ఎట్టకేలకు వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. జగన్ పదేపదే చేయగలిగిందే చెబుతా అన్నట్టుగానే… వైసీపీ మేనిఫెస్టోను తీర్చిదిద్దారు. కొన్ని వర్గాలకు రెట్టింపు సాయాన్ని ప్రకటించగా, కొందరికి మాత్రం నిరాశ మిగిల్చింది. మరీ ముఖ్యంగా రైతులు, పెన్షనర్లకు జగన్ నిరాశే మిగిల్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైఎస్సార్ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రెండు విడతల్లో పెన్షన్‌ను రూ.3,500 వరకూ పెంచుతానన్నారు. 2028లో రూ.250, ఆ తర్వాత ఎన్నికల ఏడాది 2029లో రూ.250 పెంచుతానని జగన్ మేనిఫెస్టోలో ప్రకటించారు.
వీటిపై వైసీపీ శ్రేణుల్లో కూడా నిర్లప్తత కనిపిస్తోంది. మరీ ఇంత అధ్వానంగా రైతులు, పెన్షనర్ల విషయంలో జగన్ వ్యవహరిస్తారని అనుకోలేదనే కామెంట్స్ వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. మిగిలిన పథకాల్లో రెట్టింపు చేయడానికి బదులు, ఆ సొమ్ములో కొంత రైతాంగానికి, పెన్షనర్లకు పెంచి వుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తున్నారు.
అన్నదాత పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే పెన్షనర్లకు నెలకు రూ.4వేలు చొప్పున అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పంపిణీ చేస్తామని చంద్రబాబు తెలిపారు. అరకోటికి పైగా ఉన్న రైతాంగం, అలాగే 66 లక్షల పెన్షనర్లకు సంబంధించి కూటమి, వైసీపీ హామీలను పరిశీలిస్తే …వైసీపీ పథకాలు ఆకర్షణీయంగా లేవన్నది వాస్తవం. అందుకే వైసీపీ మేనిఫెస్టోలో రైతాంగం, పెన్షనర్లను మినహాయిస్తే మిగిలిన వారంతా హ్యాపీ.