హేపీ బర్త్‌డే: ఒక యోధుడు రేవంత్ రెడ్డి!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ రాజకీయ నాయకుడితోనూ పోల్చలేనంతగా ఈ ఏడాదిలో ఆయన తన ముద్ర చూపించారు.

ఆయన ఆ పార్టీకి సీనియర్ నాయకుడు కాదు. అసమానమైన ప్రజాదరణ ఉన్న క్రేజీ నాయకుడు కూడా కాదు. ఘనమైన చరిత్ర గల రాజకీయ కుటుంబపు వారసత్వంతో అలరారే వాడు కూడా కాదు. ఒకదశలో ప్రత్యర్థులు ఆయన పేరెత్తి మాట్లాడడానికి కూడా ఇష్టంలేనట్టుగా చులకన చేశారు. సొంత పార్టీ నాయకులు.. ఆయన సారథ్యాన్ని బహిరంగంగానే కించపరిచారు. ఇంటా బయటా కూడా ఆయన సామర్థ్యంపై అనుమానాలు పుట్టించే అనేకానేక ప్రచారాలు సాగాయి.

ఇలాంటి అన్ని రకాల ప్రతికూలతలను తోసిరాజంటూ.. ఒక వ్యక్తి అసమాన నాయకుడిగా ఆవిర్భవించాడు. తమ ఏలుబడి శాశ్వతం అనుకున్న వారి అహంకారపు గడీల గోడల్ని తుత్తునియలు చేశాడు. ఈ ప్రాంత ప్రజల చిరకాలవాంఛను సాకారం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున తొలి ముఖ్యమంత్రిగా అవతరించాడు. అందుకే, ‘‘పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2023- రేవంత్ రెడ్డి’’ అని గుర్తించిన గ్రేట్ ఆంధ్ర అప్పట్లో కవర్ స్టోరీ ప్రచురించింది.

సుమారుగా ఏడాది గడుస్తోంది. పరిస్థితుల్లో ఆయన దూకుడులో అసమాన హీరోయిజంలో ఏమీ పెద్దగా మార్పు రావడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గతంలో ప్రచురించిన కథనాన్ని మళ్లీ అందిస్తున్నాం.

సామాన్య కుటుంబంలో పుట్టి.. రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన వారి గురించి వర్తమాన రాజకీయాల్లో అన్వేషించాల్సి వస్తే.. ముందుగా ప్రధాని నరేంద్రమోడీ పేరు వినిపిస్తుంది. మనం కాస్త లోతుగా గమనిస్తే.. ఆయనకు రాజకీయ వైభవస్థితికి ఎంతోకాలం ముందునుంచి కూడా.. దేశమంతటా విస్తరించిన ఒక ప్రభావశీలమైన సంస్థ యొక్క పూర్తి మద్దతు ఉంది. అటువంటి ఆరెస్సెస్ లో ఆయన తొలి నుంచి ఎంతో క్రియాశీలంగా ఉంటూ.. వారి గుర్తింపును సంపాదించి.. ఆ సంస్థ ఆలంబనగా తన రాజకీయ సోపానాలను నిర్మించుకుంటూ ఎదిగారు. కానీ అంతకంటె విలక్షణంగా తన సొంత బలంతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు ఎనుముల రేవంత్ రెడ్డి! ఈ ప్రస్థానంలో రేవంత్ రెడ్డి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. ఎత్తు పల్లాలను చవిచూశారు.

రేవంత్ రెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. ఆయన విద్యార్థిగా ఉండగా భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉండే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కార్యకర్తగా ఉన్నారు. ఆ రకంగా కమలదళంతో ఆయనకు పూర్వాశ్రమంలో అనుబంధం ఉంది. తర్వాతి కాలంలో ఆయన ఆరెస్సెస్ అధికార పత్రిక జాగృతిలో పనిచేశారు. అయినప్పటికీ కూడా.. రాజకీయం వైపు ఆయన అడుగులు మాత్రం స్వశక్తిని నమ్ముకునే పడ్డాయి. కేవలం పద్దెనిమిదేళ్ల రాజకీయ ప్రస్థానంలోనే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లారు.

ఈ శిఖరారోహణ అనేది అంత సులువుగా ఏమీ జరగలేదు. 2006లో రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలం నుంచి జడ్పీటీసీ గా గెలిచారు. ఇండిపెండెంటుగా పోటీచేసి గెలిచారు. 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంటుగానే పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. ఆ విజయంకోసం తాను సొంతంగా ఎంతటి ప్రజాబలాన్ని నమ్మకాన్ని కూడగట్టుకుని ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ అయిన తర్వాతే.. రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడును కలిసి తెలుగుదేశంలో చేరారు.

రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందనే ప్రచారాలన్నీ ఉత్తుత్తివే. ఆ తర్వాత రేవంత్ కార్యక్షేత్రం కొడంగల్ అయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడినుంచి తెలుగుదేశం తరఫున పోటీచేసిన రేవంత్, ఆ సీటు నుంచి అయిదుసార్లుగా నెగ్గుతున్న గురునాధరెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో కూడా గెలిచిన రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న తర్వాత.. తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెసు పార్టీలో చేరారు. 2018 ఎన్నికలు ఆయనకు కలిసిరాలేదు. ఓటమి తప్పలేదు. కానీ అది కూడా ఆయన మంచికే అన్నట్టుగా జరిగింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన రేవంత్.. ఢిల్లీలో ఉంటూ.. కాంగ్రెసు పార్టీ అధిష్ఠానం పెద్దలకు సన్నిహితులయ్యారు. దాని ఫలితంగానే తెలంగాణ కాంగ్రెసు పార్టీలోని ఎంతో మంది సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, నిరసన తెలియజేసినప్పటికీ.. రేవంత్ 2021లో టీపీసీసీ సారథ్యం చేపట్టారు. తన పట్ల ఉన్న వ్యతిరేకతలను తట్టుకుంటూ తన పని తాను చేసుకుపోతూ మొత్తానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు పార్టీని తొలిసారిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు.

విలక్షణ నేత ఎలాగంటే..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినంత వరకు నిన్నటి వరకు సెలబ్రిటీలుగా వినిపిస్తున్న పేర్లు కొన్ని మాత్రమే. ఈ వరుసలో చంద్రబాబునాయుడు పేరు అందరికంటె ముందు ఉంటుంది. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తర్వాత పేర్లను వెతుక్కోవాలి. అంతో ఇంతో తెలంగాణలో బండి సంజయ్ నిర్మించుకున్న పాపులారిటీ కూడా ఆయనకు అప్పటికి లేదు. ఆ మాటకొస్తే కిషన్ రెడ్డి కాస్త పెద్దనాయకుడిగా చెలామణీ అవుతున్నారు.

రేవంత్ రెడ్డి చేతిలో టీపీసీసీ సారథ్యం ఉన్నప్పటికీ.. పెద్దస్థాయి నాయకుడిగా చెలామణీలోకి రాలేదు. కేవలం అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో పార్టీలో ఉండే ముఠాలు, వాటి మధ్య కుమ్ములాటలు మాత్రమే కారణం. రేవంత్ రెడ్డి పట్ల బహిరంగంగానే వ్యతిరేకతను వెలిబుచ్చిన నాయకులు అనేకులు. రేవంత్ ను తొలగించి తమ చేతికి పార్టీ సారథ్యం అప్పగిస్తే గనుక.. పూర్తిగా సొంత నిధులతో రాష్ట్ర పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తామని అధిష్టానానికి ఆఫర్లు పెట్టిన పెద్దలు కూడా ఉన్నారు. వీరిందరి రూపంలో ప్రతికూలతలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. రేవంత్ రెడ్డి సెలబ్రిటీ నాయకుడిగా హఠాత్తుగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.

నెమ్మదిగా పార్టీలో పరిస్థితులు సర్దుకున్నాయి.. అనడం కంటే, అధిష్ఠానం ఈ ముఠాల మీద కన్నెర్ర జేసింది అనడం సబబు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని నెలల ముందే జరిగిన తొలి సన్నాహక సమావేశంలోనే.. రాహుల్ గాంధీ వర్గవిభేదాల గురించి చాలా సీరియస్ గా మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి ఎవ్వరైనా కట్టుబడి ఉండాల్సిందేనని, ఇష్టం లేని వారు పార్టీని వీడిపోవచ్చునని గట్టిగానే చెప్పారు. రేవంత్ కు వ్యతిరేకంగా ముఠాలు కడుతున్న నాయకులను కూడా విడిగా పిలిచి మాట్లాడారు. వారిని హెచ్చరించారో బుజ్జగించారో మనకు తెలియదు. కానీ.. రేవంత్ నాయకత్వానికి అధిష్ఠానం వైపు నుంచి తిరుగులేని మద్దతు లభించింది. లోలోపల ఇష్టంలేకపోయినా కొందరు సీనియర్లు.. ఆయన సారథ్యాన్ని ఆమోదించాల్సి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ప్రసాదించినది తామే గనుక.. అక్కడి రాష్ట్రప్రజ తమను శాశ్వతంగా నెత్తిన పెట్టుకుంటారని కాంగ్రెస్ అప్పట్లో తలపోసింది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ భూస్థాపితం అవుతుందని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఖాతరు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. అయితే వారి అంచనాలు వరుసగా రెండు ఎన్నికల్లోనూ తల్లకిందులయ్యాయి.

