ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అభ్యర్థులపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఆసక్తి కనబరచడం లేదని సమాచారం. నంద్యాల లోక్‌సభ పరిధిలో ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు, నంద్యాల , పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థుల ఎంపికపై మాండ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది.
ఈ ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక మందకొడిగా సాగుతోంది. డోన్ నుంచి టీడీపీ తరపున సుబ్బారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. అలాగే బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్‌రెడ్డి పోటీ చేయనున్నారు. మూడు రోజుల క్రితం నంద్యాల నుంచి మాజీ మంత్రి ఎన్ఎమ్‌డీ ఫరూక్ పోటీ చేయనున్నట్టు పార్టీ ప్రకటించింది.
ఇక అధికారికంగా ప్రకటించాల్సినవి ఉన్నాయి. ఇప్పుడున్న ఇన్‌చార్జ్‌ల్లో కొందర్ని మార్చితే తప్ప, టీడీపీకి మంచి రోజులు రావనేది మాండ్ర శివానందరెడ్డి వాదన. అయితే ప్రస్తుతం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల్లో బీసీ జనార్దన్‌రెడ్డి తప్ప, మరెవరికీ ప్రజాబలం లేదని మాండ్ర అంటున్నారు. ఓడిపోతామని తెలిసి, కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. నంద్యాల నుంచి పోటీ చేయకూడదనే తన ఆలోచనను టీడీపీ అధిష్టానానికి మాండ్ర చేరవేసినట్టు తెలిసింది.
అయితే అసెంబ్లీ అభ్యర్థులను తప్పక మారుస్తామని, తొందరపడి బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేయవద్దని మాండ్రకు టీడీపీ పెద్దలు సూచించినట్టు సమాచారం. ముఖ్యంగా నంద్యాలలో శిల్పా కుటుంబాన్ని ఎదుర్కోడానికి బలహీనమైన నాయకుడిని ఎంపిక చేయడంపై ఎంపీ అభ్యర్థి అయిన మాండ్ర తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం. ఈ ఎంపిక ఎంపీ స్థానంపై తప్పక పడుతుందనేది ఆయన వాదన. మాండ్ర హెచ్చరికను టీడీపీ అధిష్టానం ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.