27 యేళ్ల త‌ర్వాత ఢిల్లీలో బీజేపీ .. ఎగ్జిల్ పోల్స్!

ఢిల్లీలో ఆప్ హ్యాట్రిక్ సాధించి, అధికారాన్ని అందుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.

ఢిల్లీలో ఆప్ హ్యాట్రిక్ సాధించి, అధికారాన్ని అందుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. దేశ‌రాజ‌ధానిలో గ‌త రెండు ప‌ర్యాయాల్లో క్లీన్ స్వీప్ చేసి విజ‌యాన్ని అందుకున్న ఆప్ ఈ సారి అధికారానికి దూరంలో నిల‌బ‌డ‌వ‌చ్చ‌ని ఇవి అంచ‌నా వేస్తూ ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు ఆప్ కు కాస్త అవ‌కాశం ఉంద‌నే అంటున్నా, అన్ని పోల్స్ యావ‌రేజ్ ను తీసుకుంటే మాత్రం బీజేపీకే ఢిల్లీలో జ‌యం అనే మాట వినిపిస్తూ ఉంది.

గ‌త పాతికేళ్ల‌కు పై నుంచినే ఢిల్లీలో అధికారం కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసిన బీజేపీకి ఇప్పుడు అవ‌కాశం ల‌భించ‌వ‌చ్చ‌నే మాట వినిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ నుంచి. ఆప్ గ‌త ప‌దేళ్ల నుంచి ఢిల్లీలో అధికారంలో ఉంది. అందుకు ముందు కొంత కాలం పాటు కూట‌మి ప్ర‌భుత్వాల‌తో ఆప్ బండి లాగింది. దానిక‌న్నా మునుపు షీలా దీక్షిత్ గోల్డెన్ ఎరాలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వ‌ర‌స‌గా మూడు ప‌ర్యాయాలు అధికారాన్ని నిల‌బెట్టుకుంది.

కామ‌న్ వెల్త్ గేమ్స్ స్కామ్ త‌ర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవ‌డం మొద‌లైంది. ఆప్ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా అవ‌త‌రించ‌డంతో అక్క‌డ కాంగ్రెస్ ఖాళీ చేసింది. ప‌ది సంవ‌త్స‌రాల కింద‌ట ఆప్ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. అప్ప‌టి కొన్నాళ్ల పాటు కేజ్రీవాల్ సంకీర్ణ స‌ర్కారు న‌డిపారు. అయితే ప‌దేళ్ల కింద‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యంతో కేజ్రీవాల్ సీఎం అయ్యారు. ఆ త‌ర్వాత ఐదేళ్లు బీజేపీతో పేచీల‌తోనే పాల‌న సాగినా, వ‌ర‌స‌గా రెండో ప‌ర్యాయం కూడా మంచి మెజారిటీతో ఆప్ కు అధికారం ద‌క్కింది.

హ్యాట్రిక్ మాత్రం సాధ్యం కాద‌ని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. స్థూలంగా ఆప్ కు ముప్పై సీట్ల వ‌ర‌కూ రావొచ్చ‌ని, బీజేపీకి 39 సీట్లు ద‌క్క‌వ‌చ్చ‌ని ఎగ్జిట్ పోల్స్ స‌గ‌టు చెబుతూ ఉంది. కాంగ్రెస్ ఖాతా తెర‌వ‌డం కూడా క‌ష్ట‌మే అని ఇవి చెబుతూ ఉన్నాయి. మ్యాట్రిజ్ పోల్ గ‌రిష్టంగా ఆప్ కు 37 సీట్లు రావొచ్చ‌ని అంచ‌నా వేసింది. మైండ్ బ్రిక్ అనే సంస్థ వేసిన లెక్క‌ల ప్ర‌కారం ఆప్ కు గ‌రిష్టంగా 49 సీట్లు రావొచ్చు. పీపుల్స్ ప‌ల్స్, జేవీసీ, పీమార్క్ ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు బీజేపీ స్ప‌ష్ట‌మైన మెజారిటీతో అధికారం అందుకుంటుంద‌ని అంచ‌నా వేశాయి.

4 Replies to “27 యేళ్ల త‌ర్వాత ఢిల్లీలో బీజేపీ .. ఎగ్జిల్ పోల్స్!”

Comments are closed.