Advertisement

Advertisement


Home > Politics - Opinion

దారిలో ముళ్లు.. బరిలో సవాళ్లు..

దారిలో ముళ్లు.. బరిలో సవాళ్లు..

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి సింహాసనం అధిష్ఠించారు. కిరీటధారణ కూడా జరిగింది. కార్యరంగంలోకి చురుగ్గానే ఉపక్రమించారు. తన ముద్ర చూపించాలని తహతహలాడుతున్నారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. ఈ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత దక్కిన అధికారం చిరకాలం ఉండేలా.. బలమైన పునాది నిర్మించాలనే తపన ఆయనకు ఉండవచ్చు. తదనుగుణంగా పాలన సాగించాలనే తృష్ణ ఉండవచ్చు. అంది అంత సులువుగా సాధ్యమయ్యేదేనా?

ముఖ్యమంత్రిగా రేవంత్  ప్రస్థానం నల్లేరుపై బండి నడకలాగా సాగిపోయే అవకాశం ఉందా? అవునని చెప్పలేని పరిస్థితి. కేవలం కాంగ్రెసు పార్టీలో ఉండగల విభేదాలు, ముఠాలు మాత్రమే కారణం కాదు! అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం, తలకు మించుతున్న కొత్త హామీల భారం.. అన్నీ వెరసి భయం గొలుపుతున్నాయి. లక్ష్యం తెలుసు.. కానీ చేరుకోవడం ఎలాగ? గెలవవలసిన యుద్ధం మిగిలిఉన్నదని తెలుసు.. వ్యూహం ఏమిటి? ఈ వైనంపైనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి : దారిలో ముళ్లు.. బరిలో సవాళ్లు..’

తెలంగాణలో ప్రభుత్వం ఈ దఫా మారుతుందా? లేదా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా? అనే విషయంలో ఈ ఎన్నికల సమయంలో చాలా పెద్దస్థాయిలోనే బెట్టింగులు నడిచాయి. చాలా మంది కలలను, అంచనాలను తల్లకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి సారథ్యంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే వారికి పరిపాలన నల్లేరుపై బండి నడక కానే కాదు. ముఖ్యమంత్రిగా రేవంత్ ధరించినది ముళ్ల కిరీటమే. ఆయన ప్రస్థానం సాగించవలసి ఉన్నది మొత్తం ముళ్ల దారే. లోపలా బయటా ఆయన సాగించాల్సి వచ్చే యుద్ధంలో అనేక సవాళ్లు ఎదురవబోతున్నాయి.

తెలంగాణ ప్రజలలో కోటి ఆశలను నింపిన ఎన్నో వరాలను కాంగ్రెస్ ప్రకటించింది. అవన్నీ కేవలం తాము అధికారంలోకి రావడానికి చేసిన మాయ కానే కాదని.. ఆ హామీలన్నింటి అమలు కోసం తాము పనిచేస్తున్నామని వారు ప్రజలను నమ్మించాలి. ఆ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.. సర్దుకోవాలి! దెబ్బలు తగులుతాయి.. ఓర్చుకోవాలి! అంతిమంగా ప్రజల మన్నన చూరగొనాలి.

ఆర్థిక వనరులే ముళ్లదారి..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి ఒకటిరెండు అడుగులు మాత్రమే వేసింది.అప్పుడే బోలెడు భయానకమైన సంగతులు తెరమీదకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా ముందస్తు భయంతో.. 2014లో కేసీఆర్ సర్కారు గద్దె ఎక్కిన నాటినుంచి ఇవాళ్టి వరకు- ప్రభుత్వ సమస్త ఆర్థిక వ్యవహారాల  మీద శ్వేతపత్రం సిద్ధం చేయాలని అధికారుల్ని పురమాయించారు. మరికొన్ని రోజుల్లో శ్వేతపత్రం కూడా తయారవుతుంది. ఆర్థిక అవతవకలు కూడా వెలుగు చూస్తాయనే అనుకుందాం. అంతమాత్రాన ఏమవుతుంది? ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ మీద ఉండగల భారం తగ్గిపోదు కదా! అంటే కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేసిందని తేలినా తేలకపోయినా.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వీరు ప్రకటించిన అన్ని హామీలను అమలు చేసి తీరాల్సిందే. తదనుగుణంగా పెరిగే ఆర్థిక భారాన్ని మోయాల్సిందే.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలిరోజు ఒకటిరెండు నిర్ణయాలు తీసుకునే క్రమంలోనే.. విద్యుత్తు సంస్థ మీద 89 వేల కోట్ల రూపాయిల బకాయిల భారం ఉన్నదనే సంగతి బయటకు వచ్చింది. ఆయన ప్రమాణం చేసిన రెండో రోజునే విద్యుత్తు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం పెట్టుకున్నారు.