రెండు దఫాలుగా ఏలుబడి సాగించిన కేసీఆర్ మరియు గులాబీదళం.. ఇక రాజ్యం ఎప్పటికీ తమదే అనే ఊహల్లో పాతుకుపోతూ ఉందనుకుంటున్న తరుణంలో.. 2023 ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెసు పార్టీ మాత్రం రేవంత్ ను పూర్తిగా నమ్మింది. చెప్పుడు మాటలకు, పితూరీలకు నిత్యం అవకాశం ఉండే కాంగ్రెసు సంస్కృతిలో ఎనుముల రేవంత్ రెడ్డి అధిష్ఠానం నుంచి అంతటి తిరుగులేని నమ్మకాన్ని ఎలా సొంతం చేసుకున్నారనేది నిజంగా మిస్టరీనే.

ఒంటిచేత్తో పార్టీని ముందుకు నడుపుతూ..

ఎన్నికలు వచ్చిన తర్వాత.. రేవంత్ రెడ్డి అన్నింటా తానై వ్యవహరించారు. తనకంటె గొప్పవాళ్లుగా భావించుకుంటూ ఉండే, తనంటే కిట్టని సీనియర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో వారితో మొండిగానూ, కొన్ని సందర్భాల్లో మెతగ్గానూ సమయానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరికి ఎన్నికలు సమీపించే వేళకు అధిష్ఠానం అందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చింది. అయితే మాత్రం ఏమైంది?

తాము రాష్ట్రస్థాయి పాపులారిటీ ఉన్న పెద్ద నాయకులం అని చెప్పుకున్న వాళ్లంతా ఎన్నికల గోదాలోకి దిగిన తర్వాత.. పూర్తిగా తమతమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయ్యారు. అధిష్ఠానం కేసీఆర్ కు గుణపాఠం చెప్పే ఉద్దేశంతో ఆయన పోటీచేసిన రెండో నియోజకవర్గం కామారెడ్డిలో కావాలనే రేవంత్ ను పోటీకి దింపింది. తన సొంత కొడంగల్ తో పాటు, కామారెడ్డిలో కూడా రేవంత్ తొడకొట్టారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి పాలు కావడంలో తన వంతు పాత్ర కూడా ఘనంగా పోషించారు.

కాంగ్రెస్ సీనియర్లు, ఉద్దండులు అందరూ కూడా కేవలం తమ సొంత నియోజకవర్గాలకు, మహా అయితే ఇరుగుపొరుగు ఒకటిరెండు నియోజకవర్గాలకు మాత్రం పరిమితమైన సమయంలో రేవంత్ రెడ్డి.. ఏక ధాటిగా రాష్ట్రమంతా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం యావత్తూ తనొక్కడి భుజస్కంధాల మీద మోశారంటే అతిశయోక్తి కాదు.

అంత కష్టం పడ్డారు గనుకనే.. అధిష్ఠానం సీఎం ఎంపిక విషయంలో ఆయనకు దన్నుగా నిలిచింది. ఒకరకంగా చెప్పాలంటే.. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నంత పాపులారిటీ రేవంత్ కు లేదు. 2004లో వైఎస్సార్ తర్వాత.. పార్టీ అధిష్ఠానం నిర్ద్వంద్వంగా ముఖ్యమంత్రి విషయంలో స్థిరంగా మద్దతిచ్చినది రేవంత్ విషయంలోనే. వైఎస్సార్ మరణం తర్వాత.. అనేక పేర్ల కాంబినేషన్లు నడుస్తూ వచ్చాయి. ఈ దఫా అలాంటి చర్చ లేదు.

ఎన్నికల వేళ మిన్నకుండిన ముఠాలు.. ఫలితాలు వెలువడగానే మళ్లీ జడలు విప్పాయి. సీఎం పోస్టు మాకంటే మాకు.. మేం ఇంతటి సీనియర్లు ఉండగా.. వేరే పార్టీనుంచి వచ్చిన జూనియర్ కు ఇస్తారా అనే పోలికలు కూడా నడిచాయి. కానీ.. అధిష్ఠానం స్థిరంగా వ్యవహరించింది. మొండికేసిన వారికి సర్దిచెప్పింది. రేవంత్ నే ముఖ్యమంత్రిని చేసింది.

