Advertisement

Advertisement


Home > Politics - Andhra

బ‌క‌రాను చూసి బాబు ప‌డిప‌డి నవ్వుకుంటూ...!

బ‌క‌రాను చూసి బాబు ప‌డిప‌డి నవ్వుకుంటూ...!

ఎవ‌రినైనా వాడుకోవ‌డంలో చంద్ర‌బాబుకు మించిన నాయ‌కుడు రాజ‌కీయ రంగంలో లేరు. బ‌హుశా ఈ "సుగుణ‌మే" సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌ను అమితంగా ఆక‌ర్షించిన‌ట్టుంది. సాధార‌ణంగా నిఖార్సైన క‌మ్యూనిస్టుల‌కు చంద్ర‌బాబు పాల‌సీలు పూర్తి వ్య‌తిరేకంగా వుంటాయి. బాబును వ్య‌క్తిగ‌తంగా కూడా అస‌హ్యించుకునేలా చేస్తాయి. కానీ చంద్ర‌బాబును సీపీఐ నేత రామ‌కృష్ణ మాత్రం ఆరాధిస్తున్నారు. ప్రేమికుడి కోసం ప్రేమికురాలు ఏ త్యాగానికైనా సిద్ధ‌ప‌డుతుంద‌నే రీతిలో, బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం రామ‌కృష్ణ ఎంత‌కైనా దిగ‌జారడానికి రెడీ అయిపోయారు.

ఈ కార‌ణంగా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌శాంత్‌కుమార్ మిశ్రాతో చీవాట్లు తినాల్సి వ‌చ్చింది. రాజ‌కీయంగా అడ్వాంటేజ్ అవుతుంద‌ని అనుకుంటే ఆ ప‌నేదో త‌న పార్టీ ద్వారానే చంద్ర‌బాబు చేయిస్తారు. కొంచెం తేడా క‌నిపించినా, త‌న న‌మ్మ‌క‌మైన ఇత‌ర పార్టీల నేత‌ల్ని బ‌లి పెట్ట‌డం చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ నేప‌థ్యంలో జీవో నంబ‌ర్‌-1పై సీపీఐ రామకృష్ణ‌తో చంద్ర‌బాబు పిల్ వేయించారు. త‌న పార్టీ లాయ‌ర్‌ని నియ‌మించారు. ఏంద‌బ్బా చంద్ర‌బాబు త‌న పార్టీ వాళ్ల‌తో కాకుండా, త‌న భ‌క్తుడు రామ‌కృష్ణను రంగంలోకి దించారే, ఏంటి క‌థ అని అంద‌రూ చ‌ర్చించుకున్నారు.

అలాంటి ప్ర‌శ్న‌ల‌కు, సందేహాల‌కు ఇప్పుడు స‌మాధానం దొరికింది. రామ‌కృష్ణ‌కు హైకోర్టు చెంప ఛెళ్లుమ‌నిపించేలా ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. సీపీఐ రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌పై ప్ర‌శ్నించింది. చంద్ర‌బాబు కోస‌మే త‌ప్ప‌, త‌న‌కొచ్చిన ఇబ్బందులు లేవ‌ని హైకోర్టు సాక్షిగా లోకానికి రామ‌కృష్ణ ప‌రోక్షంగా చెప్పారు. జీవో నంబ‌ర్‌-1ను స‌వాల్ చేస్తూ దాఖ‌లు చేసిన పిల్‌పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్ మిశ్రా ధ‌ర్మాస‌నం పిటిషిన‌ర్ రామ‌కృష్ణ‌ను ఉద్దేశించి ఏమ‌న్న‌దంటే...

"ఏమంత అత్య‌వ‌స‌రం వుంద‌ని హ‌డావుడిగా పిల్ దాఖ‌లు చేశారు? మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు పొంది మీరేమైనా ధ‌ర్నాలు చేశారా? రాస్తారోకో చేశారా? స‌మావేశాలు పెట్టారా? అస‌లు మీకేంటి? జీవో వ‌ల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? వెంట‌నే ఇబ్బంది లేన‌ప్పుడు ఏం మునిగిపోయింద‌ని సెల‌వుల్లో అత్య‌వ‌స‌ర పిటిష‌న్ దాఖ‌లు చేశారు? ఇలాంటి పిటిష‌న్ వేసి తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితి సృష్టించారు. కోర్టు నుంచి ఉత్త‌ర్వులు పొందేందుకు ఇలాంటి ప‌రిస్థితిని సృష్టించారు. దీనికి స‌మాధానం చెప్పి తీరాల్సిందే" అని జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా  ధ‌ర్మాసనం స్ప‌ష్టం చేసింది.

రామ‌కృష్ణ పిటిష‌న్ వ‌ల్ల న్యాయ వ్య‌వ‌స్థ‌కు చెడ్డ పేరు వ‌చ్చింద‌ని, అలాగే ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి బాధ క‌లిగింద‌ని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. త‌ప్పుడు ప‌నులన్నీ త‌న తెలివి తేట‌ల‌తో రామ‌కృష్ణ ఖాతాలోకి వేశాన‌ని చంద్ర‌బాబు ప‌డిప‌డి న‌వ్వుకుంటూ వుంటార‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో రామ‌కృష్ణ బ‌క‌రా అయ్యారు. తాజా హైకోర్టు సీరియ‌స్ కామెంట్స్‌పై ప‌చ్చ బ్యాచ్ నోరెత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

ఇటీవ‌ల జీవో1పై హైకోర్టులోనే తేల్చుకోవాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించిన వెంట‌నే.... ఇది జ‌గ‌న్ స‌ర్కార్‌కు చెంప పెట్టు అని రంకెలేసిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, ఆయ‌న‌కు వంత పాడే టీడీపీ నేత‌లు, తాజా ఘాటు వ్యాఖ్య‌ల‌పై మాత్రం నోరెత్తితే ఒట్టు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?