ఎన్నికల తర్వాత విశ్లేషించే వ్యాసాల్లో నేను తరచుగా లోకనీతి – సిఎస్‌డిఎస్ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్) సర్వేల ఫలితాల గురించి రాస్తూ ఉంటాను. ఫలితాల తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో అందరూ రాస్తారు. ఎందుకలా వచ్చాయో, ప్రజల్ని యింటర్వ్యూ చేసి వీళ్లు రాస్తారు. నాకు తెలిసున్నంత వరకు వీళ్లకు వ్యాపార ప్రయోజనాలు లేవు. ‘‘ఇండియా టుడే’’ అన్నా, ‘‘టైమ్స్ నౌ’’ అన్నా ‘‘ఎబిపి’’ అన్నా వీళ్లందరికీ పత్రికలు, టీవీ ఛానెళ్లు ఉన్నాయి. వాటికి యాడ్స్ రావాలని వీళ్లు ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా ప్రీ పోల్ సర్వే ఫలితాలు ఉండేట్లు మానిప్యులేట్ చేస్తారనే శంక నాకుంది. ఎగ్జిట్ పోల్స్ దగ్గరకు వచ్చేసరికి నిక్కచ్చిగానే ఉండవచ్చు. కానీ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ వంటివి నిర్వహించే టప్పుడు ప్రజలు ఫలానా పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనే ఒక మూడ్‌ను వీళ్లు క్రియేట్ చేస్తారేమోనని నా భయం.
జాతీయ, స్థానిక దిన, వార పత్రికలు తమ సంచికల్లో అప్పడప్పుడు ఓ ఎనిమిది పేజీల స్పేస్‌ను ఎడ్వర్టోరియల్ పేర సంస్థలకు, ప్రభుత్వాలకు అమ్ముతాయి. వాటిలో సంస్థల యాడ్స్‌తో పాటు వాటి గురించిన పాజిటివ్ సమాచారం కూడా యిస్తారు. దీనికి ముందు లేదా వెనక సంచికల్లో ఆ యా ప్రభుత్వాల కార్యక్రమాల గురించి మెచ్చుకుంటూ వ్యాసాలు వస్తాయి. ఇది ఎప్పణ్నుంచో జరిగే వ్యవహారం. ‘‘ఔట్‌లుక్’’ వారపత్రికకు ఎడిటరుగా పని చేసిన వినోద్ మెహతా తన ఆత్మకథలో తను పని చేసిన పత్రికలలో తను వేసిన కథనాలు కంపెనీలకు నచ్చకపోతే అవి యాడ్స్ ఆపేసిన సంగతి, పబ్లిషర్లు తనని కోప్పడిన విషయం అన్నీ రాశాడు. అందుచేత ప్రీపోల్ సర్వేల విషయంలో అంకెలన్నీ నేను ‘పించ్ ఆఫ్ సాల్ట్’తోనే గ్రహిస్తాను.
ఈ లోకనీతి, సిఎస్‌డిఎస్ సంస్థలకు స్వతంత్ర సంస్థలని అనుకుంటున్నాను. నిజానిజాలు నాకు తెలియవు. ఏ సర్వే కైనా శాంపుల్ సైజు చాలా ముఖ్యం. చాలా మంది వందల మందిని సర్వే చేసి, లక్షల మందికి దాన్ని అప్లయి చేసేస్తారు. వీళ్ల సర్వే శాంపుల్ పెద్దగా ఉండదు కానీ శాస్త్రీయంగా చేసినట్లు తోస్తుంది. నిష్ణాతులు మాత్రమే దీని గురించి వ్యాఖ్యానించగలరు. లోకనీతి-సిఎస్‌డిఎస్ తాజా సర్వేను హిందూ తన ఏప్రిల్ 13 సంచికలో వేసింది. దీనిలో ఏ యే పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది వంటి అంచనాలు యివ్వలేదు. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఏ యే విషయాలకు ప్రాధాన్యత యిస్తున్నారు వంటి గణాంకాలను యిచ్చింది. పార్టీల మేనిఫెస్టోలను తయారు చేసే వారికి యిది ఉపయోగ పడవచ్చు.
