భారతదేశంలో పితృస్వామ్య వ్యవస్థ ఎంత బలీయమైనది అంటే, పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల్లో కూడా ఇదే వేదంగా సాగుతూ ఉంటుంది. తండ్రి రాజకీయ నేపథ్యాన్ని మోసేది వారసుడే తప్ప, వారసురాలు కాదనే నియమం కొనసాగుతూ ఉంది. అరుదుగా తప్ప, ఇలాంటి స్వామ్యమే నడుస్తూ ఉంది. దీనికి కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ కూడా మినహాయింపు కాదనేది తెలిసిన సంగతే!
ఇందిరను గుర్తు చేస్తోంది అంటూ.. ఎప్పటికప్పుడు చెప్పుకోవడమే కానీ, ప్రియాంక ప్రత్యక్ష రాజకీయానికి కుటుంబమే అడ్డంకి అనే మాట మొదట్నుంచి వినిపిస్తూ ఉంది. సోనియా తన పుత్ర ప్రేమ మేరకు ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల వైపు ప్రోత్సహించడం లేదనే విశ్లేషణలు ఉండనే ఉన్నాయి. రాహుల్ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా.. ప్రియాంకను ఆమె ముందుకు తీసుకురావడం లేదనే విమర్శలూ వచ్చాయి. ఎన్నో సార్లు ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల వైపు అనే ఊహాగానం వినిపించింది కానీ, అది అలాగే ఆగిపోయింది.
ఎట్టకేలకూ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో, తొలిసారి ఎన్నికల పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. అది కూడా తన అన్న రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు. అయితే ప్రియాంక సీరియస్ పొలిటీషియనేనా? అనేది ఇప్పటికీ ప్రశ్నే! ఈ విషయాన్నే ఆమె ప్రత్యర్థులు వాడుకుంటూ ఉన్నారు.
ఏదో రాహుల్ రాజీనామా చేసి వెళ్లిపోయాడనే విమర్శను ఎదుర్కొనేందుకు ప్రియాంకను రంగంలోకి దించారు తప్ప, ఆమె సీరియస్ రాజకీయాల్లో ఉంటుందనుకోవడం లేదని కమ్యూనిస్టు పార్టీల వాళ్లే మొదలుపెట్టారు. వయనాడ్ లో ప్రియాంకను గెలిపించడం వల్ల ఉపయోగం లేదనే ప్రచారం కోసం వారిలా మాట్లాడుతున్నా, నిజంగా ప్రియాంక ధాటైన రాజకీయం చేస్తుందా అనేది ప్రశ్నార్థకమే!
ఎప్పుడో తన 19 యేళ్ల వయసు 1989 ఎన్నికల సమయంలో తను తొలి సారి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టానని, ఇప్పుడు తను ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్టుగా ప్రియాంకే చెబుతున్నారు. అంటే దాదాపు ముప్పై ఐదేళ్లు పట్టింది. మరి ఇన్నేళ్ళ తర్వాత తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న ప్రియాంక పట్ల వయనాడ్ ప్రజానీకం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం. పరిణతి చెందిన తీర్పులు ఇవ్వడంలో దిట్టలు అయిన కేరళ జనాలు ప్రియాంకను ఏ మేరకు ప్రోత్సహిస్తారనేది చూడాలి.
లోక్ సభలో సోనియా, రాహుల్ ఉండటం కాంగ్రెస్ సంప్రదాయం కొన్నేళ్లుగా. ఇప్పుడు సోనియా సభలో లేరు, ప్రాతినిధ్యం తగ్గకూడదన్నట్టుగా ప్రియాంకను తెరపైకి తెచ్చారా, అంతకు మించి ప్రియాంక కాంగ్రెస్ రాజకీయంలో మరింత క్రియాశీలకం అవుతారా అనేది ఆసక్తిదాయకమైన రాజకీయ అంశం.