జనసేనాని పవన్‌కల్యాణ్ తెలిసో తెలియకో పిఠాపురాన్ని ఎంచుకున్నారు. రోట్లో తల పెట్టి రోకటి పోటుకు భయపడుతున్నట్టుగా జనసేన పరిస్థితి తయారైంది. పవన్‌కల్యాణ్ తనకు తానే పక్కలో బల్లేన్ని తయారు చేసుకున్నారు. టీడీపీ ఇన్చార్జ్ వర్మకు గెలుపు బాధ్యతల్ని అప్పగించిన పవన్‌కల్యాణ్‌పై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. దీంతో తమ పరువు తీశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లీడర్ అంటే తన వెంట అందర్నీ నడిపించుకునే వారని, అందుకు విరుద్ధంగా మరో పార్టీకి చెందిన నాయకుడి దయపై పవన్ ఆధారపడడం ఏంటనే ప్రశ్న జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి వస్తోంది. పిఠాపురంలో తన రాజకీయ ఉనికికి భంగం కలిగించిన పవన్‌కల్యాణ్‌ను గెలిపించేందుకు మనస్ఫూర్తిగా వర్మ పని చేస్తారని అనుకోవడం అవివేకం అవుతుందనే చర్చకు తెరలేచింది.
ఇప్పటికే పిఠాపురంలో వర్మ, అతని వెంట నడిచే కొద్ది మంది నాయకులు మాత్రమే పవన్‌కు మద్దతు ఇస్తున్నట్టు షో చేస్తున్నారని జనసేన శ్రేణులు విమర్శిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు పవన్‌కల్యాణ్ కోసం పని చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. వంగా గీత స్థానికురాలు కావడం, ఆమెకు మంచి పేరు ఉండడంతో వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా పవన్‌కల్యాణ్ ఇస్తున్న అతి ప్రాధాన్యాన్ని అలుసుగా తీసుకున్న వర్మ… తమపై పెత్తనం చేసేందుకు యత్నిస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.
తన పార్టీ శ్రేణులతో పవన్‌కల్యాణ్ గెలుపు కోసం పని చేయించడం పక్కన పెట్టి, తామేం చేయాలో వర్మ ఆదేశించడం ఏంటనే నిలదీతలు జనసేన నుంచి ఎదురవుతున్నాయి. ఒకవేళ పవన్ ఓడిపోతే, తాను చెప్పినట్టు జనసేన శ్రేణులు నడుచుకోలేదని నిందలు వేయడానికి వర్మ సిద్ధమవుతున్నారని విమర్శిస్తున్నారు. వర్మ తన పాలిట పక్కలో బల్లెం అని పవన్‌కల్యాణ్ గుర్తించలేకపోతున్నారని జనసేన నేతలు వాపోతున్నారు. ఇలాగైతే రానున్న రోజుల్లో పవన్ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని సొంత పార్టీ నుంచి హెచ్చరికలు రావడం గమనార్హం.