ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇరుకునపెట్టడంపై బీజేపీ జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడినట్టు తెలిసింది. 400 పార్లమెంట్ సీట్లలో గెలవడమే లక్ష్యమంటూ బీజేపీ గొప్పలు చెబుతున్నప్పటికీ, ఆ రకమైన రాజకీయ వాతావరణం కనిపించలేదని కేంద్ర నిఘా వర్గాలు ఆ పార్టీ అధిష్టానానికి నివేదికలు సమర్పించినట్టు తెలిసింది. దీంతో సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమని బీజేపీ జాతీయ నాయకత్వం అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఏపీలో కేవలం వ్యవస్థల మద్దతు కోసమే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేదనే అసంతృప్తి టీడీపీ, జనసేన నేతల్లో కనిపిస్తోంది.
బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీలు, దళితుల ఓట్లను పోగొట్టుకుంటామని తెలిసి కూడా ముందుకే వెళ్లామని, కానీ ఆ నష్టాన్ని భర్తీ చేసేలా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న మోదీ సర్కార్ నుంచి లభించలేదని టీడీపీ, జనసేన నాయకులు ఆఫ్ ది రికార్డు మాటల్లో విమర్శిస్తున్నారు.
అసలేం జరుగుతోందని టీడీపీ, జనసేన నేతలు ఢిల్లీ స్థాయిలో ఆరా తీయగా షాకింగ్ విషయాలు తెలిసొచ్చినట్టు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లడం వల్లే ఆ పార్టీ అగ్రనేతలు విద్వేషపూరిత కామెంట్స్ చేస్తున్నారని గుర్తు చేయడం విశేషం. అందుకే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకునేలా వ్యవహరించొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
ఏపీ డీజీపీ, సీఎస్ మార్పు కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలపై టీడీపీ, ఏపీ బీజేపీ, జనసేన నేతలు ఎంతగా ఒత్తిడి తెస్తున్నా, పట్టించుకోకపోవడానికి బలమైన కారణం వుందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబునాయుడు నమ్మదగ్గ నాయకుడు కాదని, కానీ జగన్ మోసగించే వ్యక్తి కాదని బీజేపీ పెద్దల అభిప్రాయం. ఈ ఎన్నికల కోసం జగన్ను ఇబ్బంది పెట్టి, టీడీపీని నెత్తిన పెట్టుకుంటే, బాబు కీలకమైన సమయంలో హ్యాండ్ ఇస్తాడని బీజేపీ అగ్రనేతలు అంటున్నారని తెలిసింది.
కేవలం జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో వుండడం వల్లే పొత్తు కుదుర్చుకున్నారే తప్ప, అభిమానంతో కాదని గుర్తు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో జగన్కు నష్టం కలిగించేలా కూటమి నేతలు కోరుకున్నట్టు వ్యవహరించకూడదనేది బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనగా చెబుతున్నారు.