డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన ఇన్‌చార్జ్ పితాని బాలకృష్ణ సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన మాట నిలబెట్టుకోకపోవడంతో పితాని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తనను పవన్ అవమానిస్తున్నారని ఆయన వాపోతున్నారు. పొత్తులో భాగంగా ముమ్మడివరం సీటును ఆయన ఆశించారు.
జనసేనలో పితాని చేరే సమయంలో, తన పార్టీ తరపున పోటీ చేసే మొదటి అభ్యర్థి పితాని బాలకృష్ణ అని అట్టహాసంగా పవన్‌కల్యాణ్ ప్రకటించారు. నిజమే అని నమ్మిన పితాని బాలకృష్ణ ముమ్మడివరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ దఫా అసెంబ్లీ సీటు తనదే అని భావించి ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ ఇన్‌చార్జ్ దాట్ల సుబ్బరాజుకు సీటు కేటాయించారు. దీంతో పితాని తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.
రెండేళ్ల క్రితమే తనకు టికెట్ ఖరారు చేసి, కీలకమైన ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని పవన్ విస్మరించడం ఏంటని పితాని ప్రశ్నిస్తున్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కావడం వల్లే తనను విస్మరించారని ఆయన మండిపడుతున్నారు.
జనసేనలో శెట్టిబలిజలకు స్థానం లేదని, అందుకే పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పవన్‌ను కలిసేందుకు కూడా అవకాశం లభించకపోవడంతో ఇక పార్టీలో వుండడం వృథా అనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. త్వరలో వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఒకట్రెండు రోజుల్లో ఆయన పార్టీ మార్పుపై స్పష్టత రానుంది.