Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ ధైర్యం..కీడా? మేలా?

జగన్ ధైర్యం..కీడా? మేలా?

ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ ఓ తేనెతుట్టను కదిపారు. చిరకాలంగా లోలోపలే గుసగుసలు మాదిరిగా, అది కూడా న్యాయస్థానాల్లో, న్యాయవాదుల్లో, మహా అయితే కోర్టు కేసుల్లో తిరిగే వారి మధ్యనే వినిపించే విషయాలను బయటకు తెచ్చారు. కోర్టు కేసులు ఎదుర్కొనేవారికి లేదా వాటితో డీల్ చేసేవారికి పరిచయం వున్న పడికట్టు విషయాలు కొన్ని వున్నాయి. 

ఏ బెంచ్ మీదకు వస్తుంది? ఎవరైతే క్వాష్ అవుతుంది. ఎవరైతే స్టే వస్తుంది. ఎవరైతే బెయిల్ వస్తుంది. ఎవరి తరహా ఎలాంటిది? ఎవరు గతంలో ఎవరి దగ్గర జూనియర్లుగా పనిచేసారు. ఎవరికి ఎవరితో సంబంధాలు వున్నాయి. ఇలాంటివి అన్నీ కోర్టుల్లో లాయర్ల మధ్య డిస్కషన్లు జరుగుతూ వుంటాయి. వీటిని బట్టి కూడా కేసులు లాయర్లకు అందుతూ వుంటాయి. 

అయితే న్యాయస్థానాలకు అన్నింటికి మించిన అధికారాలు వున్నాయి. న్యాయస్థానాలను ఢీకొని కావచ్చు, కామెంట్ చేసి కావచ్చు, పర్యవసానాలు ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చాలా అంటే చాలా కష్టం. కోర్టులకు వెళ్లిన వారు గమనిస్తే చాలా చిత్రమైన పద్దతులు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. ఆ పద్దతులు చిత్రంగా కోర్టుల మీద, న్యాయమూర్తుల మీద వున్న అపార గౌరవాభిమానాలను సూచిస్తాయి.

ఓ న్యాయవాది కోర్టు హాలులోకి ఎన్నిసార్లు వెళ్లి ఎన్నిసార్లు బయటకు వచ్చినా, న్యాయమూర్తికి నమస్కరిస్తూ వెళ్తారు. నమస్కరిస్తూ వస్తారు. ఇది న్యాయమూర్తి గమనించే గమనించరు. కానీ అలా బై డీఫాల్ట్ గా జరుగుతూ వస్తుంటుంది.  ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించడం అంటే న్యాయవ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద వున్న అపార గౌరవాన్ని గుర్తు చేయడానికి మాత్రమే.

అయితే ఇలాంటి గౌరవం ప్రదర్శించే చోటనే రకరకాల గుసగుసలు లాయర్ల చాంబర్లలో, బార్ కౌన్సిల్ హాళ్లలో పిచ్చాపాటీ మాటల్లో వినిపిస్తుంటాయి. అంతకు మించి న్యాయవ్యవస్థ పై ఎటువంటి కామెంట్ లు బాహాటంగా అయితే పొరపాటున కూడా ఎవ్వరూ మాట్లాడరు. వినిపించవు. అప్పుడప్పుడు జాతీయ స్థాయిలో ఒకటి రెండు అంశాలు మెరపుల్లా మెరిసినా, అంతలోనే చల్లారిపోతాయి. లేదా చల్లారుస్తారు. 

సంబంధాలు సాధారణం

న్యాయమూర్తుల ఎంపిక అనేది సాధారణంగా న్యాయవాదల నుంచే జరుగుతుంది. ఎందకుంటే న్యాయవాదులుగా వుంటున్నవారే ఎక్కువగా న్యాయమూర్తుల పరీక్షలు రాస్తుంటారు. ఎంపిక అవుతుంటారు. . సో, ఎప్పుడయితే న్యాయవాదులుగా చిరకాలం పని చేస్తారో వారికి రకరకాల వర్గాలతో పరిచయాలు, పార్టీలతో అనుబంధాలు వుండడం సహజం.

