Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఋషికొండ...ఇప్పటం... విపక్షం విశ్వసనీయత....?

ఋషికొండ...ఇప్పటం... విపక్షం విశ్వసనీయత....?

ఏపీలో రెండు సంఘటనలు ఇపుడు విపక్షం తీరుని బయటపెడుతున్నాయి. ఒకటి ఇప్పటం. ఆకాశం భూమిని కలిపేస్తూ టీడీపీ జనసేన నానా యాగీ చేశాయి. ఇప్పటంలో ఏదో జరిగిపోతోంది అని ఎలుగెత్తి చాటాయి. నిజానికి ఇప్పటం లో జరిగింది దేశంలో అన్ని చోట్ల జరిగేదే. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఆ మీదట యాక్షన్ తీసుకుంటుంది.

కానీ ఇప్పటంలో ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటం టూర్ లో ఆవేశపడిపోతూ వైసీపీ సర్కార్ ని కూల్చేస్తామంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. నిజానికి నోటీసులు ఇవ్వకుండా అక్కడ ఏమీ కూల్చలేదు. అంతా పద్ధతిగా చట్టబద్ధగా సాగింది. పైగా జస్ట్ ప్రహారీలు మాత్రమే కూల్చారు. కానీ ఇళ్ళు కూలగొట్టేశారు అంటూ ఆయన వీరవేశం ప్రదర్శించడం అంతా మీడియా ముఖంగా చూశారు.

ఆయన తరువాత అక్కడికి వెళ్లిన చినబాబు లోకేష్ కూడా ప్రభుత్వం మీద ఆడిపోసుకున్నారు. కానీ నిజానికి జరిగింది ఏమిటి అన్నది హై కోర్టు ద్వారా లోకమంతా తెలుసుకుంది. దాంతో ఇపుడు విపక్షాలు ఏ రకంగా తమ వాదన కరెక్ట్ అని చెబుతాయో తలలు ఎక్కడ పెట్టుకుంటాయో చూడాలి.

విశాఖ ఋషికొండ విషయంలోనూ ఇదే రకమైన రచ్చ గత కొన్ని నెలలుగా చేస్తూ వచ్చాయి. ఆఖరుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అక్కడికి వెళ్లి వాస్తవాలను మీడియా ముందు ఉంచారు. ముఖ్యమంత్రి నివాసం నిర్మాణం లేదు, క్యాంప్ ఆఫీస్ అంతకంటే లేదు అక్కడ కడుతున్నది పర్యాటక శాఖ భవనాలు మాత్రమే అని ఆయన తేల్చేశారు.

ఈ సందర్భంగా నారాయణ ఒక మాట చెప్పారు. ఈపాటిదానికి ప్రభుత్వం విపక్షాలకు ఏనాడో ఋషికొండ నిర్మాణాలను చూపిస్తే పోయేది కదా అని. అది నిజమే. ఇక్కడ ఏ చిన్న విషయం అయినా లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ నానా రచ్చను విపక్షాలు చేస్తూంటే వాస్తవాలు ఇవీ అని చెప్పాల్సిన అధికార వైసీపీ కూడా ఎదురుదాడి చేయడంతోనే పొద్దు పుచ్చుతోంది తప్ప అక్కడ జరుగుతున్నది ఇదీ అని చెప్పకపోవడం వల్లనే ఋషికొండ ఇష్యూ ఈ రోజు జాతీయ సమస్యగా మారిపోయింది. అలా విపక్షాలు మార్చేస్తే సర్కార్ తీరు కూడా కారణం అయింది.

దేశంలో చాలా చోట్ల కొండల మీద కట్టడాల నిర్మాణం జరుగుతున్నాయి. టూరిజానికి బూస్టింగ్ ఇవ్వడం కోసం టూరిస్టులను ఆకట్టుకోవడం కోసం ఇలా నిర్మాణాలు చేయడం జరిగే విషయమే. అయితే దీనికి ఎన్నో పెద్ద మాటలను విపక్షాలు వాడేసాయి. ఏకంగా విశాఖలో కొండలను వైసీపీ తినేస్తోందని, ఏమీ లేకుండా విశాఖను చేసింది అని.

ఈ విమర్శలకు జవాబు చెప్పలేని నిస్సహాయతలో వైసీపీ ఎందుకు ఉందో అర్ధం కాదు. మాటలను నిందలను పడుతూ మరింత బదనాం అవడమే వైసీపీకి ఇష్టం అయితే ఎవరూ ఏమీ చేయలేరు. కాకతాళీయమో మరేమో తెలియదు కానీ ఇప్పటం, ఋషికొండ రెండు ఇష్యూల గుట్టు ఇపుడు విడిపోయింది. విపక్షాల విశ్వసనీయత కూడా అందరికీ తెలిసిపోయింది. అదే సమయంలో తాము చేస్తున్న దానిని జనాలకు చెప్పుకోలేని వైసీపీ బలహీనతా బయటపడింది.

వైసీపీ తీరు ఇలాగే ఉంటే ఇదే తీరున మరిన్ని కొత్త విషయాలను తెచ్చి బురద జల్లడానికి విపక్షం చూస్తుంది. అది వారి డ్యూటీ అనుకున్నా అసలు వాస్తవాలు అన్నీ ఋషికొండ లా ఇప్పటంలా బయటపడవు. చివరకు ఇబ్బంది పడేది వైసీపీయే అన్నది ఆ పార్టీ పెద్దలు గుర్తుంచుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?