ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న కేసీఆర్ ముద్దుల కూతురు కవితను తీహార్ జైలుకు పంపిన సంగతి తెలిసిందే కదా. తెలంగాణా నుంచి తీహార్ జైలుకు వెళ్లిన మొదటి పొలిటీషియన్ కవితే. అలాగే కల్వకుంట్ల కుటుంబం నుంచి తీహార్ జైలుకు వెళ్లిన మొదటి రాజకీయ నాయకురాలు కవితే. ఈ విధంగా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
సరే.. ఆ విషయం అలా ఉంచితే కవిత లిక్కర్ స్కాములో అరెస్టై ఈడీ విచారణను ఎదుర్కొంటున్నప్పటి నుంచి తాను ఓ పోరాట యోధురాలిగా హావభావాలు ప్రదర్శిస్తోంది. ఆమెను అరెస్టు చేసి హైదరాబాదు నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నప్పుడు, ఢిల్లీలో కూడా పిడికిలి పైకెత్తి అభివాదం చేయడం, చేతులు ఊపడం మొదలైన దృశ్యాలను టీవీల్లో చూసాం.
నిన్న కూడా ఆమెను తీహార్ జైలుకు తరలిస్తున్న సమయంలో ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని అంది. ఇదే సమయంలో ఆమె ఓ శపథం చేసింది. తనను తాత్కాలికంగా జైలుకు పంపించవచ్చుగానీ తన
మనోస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని అంది. తాను కడిగిన ముత్యంలా బయటపడతానని చెప్పింది.
ఆమె తన పిల్లగాడికి పరీక్షలు ఉన్నాయని, కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అడిగినా ఈడీ ఒప్పుకోలేదు. ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పింది. కవితను తీహార్ జైలుకు పంపగానే ఆమెకు బెయిల్ దొరకడం కష్టమని టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. ఈడీ కేసుల్లో బలమైన కారణాలుంటే తప్ప బెయిల్ దొరకడం కష్టం.
అందులోనూ ఇది మనీ లాండరింగ్ కేసు. 2002 లో రూపొందించిన మనీ లాండరింగ్ నిరోధక చట్టం చాలా కఠినమైంది. ఈడీ అరెస్టు చేసినవారు తాము నేరం చేయలేదని వారే నిరూపించుకోవాలి. పోలీస్ కేసుల్లో అయితే పోలీసులు నిరూపించాల్సి ఉంటుంది. కానీ ఇది దానికి భిన్నంగా ఉంటుంది.
ఈడీ వ్యతిరేకిస్తే వీరికి బెయిల్ దొరకదు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా ఏం చేయలేదు. సో.. కవిత కడిగిన ముత్యంలా బయటపడటం అంత సులభం కాదనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్, కవిత, కేటీఆర్ ఈడీ… బోడీ తమను ఏం పీకలేవని అన్నారు. తాము భయపడబోమన్నారు. తమను ఏమన్నా చేస్తే తెలంగాణా సమాజం ఉరుకోదన్నారు.
కానీ ఇప్పుడు కవితను తీహార్ జైలుకు పంపినా కేసీఆర్ ఏం మాట్లాడలేకపోతున్నాడు. తెలంగాణా సమాజం నుంచి స్పందన లేదు.