అయితే గులాబీ సర్కారు దిగిపోయిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేసిన వారిలో.. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు కూడా ఉన్నారు. విద్యుత్తు శాఖ ఎంతటి సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నదో గుర్తించిన రేవంత్ రెడ్డి ఆయన రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్ష సమావేశానికి ఆయనను కూడా ఆహ్వానించాలని పురమాయించారు. అదంతా తర్వాత.. కానీ.. ఒక్క శాఖ సంగతి బయటకు వస్తేనే.. 89వేల కోట్ల రూపాయల అప్పులు తేలాయి. ఇంకా ఎన్ని శాఖల పరంగా ప్రభుత్వం ఎంతటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నదో ఇప్పుడే తేల్చిచెప్పడం కూడా కష్టం.

తెలంగాణ సర్కారు దేశంలోనే అత్యంత లాభాల్లో సాగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా వనరుల పరంగా గుర్తింపు ఉన్నప్పటికీ.. గులాబీ సర్కారు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ పోయింది. అవన్నీ ఎంత మేర కొండలా, కొత్తప్రభుత్వానికి గుదిబండలా మారి ఉన్నాయో సావధానంగా లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది.

అదే సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన హామీల వలన పడే అదనపు భారాన్ని కూడా లెక్కతీయాల్సి ఉంది. మొదటిరోజు కేబినెట్ భేటీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.పదిలక్షలకు పెంపు లను ఆమోదించారు. ఆరోగ్య శ్రీ విషయంలో ఖచ్చితంగా  ఇంత భారం పెరుగుతుందని చెప్పడం కష్టం. కానీ మహిళలకు ఉచిత ప్రయాణం విషయం అలా కాదు. 9వ తేదీనుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్థానిక  మహిళకు బస్సు ప్రయాణం ఉచితం కానుంది. 

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెబుతున్న వివరాల ప్రకారం.. రోజుకు సంస్థ ఆదాయం 14 కోట్లు కాగా, ఈ ఉచిత హామీతో 50 శాతం తగ్గే అవకాశం ఉంది. అంటే.. ఏడాదికి సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఆర్టీసీ మీద పడుతుంది. దీనిని ప్రభుత్వం ఆర్టీసికి చెల్లించేలాగా ఒప్పందం చేసుకున్నారు. ఒకటో రోజు ఒక నిర్ణయానికే రెండున్నర వేల కోట్ల రూపాయల భారం అంటే.. ముందుముందు ఆరు గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ ప్రకటించిన మిగిలిన హామీలన్నీ అమలు చేయాలంటే.. వేల కోట్ల రూపాయల అవసరం ఏర్పడుతుంది. దానికి అవసరమైన నిధులను ఎలా సమీకరిస్తారనేదే ప్రశ్న. 

బరిలో సవాళ్లు..

రాజకీయంగా ఇతర పార్టీలతో పోటీపడుతూ పార్టీని నెగ్గుకు రావడం అనేది మరో కీలకమైన సవాలు. అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయం- కనీసం అసెంబ్లీకి సంబంధించినంత వరకు కూడా అంతిమ విజయం అని అనుకోవడానికి వీల్లేదు. ఏ క్షణానైనా సరే ప్రభుత్వాన్ని కులదోయడానికి విపక్షాలు సిద్ధంగా ఉంటాయనే సంగతి ఆయన సదా గుర్తుంచుకోవాలి. 

ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి మించి మన గలిగేది లేదని భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అవసరమైన మెజారిటీ కంటే ఐదు స్థానాలు ఎక్కువగా కలిగి ఉన్న పార్టీ ఏడాదిలోగా ప్రభుత్వం నుంచి కూలిపోవడం అనేది ఎలా జరుగుతుంది? ఒక ప్రత్యేకమైన కుట్ర జరిగితే తప్ప అనే సందేహాలు అప్పుడే ప్రజలలో పుట్టాయి. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా.. బిజెపి మదిలో ఇప్పటికే ఏదో ఒక కుట్ర పురుడు పోసుకోకుండా ఉన్నట్లయితే.. రాజాసింగ్ నోటమ్మట ఆ మాట వచ్చేది కాదని పలువురు అంచనా వేస్తున్నారు.

