Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Gossip

ఆ ముగ్గురికీ చెక్ పెట్టడానికి నందమూరి ఫ్యామిలీ కావాల్సి వచ్చిందా?

ఆ ముగ్గురికీ చెక్ పెట్టడానికి నందమూరి ఫ్యామిలీ కావాల్సి వచ్చిందా?

ప్రస్తుతం తెలంగాణా రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు తగ్గలేదన్నట్లుగా కనబడుతోంది. దీనికి తోడు గులాబీ పార్టీ నుంచి, కాషాయం పార్టీ నుంచి కాంగ్రెస్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. 

మా పార్టీని టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల్లో కూలిపోతుందని ఓ బీజేపీ ఎమ్మెల్యే అన్నాడు. ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని, తరువాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు అన్నాడు.

ఓ పక్క పరిస్థితి ఇలా ఉండగా ఖమ్మం పార్లమెంటు సీటు కోసం ముగ్గురు మంత్రుల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. ఆ ముగ్గురూ ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి వికమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు. భట్టి తన భార్యకు టిక్కెట్ కావాలంటున్నాడు. పొంగులేటి తన తమ్ముడికి టిక్కెట్ ఇవ్వాలంటున్నాడు. తుమ్మల తన కొడుకును నిలబెట్టాలంటున్నాడు.

ముగ్గురూ పట్టు మీద ఉండటంతో రేవంత్ రెడ్డికి దిక్కు తోచడంలేదు. ఈ ముగ్గురిలో ఎవరికీ టిక్కెట్ ఇచ్చినా మిగిలిన ఇద్దరికీ కంటు (శత్రువు)అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరినీ శత్రువులను చేసుకోలేడు. వీళ్ళు బలమైన నాయకులు కాబట్టి ప్రభుత్వాన్ని ఏమైనా చేయవచ్చు. అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో ప్రియాంకను ఖమ్మం నుంచి పోటీ చేయించండి అని మొర పెట్టుకున్నాడు. కానీ ఆమె నార్త్ ఇండియా నుంచే పోటీ చేయడానికి ఇష్టపడుతోంది.

బయటి వ్యక్తిని పోటీ చేయిస్తే తప్ప ఖమ్మం సమస్య పరిష్కారమయ్యేలా లేదు. అందుకు పరిష్కారంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన అంటే ఆయన పెద్ద కుమారుడు హరికృష్ణ కూతురు సుహాసిని కనిపించి ఉండొచ్చు. ఆమె రేవంత్ రెడ్డిని తానై తాను కలిసి ఉండదు. ఆమె రావడానికి కారణం రేవంత్ రెడ్డి అయినా అయి ఉండాలి లేదా చంద్రబాబు అయినా అయి ఉండాలి. 

రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఆయన ఆత్మ టీడీపీలోనే ఉంటుంది. చంద్రబాబు ఆయనకు గురువు. ఖమ్మం నియోజకవర్గంలో సుహాసిని పేరు ఆలోచించడానికి మరో కారణం ఉంది. అక్కడ ఇప్పటికీ టీడీపీ అభిమానులు, ఎన్టీఆర్ కుటుంబ అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం గణనీయంగా ఉంది . ఆ సామాజిక వర్గం ప్రభావం బాగా ఉంటుంది. అందులోనూ ఆ జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది.

గతంలో ఖమ్మంలోనే టీడీపీ బహిరంగ సభ పెద్దఎత్తున జరిగింది. ఒకవేళ సుహాసినిని పోటీ చేయించాలనుకుంటే ఈ నేపథ్యం కారణమవుతుంది. రేవంత్ రెడ్డి ఇదంతా ఆలోచించి ఉండొచ్చు. సుహాసిని రేవంత్ రెడ్డిని కలుసుకోగానే ఆమె కాంగ్రెస్ లో చేరుతుందనే ఊహా గానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. అదే నిజమైతే ఖమ్మం నుంచి పోటీ చేయించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?