అంబటి రాయుడు… కొన్ని నెలల క్రితం ఏపీ రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయి, ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. ఆ తర్వాత అకస్మాత్తుగా వైసీపీని వీడుతున్నట్టు ట్వీట్ చేశారు. తనకు మ్యాచ్‌లో వుండడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు.
ఆ తర్వాత జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కలుసుకున్నారు. పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్టు అంబటి రాయుడు తెలిపారు. దీంతో జనసేనలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఎందుకనో జనసేనలో కూడా చేరలేదు. ఆ తర్వాత ఆయన్ను అందరూ మరిచిపోయారు.
తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేశారు. సిద్ధం అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలో మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని పురస్కరించుకుని అంబటి రాయుడు సిద్ధం అంటూ జగన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారనే అభిప్రాయం కలుగుతోంది. అంబటి తిరిగి వైసీపీలో చేరుతారేమో అని అంటున్నారు.
అంబటి రాయుడు క్రికెటర్ మాత్రమే కాదని, పొలిటికల్ ప్లేయర్ కూడా అని సెటైర్ విసురుతున్నారు. గతంలో గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా వైసీపీ తరపున అంబటి రాయుడు బరిలో దిగుతారనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయంలో అంబటి మద్దతు ఎవరికి వుంటుందనే చర్చకు తెరలేచింది.