వైసీపీ మేనిఫెస్టో ఎలా వుంటుందో అని కూటమి ఇంత కాలం భయపడుతూ కాలం గడిపింది. అప్పుడెప్పుడో టీడీపీ మహానాడులో చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ అంటూ కొన్ని సంక్షేమ పథకాలను ఆర్భాటంగా ప్రకటించారు. అది కూడా తన ప్రధాన ప్రత్యర్థి జగన్ పథకాలను కూడా ఆయన కాపీ కొట్టి, అమౌంట్ పెంచి, పేర్లు మార్చి ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ నుంచి కొన్ని పథకాలను చంద్రబాబు అరువు తెచ్చుకున్నారు.
కూటమిగా ఏర్పడిన తర్వాత …మేనిఫెస్టోపై ఇదిగో, అదిగో అంటూ జాప్యం చేస్తూ వస్తున్నారు. ఈ జాప్యం వెనుక వైసీపీ మేనిఫెస్టో ఎలా వుంటుందో అనే భయం వుందని చెబుతున్నారు. ఎట్టకేలకు జగన్ తన మేనిఫెస్టోను ప్రకటించారు. నిర్ణయాన్ని ప్రజలకు వదిలేశారు.
ఈ నేపథ్యంలో కూటమి నేతలు ఇకనైనా ధైర్యం తెచ్చుకుని మేనిఫెస్టో ప్రకటించాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ తాజా మేనిఫెస్టో చూసి కూటమి నేతలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే జగన్ విపరీతమైన హామీలేవీ ఇవ్వలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోనే కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే కొన్ని సంక్షేమ పథకాల లబ్ధిని ఆయన పెంచారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంతకంటే చేయలేమని ఆయన స్పష్టం చేశారు. చేయగలుగుతానని నమ్మిన మేరకే హామీ ఇచ్చినట్టు జగన్ తెలిపారు. వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత… కూటమి ఎలాంటి పథకాలను తీసుకొస్తుందో చూడాలి. ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో కూటమి ఉంది. కావున ఆచరణ సాధ్యమా? కాదా? అనే విషయాలను కూటమి పట్టించుకునే పరిస్థితిలో లేదు.
వైసీపీ మేనిఫెస్టోను ఆధారం చేసుకుని, కూటమి విపరీతమైన హామీలు ఇస్తుందా? అనే చర్చకు తెరలేచింది. ఎన్నికలకు ఇక పెద్ద సమయం కూడా లేదు. ఇప్పటికైనా కూటమి మేనిఫెస్టో విడుదల చేసి, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళితేనే రాజకీయ ప్రయోజనం.