సముద్రం ఉగ్రరూపం … బీచ్ క్లోజ్

ఆర్నాబ్ పెను తుఫాన్ ఎఫెక్ట్ విశాఖ మీద భారీగా పడుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం విశాఖ నగరంలో కురిసింది.

ఆర్నాబ్ పెను తుఫాన్ ఎఫెక్ట్ విశాఖ మీద భారీగా పడుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం విశాఖ నగరంలో కురిసింది. 12 సెంటీమీటర్లతో రికార్డు స్థాయి వర్షపాతం వైజాగ్‌లో నమోదైంది. దీనితో పాటు విజయనగరం జిల్లా కొత్తవలసలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

విశాఖపట్నం తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. తుఫాన్ ప్రభావంతో సముద్రం నీరు దాదాపుగా 10 మీటర్ల మేర ముందుకు దూసుకొచ్చింది. దీంతో బీచ్ పరిసరాల దారులను అధికారులు మూసివేశారు.

సముద్రం విపరీతంగా అల్లకల్లోలంగా మారడంతో పాటు ముందుకు దూసుకురావడంతో భద్రతా దృష్ట్యా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన ఆర్కే బీచ్, రుషికొండ బీచ్‌లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులు, స్థానికులు ఎవరూ బీచ్ రోడ్డు పరిసరాల్లోకి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించి హై అలర్ట్ ప్రకటించారు.

అదే విధంగా విశాఖ తీరంలోని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా విశాఖలోని తక్కువ ఎత్తున్న ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌లు, ప్రధాన రహదారులు పూర్తిగా నీట మునిగాయి. వాతావరణ శాఖ విశాఖకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఇది ఆర్నాబ్ తుఫాన్ ఎమర్జెన్సీగా పేర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆర్నాబ్ అతి తీవ్ర తుఫాను బుధవారం మధ్యాహ్నానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

తీరం దాటే సమయంలో గంటకు 140 నుంచి 150 కి.మీ. వేగంతో వినాశకర గాలులు వీచే ప్రమాదం ఉంది. దాని ప్రభావం విశాఖ జిల్లా మీద కూడా తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.