Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైసీపీ, టీడీపీ...దొందు దొందే!

వైసీపీ, టీడీపీ...దొందు దొందే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీవ‌నాడి అయిన జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రం విష‌యంలో వైసీపీ, టీడీపీ విధానాలు ఒకేలా ఉన్నాయి. నాడు టీడీపీ అధికారంలో ఉండ‌గా వైసీపీ తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు చేసింది. నేడు వైసీపీ అధికారంలో ఉండ‌గా టీడీపీ అదే ప‌ని చేస్తోంది. మ‌ధ్య‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకం ప్ర‌యోజ‌నాలు నాశ‌న‌మ‌వుతున్నాయి.

ఏపీలో అధికార మార్పిడి త‌ప్ప‌, రాష్ట్ర ప‌రిస్థితి ఏమీ మార‌క‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అధికార‌, ప్ర‌తిపక్ష పార్టీల‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌య్యాయి. పోల‌వ‌రం ప్రాజెక్టును రాజ‌కీయంగా వాడుకునేందుకు టీడీపీ, వైసీపీ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎప్ప‌టికి పూర్తి అవుతుందో ఎవ‌రూ చెప్ప‌లేని ద‌య‌నీయ స్థితి.

తాజాగా వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పోల‌వ‌రం గురించి ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఎంపీ మార్గాని భ‌ర‌త్ మాట్లాడుతూ పోల‌వ‌రంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జ‌ర‌గ‌లేద‌న్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే పార్ల‌మెంట్‌లో స్ప‌ష్టం చేసింద‌ని గుర్తు చేశారు. ఏదో ర‌కంగా పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు రాకుండా టీడీపీ ఎంపీలు ఇబ్బందులు సృష్టిస్తున్నార‌ని ఆరోపించారు.

ఏపీకి అన్యాయం చేసేలా టీడీపీ ఫిర్యాదులున్నాయ‌న్నారు. టీడీపీకి రాజకీయాలు తప్ప రాష్ట్ర భ‌విష్య‌త్ ప‌ట్ట‌డం లేద‌న్నారు. చంద్రబాబు అనాలోచిత పనుల వల్లే పోలవరం ఆలస్యమవుతోందన్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా ఈసిఆర్ఎఫ్ డ్యాం కట్టడం క్షమించరాని నేరమని అన్నారు. గ‌తంలో ఇలాంటి ఆరోప‌ణ‌ల‌నే టీడీపీ ఎంపీలు ప‌దేప‌దే చేయ‌డం గుర్తు తెస్తోంది. 

పోల‌వరం నిర్మాణానికి నిధులు ఇవ్వ‌కుండా ఏదో ఒక సాకుతో కొర్రీలు వేస్తున్న మోదీ స‌ర్కార్‌ను ప్ర‌శ్నించ‌డానికి ఏపీ అధికార‌ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ధైర్యం లేదు. త‌మ‌లో తాము కొట్టుకోడానికి మాత్రం ముందుంటారు. మొత్తానికి టీడీపీ, వైసీపీ త‌మ రాజ‌కీయ స్వార్థానికి పోల‌వ‌రాన్ని బ‌లి పెట్టింద‌నే ఆవేద‌న పౌర స‌మాజంలో నెల‌కుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?