ఏ చిన్న అవకాశం దొరికినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అటు భారతీయ జనతా పార్టీ, ఇటు గులాబీ దళం కాల్చుకొని ఉన్నాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి చేసే విద్యలో ఈ రెండు పార్టీలు కూడా ఆరితేరినటువంటివి! 2018 ఎన్నికలు ముగిసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయించి.. తనతో కలిపేసుకున్న కేసీఆర్- అక్కడితో కాంగ్రెసు పార్టీ అస్తిత్వాన్ని తెలంగాణలో తాను చెరిపేయగలనని భ్రమపడ్డారు! కానీ అంచనాలు తప్పు అని ఇప్పుడు తేలింది. 

భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను ఆస్థిరపరచడంలో కూలదోసేక్రమంలో సిద్ధాంతాలకు విరుద్ధమైన పొత్తులకు దిగజారుతుంటుందనే సంగతి అందరికీ తెలుసు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే నినాదంతో, కాషాయదేశాన్ని ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యం అంటూ దేశ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి కుట్రరాజకీయాలు చేయడం బిజెపికి కొత్త కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసే అవకాశం వస్తే- గులాబీ దళం పల్లకీ మోయడానికి కూడా బిజెపి నాయకులు వెనుకాడరు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల యుద్ధం అనేది కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇప్పటికైనా ముగిసిపోయినట్లు కాదు! ఈ ఐదేళ్లపాటు యుద్ధం సాగుతూనే ఉంటుందని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అందుకే ఆ యుద్ధానికి నిర్దేశించిన బరిలో ఆయనకు నిత్యం సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి అనే సంగతి స్మరణలో ఉంచుకోవాలి.

మరో నాలుగు నెలల్లో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక లిట్మస్ టెస్ట్ లాంటివి మాత్రమే. అసెంబ్లీలో దక్కిన మెజారిటీని పార్లమెంటు ఎన్నికలలో కూడా తమ పార్టీకి అనుకూలంగా నిరూపించడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఎంతగా కష్టపడుతుందో.. అదే కష్టాన్ని వారు ఐదేళ్లపాటు కచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. 

పార్టీలో అంతర్గత సవాళ్లు..

‘బరి’ అంటే కేవలం బయటి రాజకీయాలతో తలపడేది మాత్రమే కాదు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సవాళ్లను కూడా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ పోవాలి. రేవంత్ ను ముఖ్యమంత్రి చేసే విషయంలో ఈ సారి అధిష్ఠానం చాలా దృఢంగా వ్యవహరించినట్టే లెక్క. ఎందుకంటే.. పార్టీలో సీనియర్లు అయిన నాయకులు కొందరు తమకే ముఖ్యమంత్రి పీఠం కావాలని గట్టిగానే పట్టుపట్టినప్పటికీ.. అధిష్ఠానం వద్ద మాట చెల్లుబాటు చేసుకోగలిగిన సీనియర్లు.. రేవంత్ పేరును తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. అధిష్ఠానం మాత్రం అస్సలు పట్టించుకోలేదు. అలాగని పెత్తందారీ పోకడలతో వ్యవహరించకుండా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలను ఢిల్లీ పిలిపించి సుదీర్ఘమంతనాలతో వారిని బుజ్జగించారు. రేవంత్ రెడ్డి గద్దె ఎక్కడ ఆ రకంగా, సాఫీగా సాగిపోయింది.

కానీ.. పార్టీలోనే అంతర్గతంగా ఉండే అసంతృప్తులు అయిదేళ్లపాటు రేవంత్ రెడ్డిని కుదురుగా పనిచేసుకోనిస్తాయా? అనే సందేహం కూడా పలువురిలో ఉంది. కాస్తంత ప్రజాబలం ఉన్న ప్రతి నాయకుడూ తాను ముఖ్యమంత్రి పదవికి తగిన వాడిగా అనుకుంటూ ఉండడంతోనే అసలు సమస్య ఉంది. దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. మీడియా వంకర ప్రశ్నలను తప్పించుకోవడానికి తమ పార్టీలో గెలిచిన 64 మంది కూడా సీఎం అభ్యర్థులే అని అని ఉండొచ్చు గానీ.. నిజానికి అది అబద్ధం కూడా కాదు. అంతలా ఆ పార్టీ వ్యవహారాలు ఉంటాయి. 

