Advertisement

Advertisement


Home > Politics - Opinion

నెత్తిమీద 'స్క్రాప్ సామాను'తో చంద్రబాబు

నెత్తిమీద 'స్క్రాప్ సామాను'తో చంద్రబాబు

అటక మీదున్న తుప్పు పట్టిన మూకుడు, మాట్లేయడానికి కూడా వీల్లేనన్ని కన్నాలు పడిన గుండిగ, మోయడానికి కష్టసాధ్యమైన ఇత్తడి గంగాళాలు ఇప్పుడు దింపుకుంటే ఏం లాభం? ఈ కాలానికి రిలవెంట్ కాని వస్తువులవి. 

అసలు ఈ మూకుడు, గుండిగ, ఇత్తడి గంగాళం అంటే ఏంటో కూడా ఈ కాలం ప్రజలు చాలామందికి తెలీదు. సరిగ్గా అలాగే ఈ కాలం వాళ్లు ఎప్పుడూ వినని కాలం చెల్లిన నాయకులే ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు చేరారంటూ వినిపిస్తున్నాయి. 

అధికార వైకాపా పక్షంలో ఎక్కడో తలదాచుకుంటున్న కొందరు ఈ సారి టికెట్ దక్కదని పక్క చూపులు చూసి తెదేపాలో చేరారు. వైకాపా నుంచి తెదేపాకి వచ్చిన నాయకులు అంటూ చంద్రబాబు మురుసిపోతూ ప్రకటనలు చేసుకుంటున్నారు.

కానీ ఆ వచ్చినవాళ్లు ఏ బాపతు?.. ఎంత వరకు పనికొస్తారు?.. వాళ్లకి టికెట్ ఇస్తే ఓట్లేసే జనం ఉన్నారా?.. అసలు వాళ్లకి జనాకర్షణ ఉందా?.. ఏ టేలెంటూ లేదనేగా జగన్ వీళ్లని పక్కన పెట్టాడు...మరి అలాంటి వాళ్లను పట్టుకుని తను ఎందుకు ఊరేగాలి?.. లాంటి ప్రశ్నలు పాపం బాబు గారు వేసుకోవట్లేదల్లే ఉంది. 

ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతున్నప్పుడు ప్రత్యర్ధి ఎటువంటి శక్తుల్ని కూడగడుతున్నాడో ముందు చూసుకోవాలి.

అక్కడ జగన్ మోహన్ రెడ్డిని చూస్తే సీనియర్ నాయకుల్ని పక్కనబెట్టి అదే కుటుంబానికి చెందిన రెండో తరం- మూడో తరం లీడర్లని ఫీల్డింగులో పెడుతున్నాడు. 

ఉదాహరణకి పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తికి ఈ సారి టికెట్ దక్కబోతోంది. ఇతను ఈ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం నాయకుడు. అలాగే సీనియర్ చెవిరెడ్డిని పక్కనబెట్టి ఈ సారి జూనియర్ చెవిరెడ్డిని రంగంలోకి దించుక్తున్నారు. ఎక్కడికక్కడ.. అయితే యువరక్తం, లేకపోతే జనంలో ఫాలోయింగ్ ఉన్న బలమైన లీడర్లు ఉంటున్నారు జగన్ వైపు. ఏ మాత్రం డౌటున్నా అస్సలు ఉపేక్షించకుండా తన ఫీల్డింగ్ ని మార్చేస్తున్నాడు. 

మరి వైకాపాని వీడి చంద్రబాబు దగ్గరకొచ్చిన బ్యాచ్ ఎవరు?

జగన్ మోహన్ రెడ్డి తమకి ఐదేళ్ళల్లో వ్యక్తిగతంగా చేసిందేమీ లేదని, మళ్లీ నెగ్గినా ఎలాగూ ఏదీ ఒనగూరదని, కనుక పార్టీ మారితే ఫలితముంటుందేమోనన్న ఆశతో వచ్చినవాళ్లే.

తమకు జగన్ పై అసంతృప్తి ఉన్నట్టుగానే ప్రజల్లో కూడా ఉంటుందని భ్రమిస్తూ... ప్రత్యర్ధి పార్టీ గెలిచే అవకాశం లేకపోలేదని లెక్కలేసుకుని వచ్చినవాళ్ళే.

వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. 

ముందుగా సి రామచంద్రయ్య. నిత్యం రాజకీయ వార్తలు చదివే వాళ్లకి కూడా అసలీయన ఇంకా రాజకీయాల్లో ఉన్నాడన్న సంగతే తెలీదు. జగన్ మోహన్ రెడ్డి ఈయనకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చాడనీ చాలామందికి తెలీదు. గత ఐదేళ్లల్లో ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నట్టు కనపడలేదు. 

తర్వాత చెప్పుకునేపేరు రాయచోటి నాయకుడు ద్వారకానందరెడ్డి. ఈయన గారు కూడా పార్టీకి చేసిందేంటో, ప్రజలకి చేసిందేంటో ఎవ్వరికీ తెలీదు. ఈయనకున్న ఏకైక గుర్తింపు విజయసాయిరెడ్డి సొంత బావమరిది అని. అంతకు మించి చెప్పుకోవడానికేమీ లేదు ఈయన గురించి. 

