తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత వుంది. ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఈ జాతర ప్రతి ఏడాదిలో మే నెలలో నిర్వహిస్తారు. ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహించాలని నిర్ణయించారు. నిత్యం వేలాది మంది భక్తులు వెల్లువెత్తనున్నారు. అందుకే జాతరలో చిన్న అపశృతి కూడా జరగకుండా, ప్రభుత్వం అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది.
జాతర నిర్వహణలో అనుభవం ఉన్న అధికారుల్ని నియమించాల్సి వుంది. అలాగే జాతర కమిటీలో అధికారుల్ని భాగస్వామ్ముల్ని చేయాల్సి వుంది. మరోవైపు ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి గంగమ్మ జాతర నిర్వహణ అతిపెద్ద సవాల్‌గా మారింది. కానీ ఆలయాల్లో దుర్ఘటనల నుంచి సర్కార్ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, కమిటీని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
ఇదేదో కూటమికి సంబంధించిన రాజకీయ వ్యవహారంగా ప్రభుత్వం చూస్తోంది. 15 మందితో జిల్లా ఉన్నతాధికారులు కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మున్సిపల్ కార్పొరేషన్, టీటీడీ అధికారులకు ఎలాంటి భాగస్వామ్యం లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శాప్ చైర్మన్ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, డిప్యూటీ మేయర్, అలాగే నామినేటెడ్ పదవులు పొందినోళ్లు, టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన వివిధ స్థాయిల్లోని నాయకులందరినీ జాతర కమిటీలో చేర్చారు.
ఈ కమిటీలో కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కమిషనర్, అలాగే టీటీడీ అధికారులెవరికీ చోటు లేదు. ఇలాగైతే జాతరాలో విధులు నిర్వహించాల్సిన మున్సిపల్, అలాగే టీటీడీ సిబ్బందిపై అజమాయిషీ ఎవరు చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజకీయంతా అంతా పెత్తనం చేయడానికి, దర్శనాల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకునే ఆలోచన ఉన్న వాళ్లకు అధికారం ఇస్తే, జాతరలో భక్తుల గురించి పట్టించుకునే దిక్కేది? అనే ప్రశ్న ఎదురవుతోంది.
మరోవైపు జాతరలో తమను భాగస్వామ్యం చేయకపోవడమే మంచిదని అధికారులు భావిస్తున్నారు. వరుస దుర్ఘటనల నేపథ్యంలో, జాతరకు తమను దూరం పెట్టడం ద్వారా నెత్తిన పాలు పోశారని అధికారులు అంటున్నారు. మరి ప్రతిష్టాత్మక జాతరలో భక్తుల కోణంలో ఆలోచించే వారేరి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది.