ఒడ్డున పడ్డ చేపల్లా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, ఆమె సోదరి సునీత గిలగిలలాడుతున్నారు. వివేకా హత్యపై మాట్లాడొద్దని కోర్టు ఆదేశాలతో అక్కాచెల్లెళ్లిద్దరికీ ఎన్నికల ఆయుధం లేకుండా పోయినట్టైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. షర్మిల, సునీత మాత్రమే కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా వివేకా హత్యలో కాసిన్ని రాజకీయ ప్రయోజనాలు పొందాలని తహతహలాడుతున్నారు.
ఈ నేపథ్యంలో వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దని కోర్టు ఆదేశాలను సునీత, షర్మిల జీర్ణించుకోలేకపోతున్నారు. కడప కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, ఆమెను పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అనుసరించడం గమనార్హం. ప్రజల్లో వీళ్లందరి సత్తా ఏంటో కడపలో అందరికీ తెలుసు. వివేకా హత్య కేసుతో వైఎస్ అవినాష్‌రెడ్డిని ముడిపెట్టి తద్వారా జగన్‌ను ఇబ్బంది పెట్టాలనేది వీళ్లందరి కుట్ర అంటూ వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.
అయితే కోర్టు ఆదేశాలతో తమకంటూ ఎన్నికల ఆయుధం లేకుండా చేశారని చివరికి న్యాయస్థానాల్ని సైతం విమర్శించే స్థాయికి దిగజారారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. కడప బరిలో నిలిచిన షర్మిల… ఎందుకు గెలిపించాలో, ఏం చేయాలని అనుకుంటున్నారో వివరించే ప్రయత్నం చేయలేదు.
వివేకా హత్యను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకున్నట్టు వైసీపీ నేతలు విమర్శించారు. అయితే న్యాయ స్థానం ఆదేశాలతో అక్కాచెల్లెళ్లిద్దరూ పాచిక పారలేదని, అలాగే చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం నడుచుకోవడానికి అడ్డంకి ఏర్పడిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వివేకా హత్య గురించి మాట్లాడకపోతే తమను పట్టించుకునే దిక్కే వుండదని భావించి, ఆ వెంటనే హైకోర్టుకు వెళ్లారని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.