గెలిచే గ్యారెంటీ లేనప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు!

ఎటూ గెలిచే అవకాశం లేదు గనుక.. కాంగ్రెస్ ఎడాపెడా అలవిమాలిన హామీలిస్తోందని అనుకుంటున్నారు.

గెలిచిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తమను నిందిస్తారని.. ప్రతిపక్ష నాయకులు తమ మీద విమర్శలు గుప్పిస్తూ ఆటాడుకుంటారని రాజకీయ పార్టీలకు ఒక రకమైన భయం ఉంటుంది. అదే ఎట్టి పరిస్తితుల్లోనూ మనం గెలిచేది లేదు.. అధికారంలోకి వచ్చేది లేదు.. అనే నమ్మకం ఉన్నప్పుడు వారికి ఎక్కడలేని ధీమా వచ్చేస్తుంది. అలాంటప్పుడు వారు ప్రజలు ఊహించలేనంతటి గొప్ప హామీలను ఇచ్చేస్తారు.

అరచేతిలో స్వర్గం సృష్టించేస్తాం అని కూడా అంటారు.. సాధారణంగా అంతగా బలం లేని కొన్ని చిన్న పార్టీలు, కెఎ పాల్ వంటి రాజకీయ కమెడియన్లు విషయంలో ఇలాంటి హామీలు మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ కాంగ్రెసు పార్టీ నుంచి కూడా ఇలాంటి మాటలు వస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ.. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల బరిలో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్న కాంగ్రెస్ ఫార్టీ.. అలాంటి అలవిమాలిన హామీలతో గుదిగుచ్చిన మేనిఫెస్టోను విడుదల చేసి.. ప్రజలు తమను ఏమైనా కరుణిస్తారేమో అని ఎదురు చూస్తోంది.

కాంగ్రెస్ ఢిల్లీలో ప్రధానంగా ఐదు గ్యారెంటీలు అంటూ.. అయిదు హామీలు ప్రకటిస్తోంది. ఇందులో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అనేది ఒకటి. ఈ హామీ ఆల్రెడీ తెలంగాణలో అమలవుతున్నది కూడా. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ కూడా ప్రకటించారు.. అది కూడా అమలవుతున్నదే. వీటి సంగతి పక్కన పెడితే.. రాష్ట్రంలో ప్రతి మహిళకు రూ.2500 ప్రతినెలా ఇస్తాం అంటూ కొత్త హామీ ప్రకటించింది. వృద్ధులకు వితంతువులకు, వికలాంగులకు నెలకు రూ.5వేల వంతున పింఛను ఇస్తాం అని కూడా ప్రకటించింది. అలాగే యువతకు నెలకు రూ.8500 రూపాయల స్టయిఫండ్ ఇస్తాం అని కూడా ప్రకటించింది.

ఇవి మరీ ఆచరణ సాధ్యం కాని హామీలు అన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.2500, 5వేల రూపాయల పెన్షను అనేవి చాలా పెద్ద విషయాలని.. కాంగ్రెస్ ప్రస్తుతం ఏలుబడి సాగిస్తున్న రాష్ట్రాల్లో వాటిని అమలు చేస్తే లేదా ప్రకటిస్తే తప్ప.. ఢిల్లీలో మాత్రం అమలు చేస్తారని ప్రజలు నమ్మలేరని విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే సమయంలో.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, వారిని ఓడించి అధికారంలోకి రావాలని తపన పడుతున్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీ బరిలో కీలకంగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ కు పెద్దగా బలంలేదు. ఎటూ గెలిచే అవకాశం లేదు గనుక.. కాంగ్రెస్ ఎడాపెడా అలవిమాలిన హామీలిస్తోందని అనుకుంటున్నారు.

5 Replies to “గెలిచే గ్యారెంటీ లేనప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు!”

  1. మన తల్లి అన్నపూర్ణ ( సోనియమ్మ ) మన అన్న ( రాహుల్) దాన కర్ణ, ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము అని పాడుకోవడమే అతికినట్టు ఉంటుంది.

Comments are closed.