Advertisement

Advertisement


Home > Politics - Andhra

చేతగానితనాన్ని చాటుకుంటూ ఎలా ఎదుగుతారు?

చేతగానితనాన్ని చాటుకుంటూ ఎలా ఎదుగుతారు?

ఏపీ కాంగ్రెస్ పార్టీలో కొంత హడావుడి కనిపిస్తోంది. ఏఐసీసీ సారధిగా మల్లిఖార్జున ఖర్గే రాగానే.. పార్టీని పునర్ వ్యవస్థీకరిస్తున్నాననే సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే.. ఏపీసీసీ అధ్యక్షుడిగా సాకే శైలజానాధ్ ను తప్పించి, గిడుగు రుద్రరాజు చేతిలో పగ్గాలు పెట్టారు. ఏపీలో ఎన్నడో శవాసనం వేసిన పార్టీని, ఆయన ఇప్పుడు లేపి కళ్లేలు పూన్చి పరుగులెత్తించాలన్నమాట. 

కొత్త సారధిగా ఎవరు వచ్చినా సరే.. పార్టీని ఉద్ధరించేస్తాం.. అని తొలిరోజుల్లో ప్రకటనలు చేయడం మామూలే. గిడుగు కూడా అలాగే అంటున్నారు. కాకపోతే.. ఆయన అంతకంటె పాచిపోయిన విషయాన్ని పట్టుకుని.. ఏపీ ప్రజలను మరోసారి వంచించగలం అనుకుంటున్నారు. అంత పాచిఆలోచనలతో వెళుతున్నారు గనుకనే.. అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంతర్ధానం అయినట్టే అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

ఇంతకూ ఆ పాచిపోయిన విషయం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందని కొత్త సారధి గిడుగు అంటున్నారు. ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేసిన తొలి దోషి కాంగ్రెసు పార్టీనే అనే సంగతి ఏపీ ప్రజలందరికీ తెలుసు. అన్ని విషయాల్లో మాదిరిగానే ఈ విషయంలో మాత్రం మేమేం తక్కువ తిన్నాం అన్నట్టుగా కాంగ్రెసును మించిన ద్రోహం బిజెపి చేసింది. చట్టంలో ప్రత్యేకహోదా అనే మాట పెట్టకపోవడం ద్వారా జరిగిన వంచన నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. 

ఆ తర్వాత కూడా ఏపీకి ప్రత్యేకహోదా కోసం అటు పార్లమెంటులోను, ఇటు వెలుపల అనేకానేక ఉద్యమాలు, పోరాటాలు జరిగినప్పటికీ.. కాంగ్రెసు స్థానిక అస్తిత్వం కోసం వాటిలో పాల్గొన్నదే తప్ప.. చిత్తశుద్ధి చూపించలేదు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ ఏపీకి ప్రత్యేకహోదా కోసం సభలో ఎన్నడూ డిమాండ్ చేయలేదు. పార్లమెంటు వెలుపల సానుభూతి మాటలు చెప్పడం తప్ప.. ఇది నిజమైన మేలుచేసే వైఖరి కాదు. మొన్నటికి మొన్న కూడా.. ఏపీలో తన పాదయాత్ర అడుగుపెట్టినప్పుడు మాత్రం.. అదొక తురుపుముక్కలాగా ఆయన ప్రత్యేకహోదా అనే మాటను ప్రజల మీదికి వదిలిపెట్టారు. 

అసలు ప్రత్యేకహోదా అనేది గతించిపోయిన అధ్యాయం. తెలుగుదేశం పాలనలో హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనడంతోటే.. దాని ఆయుష్షు తీరిపోయింది. హోదా అనే డిమాండ్ తో జరిగిన ఉద్యమాలను తొక్కేయడం ద్వారా.. రాష్ట్రాన్ని సర్వభ్రష్టత్వం చేయించిన వ్యక్తి చంద్రబాబు. హోదా ముగిసిన అధ్యాయం అని బిజెపి నేతలు చెబుతున్నారు. ప్రజలు కూడా మర్చిపోతున్నారు. 

ఇప్పుడు.. ఈ సమయంలో.. కాంగ్రెస్ ద్వారా ఏపీకి ప్రత్యేకహోదా వస్తుంది అనే పాచిపోయిన మాట చెబితే.. తమను గద్దెమీద కూర్చోబెడతారని గిడుగు రుద్రరాజు అనుకుంటున్నారా? నిజంగా ఆయనకు పార్టీని ఉద్ధరించే ఆలోచన ఉంటే.. హోదా అనే మాట వదిలేసి ఇతరత్రా పోరాటాల ద్వారా బలోపేతం చేసే ఆలోచనల్లోకి రావాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?