పదవి మీద ఆశ ఉండే వారు కూడా వెన్నుపోటు పొడవడానికి కూడా సాహసించకుండా ఉండాలంటే.. రేవంత్ ముందున్న మార్గం ఒక్కటే. వారి ఊహకు కూడా అందని విధంగా, రేవంత్ ను మరిపించేలా పనిచేయగలమని అధిష్ఠానం వద్ద చెప్పుకోడానికి కూడా సాహసించకుండా ఉండేలా ఆయన పనిచేయాలి. 

పట్టుదల, కఠోర శ్రమ, నిజాయితీ మేళవింపుగా..

రేవంత్ రెడ్డి సమర్థ సీఎంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే.. దారి పొడవునా ఉన్న ముళ్లను తొక్కుకుంటూ ముందుకు సాగిపోవాలంటే.. ఈ మూడు గుణాల మేళవింపుగా ఆయన తనను తాను తీర్చిదిద్దుకోవాలి. పార్టీ తరఫున తెలంగాణ పౌర సమాజానికి చిత్తుశుద్ధితోనే మంచి హామీలను ఇచ్చారు. కేసీఆర్ తన ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ హామీలను ఎంతగా వెటకారం చేసినా, కాంగ్రెస్ పట్ల ఎలాంటి భయాలను పుట్టించాలని ప్రయత్నం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. అయితే పైన చెప్పుకున్న ముళ్లను తొక్కుకుంటూ సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగాలి. అందుకు చాలా పట్టుదల అవసరం. దానిని ఆయన ప్రోది చేసుకోవాలి.

రేవంత్ రెడ్డి సహజంగానే కఠోర శ్రమకు వెరవని వ్యక్తి. తాను పీసీసీ సారథ్యం చేపట్టిన నాటినుంచి ఆ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో చాలా స్పష్టంగా నిరూపించారు కూడా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తానొక్కడే దిక్కు అయినట్టుగా ఆయన రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు నిర్వహించి ప్రచారం సాగించారు. అప్పటి కష్టాన్ని ఈ అయిదేళ్లపాటు కొనసాగించాల్సిందే. ఇప్పటికే ప్రజాదర్బార్ వంటి ప్రకటించి, ప్రారంభించడం ద్వారా.. రేవంత్ గొప్ప అడుగు వేశారు. 

ప్రజాభవన్ లో జరిగే ఈ ప్రజాదర్బార్ లో ప్రతిరోజూ ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే విధిగా ఉండేలా కార్యచరణ రూపొందించాలని ఆయన అధికారుల్ని ఆదేశించడం.. ప్రత్యేకించి.. ప్రజాదర్బార్ వినతుల పరిశీలన పరిష్కారం కోసం ఒక సీనియర్ అధికారిని నియమించడం ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. తాను కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇవ్వడం మాత్రమే కాదు. తన టీమ్ మొత్తం కష్టపడి పనిచేయాల్సిందే అని చాటిచెపుతున్న తీరుకు ఇది నిదర్శనం. కాబట్టి కఠోర పరిశ్రమ విషయంలో కూడా రేవంత్ సర్కార్ పాసవుతుందనే అనుకోవచ్చు.

ఇక నిజాయితీ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వాల దందాల మీద అనేక ఆరోపణలున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం విషయంలో కూడా వారు చేసిన కుటుంబ అవినీతి గురించి ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ గద్దె ఎక్కింది. అలాంటప్పుడు వారు నిజాయతీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయిదేళ్లలో ఒక్క మచ్చ కూడా పడకుండా పనిచేయగలిగితే.. ఇక వారికి తిరుగుండదు.

నిరుద్యోగుల కలలను నెరవేర్చడం, ఉద్యోగాల కల్పన వంటివి కూడా రేవంత్ ప్రభుత్వం సక్రమంగా నిలబడాలంటే చాలా కీలకం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటూ.. వారు పాలనలో ముందుకు పోవాలి.

..ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?