మనకు ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే, మోదీ అభిమానులు ఎన్‌డిఏ యీసారి 400 సీట్లు దాటేస్తుందని ఊహిస్తూంటే, మరి కొందరు గతంలో వచ్చిన 353 సీట్లు నిలుపుకుంటే గొప్ప, ఉత్తరాదిన మోదీ ప్రభ తగ్గిపోతోంది కాబట్టే, దక్షిణాదిపై దృష్టి పెట్టి తీవ్రంగా పోరాడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి హానీహానీగా వచ్చిన సందర్భాల్లో కూడా పార్లమెంటుకి వచ్చేటప్పటికి మోదీ మొహం చూసి ఎంపీ సీట్లు ఎక్కువగా వస్తున్నాయి. అలాటిది ఉత్తరాదిన బిజెపికి సీట్లు తగ్గుతాయని ఏ లెక్కన చెపుతున్నారా అనేది కుతూహలం కలిగించే విషయం. అది ఏ మేరకు కరక్టో తెలుసుకుందామనే ప్రయత్నంతో ఆ సర్వే ఫలితాలు చదివాను, క్లుప్తంగా మీతో పంచుకుంటున్నాను.
ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా ఓటింగు ప్రారంభమైంది. దానికి మూడు వారాల ముందు ఈ సర్వే జరిగింది. ఎన్నికలు జరిగే లోపున తమ మనసు మారే అవకాశం లేకపోలేదు అని పాల్గొన్నవారిలో 30% మంది చెప్పారు కాబట్టి, యివే ఫైనల్ అని అనుకోవద్దని సర్వే ముందుగానే హెచ్చరించింది. ఈ సర్వే ప్రకారం బిజెపి మళ్లీ అధికారంలోకి రాబోతోంది. 40% మంది బిజెపికి, 6% బిజెపి మిత్రపక్షాలకు ఓటేస్తామన్నారు. 21% కాంగ్రెసుకు, 13% కాంగ్రెసు మిత్రపక్షాలకు, 3% బియస్పీకి, 2% లెఫ్ట్‌కు, 15% యితరులకు వేస్తామన్నారు. బిజెపి, కాంగ్రెసు రెండూ 2019 కంటె ఓటు షేరు పెంచుకోబోతున్నాయి. ఎన్‌డిఏకు ఇండియా కూటమి కంటె 12 పర్శంటేజి పాయింట్ల లీడ్ ఉంది.
మోదీ నాయకత్వం అనే అంశంపై ఎన్‌డిఏకు మొగ్గు ఉంది. 48% మంది మోదీని ప్రధానిగా ఆమోదించగా, 27% మంది రాహుల్‌ను ప్రధానిగా ఆమోదించారు. రాహుల్ గ్యారంటీ కంటె మోదీ గ్యారంటీకి 7 పాయింట్ల ఎడ్జ్ ఉంది. మోదీ గ్యారంటీలపై బాగా నమ్మకం ఉందన్నవారు 23%, ఓ మాదిరిగా ఉందన్నవారు 33%, పెద్దేమీ లేదు అనేవారు 16%, అస్సలు లేదన్నవారు 19% ఉంటే కాంగ్రెసు గ్యారంటీల గురించి ఈ శాతాలు 17, 32, 20, 18 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారిలో 58% మోదీ గ్యారంటీల పట్ల విశ్వాసం ప్రకటిస్తే రాహుల్ గ్యారంటీల పట్ల విశ్వాసం ప్రకటించిన వారు 49% ఉన్నారు. పట్టణాలలో యిది 49%-48% గా, నగరాల్లో 48%-44%గా ఉంది. పేదవర్గాల్లో యిది 51%-44%, కింది మధ్యతరగతి వర్గాల్లో 54%-50%, మధ్యతరగతిలో 56%-53%, ఉన్నత వర్గాల్లో 62%-44%గా ఉంది.
చదువు రాని వాళ్లలో యిది 49%-39%, ప్రైమరీ చదివినవాళ్లలో 56%-48%, మెట్రిక్ పాసైన వాళ్లలో 59%-52%, 12 పాసైనవాళ్లలో 57%-51%, డిగ్రీ ఆ పైన చదివినవాళ్లలో 55%-51% ఉంది. 18-25 సం.ల వయసున్నవాళ్లలో యిది 58%-53%, 26-33 సం.ల వయసు వాళ్లలో 55%-52%, 46-55 వాళ్లలో 56%-47%, 55 దాటినవారిలో 52%-41% ఉంది. పదేళ్లగా అధికారంలో ఉన్నా ప్రభుత్వ పనితీరుపై 57% మంది సంతృప్తి వెల్లడించడం చెప్పుకోతగిన అంశం. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నా, మనుగడ, అధికధరలు, నిరుద్యోగం అనే అంశాలపై ఉన్న అసంతృప్తి కారణంగా రెండు కూటముల మధ్య ఫైట్ టఫ్‌గానే ఉంటుంది అని చివరకు తేల్చారు.
