తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి గత ఐదేళ్ల పాలన గురించి ఒక్కోక్కటిగా దిగ్భ్రమ కలిగించే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎలా భ్రష్టు పట్టించారో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే వివరించారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి.. వాటిని అడ్డగోలుగా ఖర్చు పెట్టడం, ఓట్ల కొనుగోలుకు వాడటమే తప్ప.. రాష్ట్రానికి ఎలాంటి మేలూ జరగలేదని ఆయన వివరించి చెప్పారు. చేసిన అప్పులను తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపే కార్యక్రమాలకే వాడారు. అంతే తప్ప.. రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే అంశాలపై రూపాయి ఖర్చు పెట్టలేదని తేటతెల్లం అవుతోంది. రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసి.. ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక్క పనికి వచ్చే పథకం లేకుండా పోయిందంటే చంద్రబాబుగారి పాలన ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు పాలనలో సీఎం రిలీఫ్ ఫండ్ కు పట్టిన గతి మరో చీకటి అధ్యాయం. పచ్చ చొక్కాల అవినీతి మకిలి అంటని రంగం ఏదీ లేనట్టుగా.. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నిధిని కూడా అయిన కాడికి మింగేశారని తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ లో చెల్లని చెక్కులను ఇచ్చారంటే.. కథను సులభంగా అర్థం చేసుకోవచ్చు. దాదాపు 22 వేలకు పైగా ఫైళ్లను మూలన పడేశారు. వేలాది మందికి చెల్లని చెక్కులు ఇచ్చారు. వైద్యం చేసిన ఆసుపత్రులకు 2017 నుంచి వందల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టారు. అస్మదీయ ఆసుపత్రులకు మాత్రం అడ్డగోలుగా చెల్లించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు ఇచ్చిన దాదాపు 8,700 చెక్కులు బౌన్స్ కావడం పరాకాష్ట. ఎల్వోసీ లు, రియంబర్స్ మెంట్ లుమంజూరు చేయడంలోరాజకీయ, కుల వివక్ష చోటు చేసుకుంది. 80 శాతం పైగా సహాయ నిధిని కేవలం కొద్దిమంది పచ్చ ఎమ్మెల్యేలు కొన్ని అనుకూల ఆస్పత్రులు దోచుకున్నాయి…ఇవీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడీ విషయంలో విస్మకరమైన విషయాలు!
ఈ అవినీతిని దందా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా సాగడం ఆశ్చర్యకరమని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అంటూ వివిధ సంస్థల, ప్రజల నుండి సేకరించిన విరాళాలు ఏమయ్యాయో దేవునికే ఎరుక. వెరసి పటిష్టమైన బ్రోకర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మరి ముఖ్యమంత్రి సహాయనిధిని భోంచేశారని తెలుస్తోంది. అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ఆసుపత్రులు కుమ్ముకై పేదల సొమ్మును పందికొక్కుల్లా మింగేశారు.
ఈ విషయంలో ప్రక్షాళన జరుగుతున్నట్టుగా ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. సీఎంవోలో నియమితం అయిన డాక్టర్ హరికృష్ణ తదితరులు.. ఈ విస్మయకరమైన విషయాలను వివరిస్తూ ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో బ్రోకరేజీ వ్యవస్థను మట్టుబెట్టడమే ముందున్న మొదటి లక్ష్యమని చెబుతున్నారు. దొంగ బిల్లులు పెట్టిన వ్యక్తులు, ఆసుపత్రులపై కేసులు కూడా పెడుతున్నట్టుగా ప్రకటించారు. అక్రమాలన్నింటి గురించి విజిలెన్స్ కు పంపుతున్నట్టుగా తెలుస్తోంది.
ఒకవైపు పాత వ్యవహారాలను ప్రక్షాళన చేస్తూనే.. మరోవైపు నూతన ప్రభుత్వం ఇప్పటి వరకూ యాభై రెండు కోట్ల రూపాయల వరకూ సీఎం రిలీఫ్ ఫండ్ ను మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలన్నింటినీ పూర్తి పారదర్శకంగా ఉంచుతున్నట్టుగా అధికారులు ప్రకటించారు.