రాజకీయ సంప్రదాయాన్ని మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించనున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ పులివెందుల నుంచి నామినేషన్ వేసే రోజు, స్థానికంగా భారీ బహిరంగ సభ నిర్వహించడం ఆనవాయితీగా జగన్ పెట్టుకున్నారు. గత ఎన్నికలప్పుడు కూడా పులివెందులలో నామినేషన్ సందర్భంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ దఫా చివరి రోజు పులివెందులకు వెళ్లి జగన్ స్వయంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన తరపున దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం బస్సుయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు సభ జరగనుంది. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.
గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కడపకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో పులివెందులకు చేరుకుంటారు. పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్‌లో ఉదయం 10 నుంచి 11.15 గంటల వరకు జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం సమీపంలోని ఆర్డీవో కార్యాలయంలో 11.25 నుంచి 11.40 గంటల మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. జగన్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైసీపీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.
భారీ ర్యాలీ, అనంతరం బహిరంగ సభను విజయవంతం చేసి, జనంలోకి పాజిటివ్ సంకేతాలు తీసుకెళ్లేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ అనంతరం తిరిగి ఆయన తాడేపల్లికి పయనమవుతారు. జగన్ ప్రచార సభలకు సంబంధించి షెడ్యూల్ వెలువడాల్సి వుంది.