కొంత వరకు అవి న్యాయమూర్తులుగా మారిన తరువాత కూడా కొనసాగుతాయి.  అయితే అవి కేసులను తీర్పులను ప్రభావితం చేసే రేంజ్ కు వుంటాయా? వుండవా? అన్నది వ్యక్తులను బట్టి, వారి మనస్తత్వాలను బట్టి, వారి వారి నైతికతను బట్టి వుంటాయి. 

ఇలాంటి నేపథ్యంలో గత కొంత కాలంగా కోర్టుల నిర్ణయాలు, న్యాయమూర్తుల నిర్ణయాలు వివాదాలకు గురవుతున్నాయి. నిజానికి తీర్పు లేదా ఆదేశం తమకు అనుకూలంగా లేదనుకునే వారు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని లైట్ తీసుకోచవ్చు. అయితే రాను రాను ఇవి పెరుగుతూ వుంటే,  గట్టి సాక్ష్యాలతో జనం ముందుకు తెస్తుంటే కాస్త ఆలోచించాల్సి వుంటుంది. ఓ పటిష్టమైన వ్యవస్థ కేవలం కొంత మంది లేదా కొన్ని నిర్ణయాల వల్ల బీటలు వారకుండా కాపాడాల్సి వుంటుంది. 

మిగిలిన ఏకైక వ్యవస్థ

ఎందుకుంటే దేశంలోని నాలుగు కీలక వ్యవస్థల్లో మూడు ఎప్పుడో భ్రష్టు పట్టిపోయాయి. రాజకీయ, పోలీస్, మీడియా వ్యవస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడకుంటే అంత మంచింది. మిగిలింది న్యాయ వ్యవస్థ మాత్రమే. రాజకీయ అవినీతిని కావచ్చు, పోలీస్ జులం ను కావచ్చు, మీడియా పక్షపాతాన్ని కావచ్చు, ఇలా మూడింటిని నిలవరించగల శక్తి  న్యాయవ్యవస్థకు వుంది. అందువల్ల ఆ శక్తిని పదిలంగా కాపాడుకోవాల్సి వుంది. లేదూ అంటే దేశమే అరాచకం అయిపోయే ప్రమాదం వుంది. 

ఎవ్వరో కోర్టులను, తీర్పులను ఎదిరించడం వేరు. అది వ్యక్తిగతం. వైఎస్ జగన్ కూడా వ్యక్తిగత హోదాలో ఆ పని చేసి వుంటే పెద్దగా ఆలోచించనక్కరలేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా కొన్ని కేసుల్లో నిందితుడు. అతని మీద వేసిన నింద కోర్టులో నిజమని తేలితే నిందితుడు కాస్తా పక్కా ముద్దాయిగా మారి శిక్షార్హుడు అవుతాడు. కానీ ఇక్కడ వైఎస్ జగన్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో కొందరు న్యాయమూర్తులపై, కొన్ని తీర్పులపై అభ్యంతరాలు వ్యక్తం చేసారు.  ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రం వరకు సర్వాధికారి. 

కోర్టు తీర్పులను అమలు చేయాల్సిన పోలీస్ వ్యవస్థ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే వుంటుంది. కోర్టుల ఆలన పాలన, నిర్వహణ, ఇలా సమస్తం ఆ రాష్ట్ర ప్రభుత్వమే చూడాల్సి వుంటుంది.  మరి ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొర్టు తీర్పులను తప్పి పట్టి, న్యాయమూర్తులను తప్పు పడితే, నాలుగు వ్యవస్థల్లో రెండు వ్యవస్థలు నేరుగా ఢీకొన్నట్లే కదా?  పక్క దేశంలో తరచు సైనిక పాలన వస్తుంటుంది. 

ఎందువల్ల దేశ పాలనా వ్యవస్థ-దేశ రక్షణ వ్యవస్థ ఒకదానితో మరొకటి ఢీకొనడం వల్ల. కీలకమైన వ్యవస్థలు వాటి వాటి పరిథుల్లో వుండి, ఒకదాని పరిథిని మరొకటి అతిక్రమించకుండా వున్నంతకాలం సమస్యలు రావు. అలా కానపుడే అరాచకం ప్రారంభం అయ్యే ప్రమాదం వుంది.

