ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే నియోజకవర్గం ఏదైనా వుందంటే… అది ప్రొద్దుటూరు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బామ్మర్ది వైఖరులు వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చాయి. దీంతో పార్టీకి ఇంత కాలం అండగా వున్న వాళ్లు సైతం దూరమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని ఎంపిక చేయడంతో ఆ పార్టీకి ఊపు వచ్చింది.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా టీడీపీలోకి వలసలు పెరిగాయి. తాజా పరిస్థితులను గమనిస్తే టీడీపీకి సానుకూల వాతావరణం నెలకుంది. ఇలాంటి నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తుండడం గమనార్హం. ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే జగన్ ప్రచారం… దారి పొడవునా గ్రామాల్లో ప్రజలను ఆయన పలకరించనున్నారు.
సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకోనున్నారు. ప్రొద్దుటూరులో ప్రచార సభ ఏర్పాట్లను ఇప్పటికే రాచమల్లు నేతృత్వంలో చేశారు. టీడీపీలో అసంతృప్తులంతా కలవడం ఆ పార్టీకి బలం. వైసీపీలో మాత్రం కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, పలువురు కౌన్సిలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాచమల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఒకవైపు జగన్ ముద్దు, రాచమల్లు వద్దు అని వారంతా నినదిస్తున్నారు. బహుశా ప్రొద్దుటూరులో వైసీపీ పరిస్థితి బాగా లేదనే కారణంతోనే మొదటి సభను జగన్ అక్కడ నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు.