్చారని చంద్రబాబు వెటకరిస్తే… ఏం ఇవ్వకూడదా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గర్వంగా ప్రకటించారు. ఇంత వరకూ బాగానే వుంది. అయితే టిప్పర్ డ్రైవర్‌ను గెలిపించుకునేలా వైసీపీ బాధ్యులు పని చేస్తున్నారా? అనేదే ఇప్పుడు ప్రశ్న.
శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇచ్చేందుకు వైఎస్ జగన్ నిరాకరించారు. దీంతో పద్మావతి మనస్తాపం చెందారు. టికెట్ కోసం కాళ్లు పట్టుకోవాలా? అంటూ ఆమె కన్నీళ్లతో ప్రశ్నించారు. ఆ తర్వాత కొంత సేపటికే ఆమె మాట మార్చారు. వైఎస్ జగన్ తన దేవుడని ఆమె కీర్తించారు. ప్రభుత్వ విద్యాసలహాదారుడు ఆలూరు సాంబశివారెడ్డి భార్య జొన్నలగడ్డ పద్మావతి.
ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన శింగనమలలో గత ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఐదేళ్లు తిరిగే సరికి వ్యతిరేకత సంపాదించుకున్నారు. దీంతో పద్మావతికి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక బాధ్యతను సాంబశివారెడ్డికే జగన్ అప్పగించారు. సాంబశివారెడ్డి తన కంపెనీలో పని చేసే టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకు టికెట్ ఇప్పించుకున్నారు. చంద్రబాబు వెటకరించినట్టుగా… వీరాంజనేయులు నిరక్షరాస్యుడు కాదు. బాగా చదువుకున్నాడు.
టికెట్ ఇప్పించుకున్నాడే కానీ, గెలిపించుకునే స్థాయిలో సాంబశివారెడ్డి ఆర్థిక వనరులు ఖర్చు పెట్టలేదనే విమర్శ బలంగా వుంది. టీడీపీ తరపున బండారు శ్రావణి బరిలో ఉన్నారు. టీడీపీలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ఏ సర్వే చూసినా సింగనమలలో గట్టి పోటీ వుందని అంటున్నారు. దీనికి కారణం సాంబశివారెడ్డి తీరే కారణం అంటున్నారు. జొన్నలగడ్డ పద్మావతి ప్రచారంలో ఎక్కడా కనిపించలేదని చెబుతున్నారు.
అతి సామాన్యుడైన టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చామని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్పలు చెప్పుకోడానికి సరిపోతుంది. టికెట్ ఇస్తేనే సరిపోదు. అతన్ని చట్టసభలోకి తీసుకొచ్చే వరకూ ఏం చేశారన్నదే ముఖ్యం. ఆ పని ఆశించిన స్థాయిలో జరగడం లేదనే మాట వినిపిస్తోంది. ఓడిపోవడానికైతే టిప్పర్ డ్రైవర్‌ను నిలబెట్టాల్సిన అవసరం లేదు. టిప్పర్‌ను వీరాంజనేయులు నడపగలరే తప్ప, ఆయన్ను గెలుపు తీరాలకు చేర్చే స్టీరింగ్ తన చేతల్లో వుందని సాంబశివారెడ్డి మరిచిపోవద్దు. అందుకు ఏం చేయాలో ఆలోచించాలి.