2019 ప్రి-పోల్ సర్వేలో 65% మంది గడిచిన ఐదేళ్ల ప్రభుత్వ తీరుపై (26% పూర్తిగా ప్లస్ 39% ఓ మోస్తరుగా) సంతృప్తి వెలిబుచ్చగా అది 2024 ప్రి-పోల్ సర్వే నాటికి అది 57% (23% పూర్తిగా ప్లస్ 34% ఓ మోస్తరుగా) కు తగ్గింది. అసంతృప్తి వెలిబుచ్చిన వారి శాతం 30 (12% ఓ మోస్తరు అసంతృప్తి, 18% పూర్తి అసంతృప్తి) నుంచి 39 (19% ఓ మోస్తరు అసంతృప్తి, 20% పూర్తి అసంతృప్తి)కి పెరిగింది.
ఎన్‌డిఏ కూటమిని మళ్లీ ఎందుకు ఓటేస్తున్నారు అని అడిగితే 42% మంది పని తీరు బాగుంది అన్నారు, 18% సంక్షేమ పథకాలు అన్నారు, మోదీ గొప్ప నాయకుడు అని 10% అన్నారు. మోదీ పాలనలో అతి ముఖ్యమైన విషయం ఏది అని అడిగితే అయోధ్యలో రామాలయం కట్టడం అని 23%, ఉద్యోగకల్పన అని 9%, దారిద్ర్య్ నిర్మూలన అని 8%, అంతర్జాతీయంగా దేశం యిమేజిని పెంచడం అని 8%, రోడ్లు వేయడం వగైరా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు అని 5%, హిందూత్వ అని 5%, అభివృద్ధి పనులు అని 4%, ఆర్థిక ప్రగతి అని 2%, సుపరిపాలన అని 2%, అవినీతిని అరికట్టడం అని 2%, యితర కారణాలు అని 11% అన్నారు.
ఓటేయము అని చెప్పినవారిని కారణాలడిగితే 32% నిరుద్యోగం అని చెప్పారు, ధరల పెరుగుదల అని 20%, ఆదాయం తగ్గడం అని 11% చెప్పారు. మోదీ వైఫల్యం ఏ విషయంలో అని అడిగితే 24% మంది ధరలను నియంత్రించలేక పోవడం అని, నిరుద్యోగం పెరగకుండా ఆపలేక పోవడం అని 24%, దారిద్ర్యాన్ని నిర్మూలించలేక పోవడం అని 10%, అవినీతి అరికట్ట లేకపోవడం అని 7%, అభివృద్ధి లేకపోవడం అని 4%, మత వివక్షత అని 3%, రైతు సమస్యలు పరిష్కరించ లేకపోవడం అని 3%, పరిపాలన బాగా లేకపోవడం అని 2%, ఆర్థికాభివృద్ధి లేకపోవడం అని 2%, రోడ్లు, రవాణా బాగా లేకపోవడం అని 2%, యితర కారణాలని 6% అన్నారు.
ఆర్థికపరిస్థితి బట్టి ఓట్లేసే తీరు గురించి యీ సర్వే ఏం చెపుతోందంటే – ఉన్నతాదాయ వర్గాలలో బిజెపికి 45%, బిజెపి మిత్రులకు 11% ఓటేస్తానన్నారు. మధ్యతరగతికి వచ్చేసరికి అది 40, 7, దిగువ మధ్యతరగతి 39, 5. పేదలు 39, 4. బిజెపికి, దాని మిత్రపక్షాలకు ఓటేసే ధనికులు 56% కాగా, పేదలు 43%. ఈ 13% అంతరం చాలా ఎక్కువ. కాంగ్రెసుకు, దాని మిత్రపక్షాలకు ఓటేసే ధనికులు 32% కాగా, పేదలు 33%. అంతరం 1% రివర్సులో! ఉన్నతాదాయ వర్గాలలో కాంగ్రెసుకు 20%, దాని మిత్రులకు 12% ఓటేస్తానన్నారు. మధ్యతరగతికి వచ్చేసరికి అది 20, 13, దిగువ మధ్యతరగతి 22, 14. పేదలు 22, 12. ఉన్నతాదాయ వర్గాలలో యితర పార్టీలకు ఓటేస్తానన్నవారు 13%, మధ్యతరగతిలో 19%, దిగువ మధ్యతరగతిలో 20% పేదలలో 24%.