ముఖ్యమంత్రిగా సొంత ముద్ర!

ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి సొంత ముద్రను చూపిస్తున్నారు. సాధారణంగా ఆ స్థానానికి వచ్చిన ఏ నాయకుడు అయినా.. ముందు తాను మరింతగా పాతుకోవడం మీదనే దృష్టి పెడతారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలోని అందరు సీనియర్లకు సమప్రాధాన్యం ఇస్తున్నారు. రేవంత్ వైఖరి ఎంత సానుకూల పోకడలతో సాగుతున్నదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ ప్రస్తావించాలి. కొత్త ముఖ్యమంత్రి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీల పరంగా వైరం ఉన్నప్పటికీ కూడా.. ఢిల్లీ వెళ్లి ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఆనవాయితీ.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా ముఖ్యమంత్రి తన వెంట ఉపముఖ్యమంత్రిని కూడా తీసుకువెళ్లి ప్రధానితో భేటీ అయిన ఉదంతం ఉన్నదా? ప్రభుత్వం తరఫున ప్రకటనలు విడుదల చేస్తే.. ముఖ్యమంత్రి ఫోటోకు తోడుగా ప్రకటనను బట్టి.. ఆయాశాఖల మంత్రుల ఫోటోలు కనిపిస్తుంటాయి. అంతే తప్ప.. ప్రతి ప్రకటనలోనూ ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండడం మనం ఎరుగుదుమా? ముఖ్యమంత్రికి అధికార నివాసం ఖాళీ అయిన తర్వాత.. తదుపరి ముఖ్యమంత్రి అందులోకి రావడం జరుగుతుంది. అలాంటిది కేసీఆర్ ఖాళీచేసిన అధికార నివాసాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కేటాయించడాన్ని మనం ఊహించగలమా? అలాంటి పరిణామాలన్నీ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి.

ప్రజలకు అందుబాటులో ఉండని అహంకారపూరితమైన పార్టీ మరియు కుటుంబం అనే అపకీర్తిని కేసీఆర్, కేటీఆర్, గులాబీదళం మూటగట్టుకున్నాయి. అదే తరహా విమర్శల అవకాశం కూడా తమ ప్రభుత్వం మీద లేకుండా రేవంత్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా కనిపిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే.. ప్రజల సమస్యలను ఆలకించే ప్రభుత్వం తమది అని నిరూపించుకుంటన్నారు.

ఇన్ని రకాలుగా విలక్షణ వ్యక్తిత్వాన్ని పరిపాలన తీరును ప్రదర్శిస్తూ ప్రస్థానం సాగిస్తున్నారు గనుకనే.. ఎనుముల రేవంత్ రెడ్డి.. 2023 సంవత్సరానికి గాను నిస్సందేహంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ రాజకీయ నాయకుడితోనూ పోల్చలేనంతగా ఈ ఏడాదిలో ఆయన తన ముద్ర చూపించారు. ఇదే తరహాలో పాలన సాగిస్తూ.. నిత్యం ప్రజారంజకంగా అడుగులువేస్తారని, ప్రజలకు మంచి చేస్తారని ఆశిద్దాం.

..ఎల్ విజయలక్ష్మి

16 Replies to “హేపీ బర్త్‌డే: ఒక యోధుడు రేవంత్ రెడ్డి!”

          1. ఔను దొర నాయకత్వంలో మా రాష్ట్రం డ్రగ్స్ తో భ్రష్టు పట్టినా పరవాలేదు, దొర బానిసలుగా బతికేస్తాం. పక్కన వాడిని కుల బానిసత్వం అని అంతగట్టేస్తాం యే మాత్రం సిగ్గు లేకుండా

    1. మరి ఉద్యమంలో కాచర గాని రోల్ కూడా అంతే కద సోనియా పట్టుదల, కోదండ రామ్ సకుల జనుల సమ్మె, విద్యార్థుల బలిదానాలు అన్ని కలిసి వచ్చాయి

  1. Independent ga contest chesina Revanth reddy ki opposite lo vunna TDP candidate ni drop chesukundi..2009 lo MLA ticket ichindi first time MLA ayyindi kuda TDP lone..Mari TDP rajakeeya jeevitham ichindi anatam lo thappemundi..Aa mata Revanth reddy ne direct ga enno sarlu cheppadu ga..Nee munda kullu antha TDP meeda kakkatam thappinchi emundi

Comments are closed.