కామన్ మాన్ పాయింట్

కామన్ మాన్ కు కేసు బలంగా వుందా? డిఫెన్స్ వీక్ గా వుందా? ఇలాంటివి అన్నీ తెలియవు. కొన్ని మౌలికమైన సాదా సీదా పాయింట్ల దగ్గరే కామన్ మాన్ ఆగిపోతాడు.  ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో పేల్చిన తూటా ప్రకంపనలు ఈ కామన్ మాన్ దగ్గర బాగా వర్కవుట్ అవుతాయి. 

ఈ దేశంలో అధికంగా ఓట్లు వేసేది ఈ కామన్ మాన్ మాత్రమే. ఆ విధంగా జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం చాలా అనుకూలంగా వర్కవుట్ అవుతుంది. ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఇస్తామంటే చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డం పడ్డారని జనం నమ్ముతున్నారు. ఇప్పుడు జగన్ ను ఏ కేసుల్లో అరెస్ట్ చేసినా అది విపరీతమైన సింపతీ జనరేట్ చేస్తుంది. గతంలో ఇందిర, జయలలిత, కరుణానిధి ఇలా సింపతీ పొంది భయంకరంగా బౌన్స్ బ్యాక్ అయినవారే. జనతా పార్టీ ప్రభంజనం జైలు నిర్భంధాల నుంచి పుట్టుకువచ్చిందే. 

జగన్ ఎక్కుపెట్టిన బాణం సాధించే మరో ప్రయోజనం, మరీ మొండిగా ముందుకు వెళ్లే వాళ్లకు తప్ప, మిగిలిన వాళ్లను కాస్త ఆలోచించేలా చేస్తుంది. పెద్దవాళ్ల గొడవల్లో తమెందుకు దూరాలి అని న్యూట్రల్ అయ్యే అవకాశం వుంది. అదే సమయంలో చీటికీ మాటికీ మరీ కోర్టులకు వెళ్లి, లేని పోని అనుమానాలు పెంచే పని అవసరమా? అని ప్రతిపక్షం కూడా ఆలోచించే అవకాశం వుంది. ఇవన్నీ జగన్ కు పనిని కాస్త సానుకూలం చేస్తాయి.

కానీ ఇదే సమయంలో రిస్క్ కూడా అంతే వుంది. ప్రభుత్వ ఉద్యోగులతో, పెట్టుకుంటే ఎక్కడో అక్కడ ఏదో సాకు చూపించి పనులు ఆలస్య చేస్తారని జనాల్లో ఓ అభిప్రాయం వుంది. రూల్స్ ప్రకారం వెళ్తే ఇక్కడ పనులు జరగవు. ఎక్కడ జరపాల్సింది అక్కడ జరపాల్సిందే అదే విధంగా కోర్టులను ఢీకొని మనగలగడం ఓ రాజకీయ వేత్తకు ఎంత వరకు సాధ్యం? 

జగన్ అంటే అభిమానం వున్న అనేక న్యాయ వాదులు కూడా ఈ విషయంలో విస్మయం చెందుతున్నారు. ఏమిటి జగన్ ధైర్యం అని వారే ప్రశ్నిస్తున్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద బాహాటంగా, అధికారిక హోదాలో దాదాపు యుద్దం ప్రకటిస్తే, దేశం మొత్తం సెన్సేషన్ అయిపోవాలి. కానీ అనుకున్న రేంజ్ లో హడావుడి జరగలేదన్నది వాస్తవం. ఎందుకంటే న్యాయవ్యవస్థపై వున్న గౌరవంతో కూడిన భయం కావచ్చు. 

వ్యూహం ఏమిటి?

జగన్ వ్యతిరేక వర్గం మొదటి రోజు మౌనంగా వుండి, రెండో రోజు ఓ మౌలిక మైన ప్రశ్న వెలికి తీసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద, హైకోర్టు న్యాయమూర్తుల మీద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసారు ఒకె. ఆయనేం చర్య తీసుకుంటారో చూడకుండా ప్రజల్లోకి వెళ్లేలా రచ్చ చేయడం ఏమిటి? అని. 

ఇక్కడ జగన్ స్ట్రాటజీ కి పలు కారణాలు కనిపిస్తున్నాయి.  ఒకటి తను ఫిర్యాదు చేసిన విషయం రహస్యం కాదు. అది ఆటోమెటిక్ గా ప్రత్యర్థి మీడియాకు తెలుస్తుంది. వాళ్లు సండే చిలకపలుకులు వల్లిస్తారు. అందుకే ఆ టైమ్ కు తమ వెర్షన్ జనాల్లోకి పంపేస్తే..? అందుకే శనివారం రాత్రికి రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. 