ప్రాంతాల వారీగా చూస్తే 2014లో బిజెపి ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలలో బాగా గెలిచింది. 2019లో అక్కడ పట్టు నిలుపుకుంటూనే బెంగాల్, అసాం, ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించింది. దక్షిణాదిన కర్ణాటక తప్ప తక్కిన చోట్ల చొచ్చుకుని పోలేక పోయింది. 2024లో పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయంపై యీ సర్వే ఏం చెప్తోందంటే ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలలో 47% (2019 కంటె 1% తక్కువ) మంది బిజెపికి, 3% దాని మిత్రులకు, కాంగ్రెసుకు 24% (2019 కంటె 2% ఎక్కువ), దాని మిత్రులకు 16%, యితర పార్టీలకు 11% ఓటేస్తానన్నారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో 42% (2019 కంటె 8% ఎక్కువ) మంది బిజెపికి, 5% దాని మిత్రులకు, కాంగ్రెసుకు 14% (2019 కంటె 1% ఎక్కువ), దాని మిత్రులకు 5%, యితర పార్టీలకు 34% ఓటేస్తానన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో 25% (2019 కంటె 7% తక్కువ) మంది బిజెపికి, 13% దాని మిత్రులకు, కాంగ్రెసుకు 23% (2019 కంటె 3% ఎక్కువ), దాని మిత్రులకు 15%, యితర పార్టీలకు 14% ఓటేస్తామన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో మోదీకి పలుకుబడి ఎక్కువగా ఉంది. దళితులు, గిరిజనుల్లో కంటె అగ్రవర్ణాలలో, బిసిలలో ఎక్కువ ఉంది. ముస్లిముల్లో 14% మంది, యితర మైనారిటీల్లో 28% మంది మోదీని ప్రధానిగా ఆమోదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పని తీరుపై ఏ మేరకు సంతృప్తి చెందారనేది వర్గాల వారీగా విభజించి చెప్తోంది యీ సర్వే. పేదలలో పూర్తిగా సంతృప్తి చెందినవారు 22%, ఓ మోస్తరుగా సంతృప్తి చెందినవారు 33%, ఓ మోస్తరుగా అసంతృప్తి చెందినవారు 16%, అస్సలు తృప్తి చెందనివారు 22% ఉంటే దిగువ మధ్యతరగతిలో యీ శాతాలు 21,35, 20, 20గా ఉన్నాయి. మధ్యతరగతిలో 23,35,20,20 ఉన్నాయి. ఉన్నత వర్గాలలో30,32,18,19 ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో యీ శాతాలు 24,36,17,19 ఉండగా పట్టణాల్లో 20,31,22,22, నగరాల్లో 20,29,23,25గా ఉన్నాయి. ఉత్తర, పశ్చిమ భారతాల్లో 27,31,17,22 ఉండగా దక్షిణాదిన 16,29,18,21గా, తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో 21,37,22,15గా ఉన్నాయి. హిందూ అగ్రవర్ణాలలో 34,34,15,13 ఉండగా హిందూ ఒబిసిలలో 25,38,18,15, హిందూ ఎస్సీలలో 21,36,18, 22, హిందూ ఎస్టీలలో 17,41, 23,15, ముస్లిములలో 8,24,23,36, ఇతరుల్లో 11,29, 21,32గా ఉన్నాయి.
ఈ అంకెలన్నీ ఒకేసారి చూడడం బోరుగానే అనిపించవచ్చు. కానీ శ్రద్ధగా గమనిస్తే బిజెపి విధానాలను ఏయే వర్గాల వారు ఏ మేరకు ఆదరిస్తున్నారో ఒక ఐడియా వస్తుంది. మనం లోతుగా వెళ్లకుండా జనరలైజ్ చేసి మాట్లాడేస్తూంటాం. కానీ యీ సర్వే చూస్తే ‘అలాగా!’ అనిపిస్తుంది. ముస్లిముల్లో 8% మంది కేంద్ర ప్రభుత్వ పాలనతో పూర్తిగా తృప్తి చెందారని, 24% మంది ఓ మాదిరిగా తృప్తి చెందారని తెలిస్తే ఓహో అనిపిస్తుంది. ఏమీ చేతగానివాడు అని మనం అనుకునే రాహుల్ గ్యారంటీ యిస్తే దాన్ని జనాభాలో 49% మంది నమ్ముతున్నారంటే ముక్కు మీదకు వేలు ఆటోమెటిక్‌గా పోతుంది. అందుకేలా ఉంది సర్వే వారు ‘బిజెపి గెలుస్తుంది కానీ పోరాటం తీవ్రంగానే ఉంటుంది’ అని ముక్తాయించారు.
చివరగా ఓ చిన్న విషయం. ప్రపంచంలో ఏ విషయం గురించి రాసినా, ‘దాని మాట సరే కానీ, ఆంధ్ర ఎన్నికలలో ఎవరు గెలుస్తారు కూటమా? జగనా అది చెప్పండి.’ అని అడిగే పాఠకులు ఎక్కువ మంది ఉన్నారు. వారి కోసం ఆంధ్ర సర్వేల గురించి, ఫలితాల గురించి కాదు సుమా, నా అభిప్రాయాన్ని ఎమ్బీయస్: సీట్ల సంఖ్యపై ఊహాగానాలు అనే వ్యాసంలో చెప్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2024)