ఎన్నికలొస్తున్నాయిగా …గట్టిగా ఒట్టు పెట్టుకున్నాడు

ఇక శాశ్వతంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఉండిపోతానని గట్టిగా ఒట్టు పెట్టి చెప్పాడు.

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవనే సంగతి అందరికీ తెలుసు. అలా ఉంటే పార్టీల, అధినేతల, నాయకుల రాజకీయ ప్రయోజనాలు నెరవేరవు. శత్రుత్వానికో, మిత్రత్వానికో జీవితాంతం కట్టుబడి ఉంటే కొంప కొల్లేరవుతుంది. అందుకే రాజకీయ నాయకులకు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి. ఏ ఎండకా గొడుగు పట్టాలి. ఎవరో కొద్దిమంది తప్ప, దేశంలోని ప్రతి రాజకీయ నాయకుడికి ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న ఓ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఇక శాశ్వతంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఉండిపోతానని గట్టిగా ఒట్టు పెట్టి చెప్పాడు. అంటే హామీ ఇచ్చాడని అర్థం.

ఇంతకూ ఎవరా ముఖ్యమంత్రి అంటే బీహార్ ముఖ్యమంత్రి మరియు జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఆయన హామీ ఇచ్చింది ఎవరికి? కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు. ఆయన మరియు ప్రధాని మోదీ బీజేపీకి రెండు కళ్లు కాబట్టి వారిలో ఎవరికి హామీ ఇచ్చినా లేదా ఒట్టు పెట్టినా ఒకటే. ఎందుకిలా ఎన్డీఏలోనే శాశ్వతంగా ఉంటానని చెప్పాడు? ఎందుకంటే ఈ ఏడాది ఆఖరిలో అంటే సుమారుగా నవంబరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రత్యర్థులను ఎదుర్కొని విజయం సాధించి తిరిగి సీఎం కావాలంటే బీజేపీ అండదండలు అవసరం. ఏ ఇండియా కూటమిని నమ్ముకుంటే బతుకు బస్టాండు అవుతుంది.

కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి దాంట్లోనే ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. నితీష్ కుమార్‌కు ‘అయారామ్ గయారామ్’ అనే పేరుంది. ఎన్డీఏ నుంచి బయటకు రావడం, మళ్లీ అందులోనే చేరడం ఆయనకు మామూలే. రెండుసార్లు బీజేపీ నుంచి దూరమయ్యానంటూ నితీష్ కుమార్ పశ్చాత్తపం వ్యక్తం చేశారు. తనకు ఇక బుద్ధి వచ్చిందన్నట్లుగా మాట్లాడారు. ఇక భవిష్యత్తులో ఆరు నూరైనా తప్పు మళ్లీ చేయనని లెంపలు వేసుకున్నారు. పార్టీలోని కొందరు నాయకుల వల్లనే అలా జరిగిందని చెప్పారు. ఈసారి బీజేపీతో బంధం ఫెవికాల్‌తో అతికించినట్లు చాలా గట్టిగా ఉంటుందని చెప్పారు.

ప్రస్తుతం మోదీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న రెండు పిల్లర్స్‌లో నితీష్ ఒకడు. మరొకాయన టీడీపీ అధినేత మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్న సంగతి తెలిసిందే కదా. నితీష్ కుమార్ ఫిరాయింపుల చరిత్ర చాలా పెద్దదే. బీహార్‌లో ఎక్కువ కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా కూడా నితీష్ కుమార్ రికార్డు సాధించారు. కాని నిలకడ లేని మనిషిని పేరు తెచ్చుకున్నారు. 2014లో బీజేపీతో 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపారు. ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది. దీంతో నితీష్ మళ్లీ సీఎం కుర్చీ దక్కించుకున్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌ను డిప్యూటీ సీఎంను చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 2017లో నితీష్ కుమార్ మహాకూటమికి షాక్ ఇచ్చారు. ఐఆర్‌సీటీసీ స్కాంలో డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరు తెరపైకి రావడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే ఎన్డీయేలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగి విజయం సాధించడంతో మళ్లీ సీఎం సీటు నితీష్ కుమార్‌కు దక్కింది. రెండేళ్ల తర్వాత బీజేపీతో సమస్యలు మొదలు కాగానే 2022లో మరోసారి సీఎం పదవికి రాజీనామా చేశారు.

గంటల వ్యవధిలోనే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తేజశ్విని మళ్లీ డిప్యూటీ సీఎంను చేశారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఆ కూటమిని వదిలేసి తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. ఆయన నిర్ణయంతో ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ అలయన్స్ అంటే ఇండియా కూటమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇలా కూటమిని ఎప్పుడంటే అప్పుడే మార్చి.. ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోయే లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు నితీష్ కుమార్. పొత్తు ఎవరితో ఉన్నా.. ఏ కూటమిలో ఉన్నా సీఎం పదవిని మాత్రం దక్కించుకుంటున్నారు. సరే…ఎన్‌డీఏను వీడేది లేదని గట్టిగా చెప్పిన నితీష్‌ను బీజేపీ అంత త్వరగా నమ్ముతుందా? మళ్లీ కూటమి మారడని గ్యారంటీ ఏముంది?

2 Replies to “ఎన్నికలొస్తున్నాయిగా …గట్టిగా ఒట్టు పెట్టుకున్నాడు”

Comments are closed.