అలాగే తాను చేసిన ఫిర్యాదుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ మేరకు స్పందిస్తారన్నది ఇప్పట్లో తెలియదు. ఏం చేసారు అని జగన్ పదే పదే అడగలేరు. ప్రధాన న్యాయమూర్తి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. ఆయన మీద అర్జెంట్ ఈ విషయాన్ని పరిశీలించమని వత్తిడి చేయలేరు. ఇప్పుడు విషయం పబ్లిక్ ముందు వుంచడం ద్వారా, ప్రధాన న్యాయమూర్తి ఏ విధంగా వ్యవహారిస్తారనే ఆసక్తిని ప్రజల్లో కలిగించగలిగారు. 

ఈ ఆసక్తిని గమనిస్తే ప్రధాన న్యాయమూర్తి మరి కాస్త చురుగ్గా వ్యవహరిస్తారనే ఎత్తుగడ దీని వెనుక వుండి వుండొచ్చు.  అదే విధంగా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తే, కేంద్రం స్పందించదు. అది కేంద్రం పరిథిలోది కాదు. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం న్యాయమూర్తులు కొందరిపై బాహాటంగా ధ్వజమెత్తితే, వ్యవస్థల మధ్య సమన్వయాన్ని, వ్యవస్థల మధ్య సంబంధాలను కాపాడడం కోసం కేంద్రం రంగంలోకి దిగవచ్చు. 

ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎప్పడయితే కేంద్రం తెలుసుకుంటోంది, ప్రధాన న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు అనగానే మరీ అడ్డగోలు వ్యవహారాలకు తెరపడే అవకాశం వుంది.  కీలకంగా జగన్ కు కావాల్సింది ఇదే. రోజు వారీ నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి లేకపోతే ఏ అధికారపదవిలో వున్నవారికైనా కాస్త చికాకుగానే వుంటుంది.

కేసుల కోసం అయితే కాకపోవచ్చు

ఇక జగన్ కేసులు అంటే అవన్నీ ఏ మేరకు ఎలా టర్న్ తీసుకుంటాయన్నది ఇప్పుడే తేలేది కాదు. నిజానికి అర్జెంట్ గా ఏడాది లోపు తేల్చేస్తారు అంటే, అక్కడి వరకు ఓకె. కానీ దాని తరువాత అప్పీళ్లు, వ్యవహారాలు అన్నీ వుంటాయి కదా? కోర్టు తీర్పులు ఎలా వుంటాయి. వాటి టెక్నికాలిటీస్ అన్నీ ప్రతి ఒక్కరు ఊహించేసేవి కాదు. కీలకమైన కేసుల తీర్పులముందు రోజు జనం రకరకాలుగా ఊహించుకుంటారు. 

అది మానవ సహజం. సినిమా విడుదలకు ముందు రోజు ఎలా వుంటుందో అని ఎవరికి వారు ఊహించుకున్నట్లే. కానీ తీర్పులు మాత్రం డిఫెన్స్ పనితనం మీద, సాక్ష్యాధారాల మీద ఎక్కువగా ఆధారపడి వుంటాయి. బలమైన సాక్ష్యాధారాలు లేకపోతే మర్డర్ కేసు కూడా నిలబడదు అంటారు న్యాయనిపుణులు.  అలాగే ఢిఫెన్స్ ను బట్టి కూడా తీర్పు ప్రభావితం అవుతుంది. అందుకే ఓ సినిమాలో డైలాగు వుంది..''కోర్టు కోర్టుకీ తీర్పు మారవచ్చు..మారకపోవచ్చు. అందువల్ల జగన్ లాంటి రేంజ్ లో వున్న వారు కోర్టు తీర్పుల పట్ల కాస్త నిమ్మళంగా వుండొచ్చు. 

పైగా జగన్ కు తన కేసులు తెలుసు. వాటి పర్యవసానాలు తెలుసు. వాటిని డీల్ చేసుకోవడమూ తెలుసు. అందువల్ల కేవలం వాటి కోసం ఏకంగా న్యాయ వ్యవస్థను ఢీకొనేందుకు దిగుతారు అని అనుకోవడం అవివేకం. పైగా అలా ఢీకొంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ అవుతుంది అని తెలియని వ్యక్తి కాదు. 

