ఈమధ్య గులాబీ పార్టీలో, తెలుగు రాష్ట్రాల్లో, మీడియాలో తీవ్రంగా చర్చకు దారి తీసిన ఒక విషయం మీద గూలాబీ బాస్ కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. అధికారం పోయాక కొన్నాళ్ళు బిర్రబిగుసుకొని కూర్చున్నా పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి కాబట్టి బయటకు రాక తప్పలేదు. మాట్లాడక తప్పలేదు. కొన్ని బహిరంగ సభల్లో మాట్లాడాడు. పన్నెండేళ్ల తరువాత అంటే అధికారం పోయాక తొలిసారిగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నీ పాత విషయాలే చెప్పాడు. అంటే అధికారం పోయాక నిర్వహించిన బహిరంగ సభల్లో చెప్పిన సంగతులే చెప్పాడు.
ఎప్పటి మాదిరిగానే తాను ఉత్తముడినని, ఎదుటివారు అధములని మాట్లాడాడు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైన్ తాను చేయలేదని అంతా ఇంజినీర్లే చేశారని చెప్పాడు. తనకు ఇంజినీరింగ్ తెలియదన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బోగస్ అని ఈ మధ్యనే చెప్పాడు కదా. మళ్ళీ అదే చెప్పాడు. ఆ కుంభకోణంలో కవిత పాత్ర లేదన్నాడు. తన కూతురు కడిగిన ముత్యంగా బయటకు వస్తుందన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని తాను కోరుకుంటున్నానని, కానీ పార్లమెంటు ఎన్నికల తరువాత బీజేపీ కూల్చేస్తుందని అన్నాడు.
సరే… ఇంకా చాలా విషయాలు చెప్పాడనుకోండి. కానీ అసలు విషయం ఒకటుంది. గులాబీ పార్టీ ఓడిపోగానే పార్టీ నాయకులంతా ఓటమికి కారణాలేమిటో ఆత్మ విమర్శ చేసుకోకుండా, ఏం తప్పులు చేశామో అనలైజ్ చేసుకోకుండా పార్టీ పేరు మార్చినందువల్లనే ఓడిపోయామన్నారు. టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) గా మార్చినందువల్లనే ఓడిపోయామని, సెంటిమెంటు మిస్సయిందని అన్నారు. మళ్ళీ పేరు మార్చాలని అధినేతకు విన్నవించారు. కొందరు డిమాండ్ చేశారు.
కొందరు నాయకులు మరి కొంత ముందుకు పోయి పేరు మార్చే ప్రాసెస్ మొదలైందని చెప్పారు. ఈనెల 27 న పేరు మారుతుందని మీడియాలో వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ అనే పేరును వేరే వాళ్ళు తీసుకున్నారని, కాబట్టి పేరు మార్చుకునే అవకాశం లేదని కొందరు రాజకీయ పండితులు అన్నారు. కానీ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చాడు.
బీఆర్ఎస్ పేరు మార్చే ప్రసక్తే లేదని చెప్పాడు. ఎన్నికల సంఘం నిబంధనలు ఒప్పుకోవన్నాడు. జాతీయ స్థాయిలో బీజేపీ ఇమేజ్ తగ్గుతోందని, కాబట్టి తమకు అవకాశం ఉంటుంది అన్నట్లుగా మాట్లాడాడు. సరే… మొత్తం మీద గులాబీ పార్టీ నాయకులకు స్పష్టత ఇచ్చేశాడు కేసీఆర్. ఈ చర్చ ఇంతటితో ముగిసిపోయింది.