ఇక దాడి వీరభద్రరావు. రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ టైపు ఈయన. ఇప్పటి వరకు ఇంచుమించు అన్ని పార్టీలు మారిన నాయకుడు. ఈ సారి వైకాపా టికెట్ దొరకడం లేదని అటు ఇటు చూసి వృద్ధాశ్రమంలో చేరినట్టు తెదేపాలో చేరారు. 

వీళ్లందరూ చంద్రబాబుకి తలనొప్పే తప్ప తలమానికం కాలేరు. వీళ్లని మోయడమంటే నెత్తిమీద ఇసక బస్తా పెట్టుకున్నట్టే. 

తెదేపాలో ఇప్పటికీ పనికొచ్చే యువనాయుకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు- కింజారపు రామ మోహన్ నాయుడు. ఎర్రన్నాయుడు మరణం వల్ల ఇతను వెలుగులోకొచ్చాడు. లేకపోతే సీనియర్లను వదలని చంద్రబాబు వల్ల అసలీ యువనాయకుడు కనిపించేవాడే కాదు. అటువంటి రాం మోహన్ నాయుళ్లని కనీసం పది మందినైనా తయారు చేసుకోకపోతే పార్టీ పట్ల ప్రజల్లో ఆసక్తి ఉండదు. 

ఆ దిశగా చంద్రబాబు ఆలోచిస్తారునుకోవడం కల్ల.  ఆయనకి లోకేష్ తప్ప మరొక యువ నాయకుడు పార్టీలో కనపడకూడదు. ఎందుకంటే ఆ యువ నాయకుల్ని తన కుమారుడితో కంపేర్ చేస్తుంది లోకం. ఫోకస్ అంతా కొడుకు మీదే ఉండాలంటే ఏ యువనాయకుడైనా అండర్ ప్లే చేయాల్సిందే, అణిగిమణిగి ఉండాల్సిందే. 

రాజకీయాన్ని, పదవిని అడ్డు పెట్టుకుని వక్రమార్గాల్లో విపరీతమైన వ్యక్తిగత లబ్ధిని ఆశించే వాళ్లెవరూ జగన్ మోహన్ రెడ్డి వద్ద పని చేయలేరు. అది రఘురామరాజైనా సరే, పైన చెప్పుకున్న ఎవరైనా సరే. వాళ్లకి జగన్ వైఖరి పట్ల అసంతృప్తి సహజం. 

"సొంత లాభం కొంత మాని, పొరుగు వాడికి తోడుపడవోయ్.." అనే గురజాడ మాటని ఫాలో అయ్యేవాళ్లకి మాత్రమే జగన్ మోహన్ రెడ్డి పంచన పనిచేయడం సుఖంగా ఉంటుంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఐదేళ్లల్లో తన నియోజకవర్గంలో తాను చేసిన పనులన్నీ యూట్యూబ్ ద్వారా జనం ముందు ఉంచారు. మిగిలిన నాయకుల్లో చాలామంది అలా రికార్డ్ చేయకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో బలంగా నిలబడినవాళ్ళున్నారు. కానీ పలువురు అలా లేరు. వాళ్లకి స్థానభ్రంశమో, లేదా అసలు టికెట్టే దక్కకపోవడమో జరుగుతోంది. అలా జనాదరణ లేని నాయకుల కుటుంబసభ్యులకి కూడా టికెట్లు ఇవ్వడం లేదు. ఇన్ని లెక్కల్తో ఇంత పకడ్బందీగా జగన్ మోహన్ రెడ్డి యుద్ధరచన చేస్తుంటే చంద్రబాబు మాత్రం వైకాపా వదిలేసిన స్క్రాపుని చూసి మురిసిపోతూ అదే సగం విజయమనుకుంటూ భ్రమలో బతుకుతున్నారు. 

ఎలా చూసుకున్నా ఎన్నికల నోటిఫికేషన్ కి సమయం దగ్గర పడిన నేపథ్యంలో కూడా తెదేపా వైపు నుంచి సమరశంఖనాదాలు వినిపించడం లేదు. అసలక్కడ ఏంజరుగుతోందో కూడా తెలియట్లేదు. 

జనసేనతో పొత్తు వల్ల ఏం ప్రకటన చేయాలన్నా ధైర్యం చెయలేక సగం స్వేచ్ఛ కోల్పోయిన చంద్రబాబు తన కొడుకు తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోర్ సలహాలతో మరింత అయోమయం చెంది ఇంకొంత స్వేచ్ఛ పోగొట్టుకున్నారు. అంతా స్వయం కృతాపరాధమే. చంద్రబాబు గారి తీరు చూస్తుంటే పనికొచ్చే వ్యూహరచన ఒక్కటి కూడా కనిపించడం లేదు. తన మీద తనకి నమ్మకం లేక, పక్క వాళ్ల మీద ఆధారపడుతూ, అంతమంది అవసరాలని ఈగోలని దువ్వలేక అయోమయం చెందుతూ రకరకాలుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. చూడాలి ఫైనల్ గా తెదేపా నుంచి ఎవరు ఎక్కడ నిలబడతారో? పార్టీని ఎలా నిలబెడతారో! 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?