Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఓట‌మి దిశ‌గా వైసీపీ...సంబ‌రాల్లో అధికార పార్టీ శ్రేణులు!

ఓట‌మి దిశ‌గా వైసీపీ...సంబ‌రాల్లో అధికార పార్టీ శ్రేణులు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు ప‌ట్ట‌భ‌ద్రుల‌, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో రెండు ఉపాధ్యాయ స్థానాల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు గెలుపొందారు. తూర్పు, ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ఉపాధ్యాయ స్థానాల్లో పి.చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, రామ‌చంద్రారెడ్డి గెలుపొందడం విశేషం.

ఇక ప‌ట్ట‌భ‌ద్రుల విష‌యానికి వ‌స్తే పోరు ఆస‌క్తిక‌రంగా వుంది. ప్ర‌స్తుతం కౌంటింగ్ ప్ర‌క్రియ సాగుతోంది. ఉత్త‌రాంధ్ర‌, తూర్పు రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్ ఆధిక్య‌త‌లో ఉన్నారు. వీరి గెలుపు దిశ‌గా ప్ర‌యాణిస్తున్నారు. ప‌శ్చిమ రాయ‌ల‌సీమ గ్రాడ్యుయేట్ విష‌యానికి వ‌స్తే టీడీపీ, వైసీపీ మ‌ధ్య పోరు హోరాహోరీని త‌ల‌పిస్తోంది.  ఐదు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి వైసీపీ అభ్య‌ర్థి వెన్న‌పూస ర‌వీంద్రారెడ్డి కేవ‌లం 1976 ఓట్ల ఆధిక్య‌త‌లో మాత్ర‌మే ఉన్నారు. ఇది మొద‌టి ప్రాధాన్య ఓట్లు కావడం గ‌మ‌నార్హం. రెండో ప్రాధాన్యం ఓట్ల‌తో గెలుపొందుతామ‌ని టీడీపీ ధీమాగా చెబుతోంది.

ఇదే ఉత్త‌రాంధ్ర, తూర్పు రాయ‌ల‌సీమ గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థుల మెజార్టీ భారీగా వుంది. ఉత్త‌రాంధ్ర‌లో ఆరో రౌండ్ పూర్త‌య్యే స‌రికి టీడీపీ అభ్య‌ర్థి 23,278 ఓట్ల ఆధిక్య‌త‌లో ఉన్నారు. అలాగే తూర్పురాయ‌ల‌సీమ‌లో టీడీపీ అభ్య‌ర్థి శ్రీ‌కాంత్ ఐదో రౌండ్ పూర్త‌య్యేస‌రికి 17 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజ‌యం దిశ‌గా సాగుతున్న‌ట్టు స‌మాచారం. మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో స్ప‌ష్టంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

గ‌త నాలుగేళ్ల‌లో త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని వైసీపీ గ్రామ‌, మండ‌ల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అధిష్టానానికి బుద్ధి చెప్ప‌డానికైనా ఓడించితీరాల‌న్న ప‌ట్టుద‌ల‌, క‌సితో అధికార పార్టీ విద్యావంతులే జ‌గ‌న్‌కు వ్య‌తిరేక ఓటు వేశార‌ని ... ఈ ఫ‌లితాలు చెబుతున్నాయి. ప్ర‌తి రౌండ్‌లో వైసీపీ అభ్య‌ర్థులు వెనుకంజ‌లో ఉండ‌డం, ఇదే సంద‌ర్భంలో టీడీపీ అభ్య‌ర్థులు దూసుకుపోతుండ‌డంతో వైసీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ఫ‌లితాల స‌ర‌ళిపై వైసీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయ‌కులు ఎక్కువ ఆస‌క్తిక‌న‌బ‌రుస్తున్నారు. చివ‌రికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అడ్డా అయిన ప‌శ్చిమ రాయ‌ల‌సీమ‌లో టీచ‌ర్స్ ఎమ్మెల్సీలో చావు త‌ప్పి క‌న్నులొట్ట ప‌డిన చందంగా వైసీపీ మ‌ద్ద‌తుదారుడు గ‌ట్టెక్కారు. ల‌క్ష‌లాది విద్యావంతులు పాల్గొన్న ఎన్నిక‌ల్లో మాత్రం ముఖ్యంగా జ‌గ‌న్‌కు త‌మ ధ‌ర్మాగ్ర‌హాన్ని తెలియ‌జేయ‌డానికే మొగ్గు చూపారు. "ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మితోనైనా మా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు జ్ఞానోద‌యం కావాలి. లేదంటే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది" అని వైసీపీ కిందిస్థాయి నాయ‌కులు హిత‌వ‌చ‌నాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఏ ఒక్క వైసీపీ నేత‌తో మాట్లాడినా, ఇదే మాట‌, ఇదే ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌డం విశేషం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?