ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రచారానికి అన్ని పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి బుధవారం ఇడుపులపాయలో శ్రీకారం చుట్టారు.
ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్లో తండ్రి సమాధికి పూజలు చేశారు. అలాగే తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని ప్రజలతో మమేకం అయ్యేందుకు జగన్ ముందడుగు వేశారు. ఇడుపులపాయలో బయల్దేరి వేంపల్లె, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ఆయన ప్రొద్దుటూరు చేరుకోనున్నారు. దారి పొడవునా అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు.
బస్సులో బయల్లేరిన జగన్ను తమ కెమెరాల్లో బంధించేందుకు జనం ఆసక్తి చూపారు. ఇదిలా వుండగా ఇడుపులపాయలో విజయమ్మ తన కుమారుడిని ఆశీర్వదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “అందరి అమ్మలకు ఆయన భరోసా! ఆయనకు ఆ అమ్మ భరోసా!” అనే కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం విశేషం.
సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. ప్రొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం ఆయన ఆళ్లగడ్డకు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.