జగన్ కేసులకు మించి ఇంకేదో వుండి వుండాలి. పైగా కేంద్రంలో మోడీ లాంటి ప్రధాని వున్నపుడు, వాళ్లతో సఖ్యతతో వున్నపుడు, రేపు అవసరం అయితే ఓ కాపు కాయాల్సింది వాళ్లే అయినపుడు, వాళ్లకు చెప్పకుండా జగన్ ఇంత సాహసానికి ఒడిగడతారు అని అనుకోవడానికి లేదు. పైగా మోడీ, అమిత్ షాలకు కొంతయినా తెలియచేసి వుంటే వాళ్లు రెండు రకాలుగా స్పందించడానికి అవకాశం వుంటుంది. 

ఒకటి తొందరపడొద్దు, తాము ఏదో ఒకటి మాట్లాడతాం అని కావచ్చు. లేదా మీ ఇష్టం ప్రొసీడ్ అని అయినా కావొచ్చు. ఇక్కడ రెండోది జరిగింది అని అనుకుంటే అలా అనడం వెనుక ఢిల్లీ పెద్దల ఉద్దేశం ఏమై వుండొచ్చు? జగన్ చెప్పినదాన్ని వాళ్లు నమ్మి వుండొచ్చా లేక, కొండను ఢీ కొంటాను అంటున్నాడు, ఢీ కొట్టనీ అని జగన్ కర్మకే వదిలేసి వుంటారా?

దాచాలంటే దాగుతుందా

ఏమైనా బాహటంగా పెద్దగా స్పందన రాకున్నా, వ్యతిరేక స్పందన కూడా ఆచితూచి వస్తున్నా, ఈ విషయాన్ని వీలయినంత పబ్లిక్ లోకి వెళ్లకుండా చూడాలని ప్రయత్నించడం చూస్తుంటే జగన్ వ్యూహం వారికి అర్థం అయినట్లు, దానికి అనుగుణంగా కాకుండా, వ్యతిరేక దిశలో అడుగు వేయాలని అనుకుంటున్నట్లు అర్థం అవుతోంది. కంప్లయింట్ చేసారు కదా, ఇప్పుడ రచ్చ చేయడం ఎందుకు అని లాజికల్ పాయింట్ లాగడం అంటే ఏమనుకోవాలి? 

టోటల్ గా ఒకటి మాత్రం అంగీకరించాలి. ఏ వ్యవస్థ అయినా కాలానికి నిలవాలి. పరీక్షలకు తట్టుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అది రాజ్యాంగ వ్యవస్థ అయినా, మరే వ్యవస్థ అయినా.  కుళ్లిపోతున్న వ్యవస్థలను ఎలాగూ బాగు చేయలేం. కనీసం ఆ కుళ్లు నుంచి దేశాన్ని కాపాడాల్సిన న్యాయ వ్యవస్థను అయినా కాపాడుకోవాల్సిన అవసరం వుంది. 

ఏడాదికి ఓ సారి కంప్లీట్ బాడీ టెస్ట్ చేయించుకోవడం అంటే కుళ్లును వెలికి తీసుకోవడం అనుకోకూడదు. లోపల ఏం అనారోగ్యం వుందో తెలుసుకోవడం కోసం, దాన్ని బాగు చేసుకోవడం కోసం అనుకొవాలి. అలాగే న్యాయవ్యవస్థ మీద ఫిర్యాదులు లేదా ఆరోపణలు వస్తే ముందుగా ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దారుణం అని గగ్గోలు పెట్టే కన్నా, నిజాలు నిగ్గు తీసి, న్యాయ వ్యవస్థ నికార్సయిన నిజాయతీని నిలువుటద్దం ముందు ప్రదర్శించడం అవసరం. 

అప్పుడు ఈ దేశ ప్రజానికి కనీసం ఓ వ్యవస్థ ను  అయినా తమ కోసం, దేశ మనుగడ కు అండగా వుండడం కోసం, నమ్ముకోవచ్చు అనే నమ్మకం వుంటుంది. 

చంద్రంబావ క‌ళ్ల‌లో ఆనందం కోసం ఆర్కే ఆవేద‌న

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?