Advertisement

Advertisement


Home > Politics - Opinion

అసలీ స్కీములు రేవంత్ రెడ్డి ఇవ్వగలడా?

అసలీ స్కీములు రేవంత్ రెడ్డి ఇవ్వగలడా?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతా బాగానే ఉంది.

అయితే కొత్త ముఖ్యమంత్రికి పరిపాలన కేక్ వాక్ మాత్రం కాదని అర్ధమౌతోంది. 

చేసిన మొక్కులు తీర్చకపోతే దేవుళ్లకి కోపమొస్తుందో లేదో తెలీదు కానీ, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోక పోతే ప్రజలు మాత్రం కచ్చితంగా ఆగ్రహిస్తారు. 

అయినా కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు అన్నీ ఇన్నీ కావు. కర్నాటక మేనిస్ఫెస్టోని తెలుగులోకి తర్జుమా చేసి వదిలారు. ఆ ప్రామిస్సులని నిలబెట్టుకోవాలంటే కావాల్సిన రొక్కం 68,000 కోట్ల పైచిలుకని ఒక అంచనా. 

ఇది ఆల్రెడీ సాగుతున్న సంక్షేమ పథకాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసిన పథకాలని అమలుపరచడానికి మాత్రమే ఖర్చయ్యే మొత్తమన్నమాట ఇది. 

ఆ వాగ్దానాల్లో బెదరగొట్టేవి ముఖ్యంగా ఆరున్నాయి. 

- రైతులకి రూ 2 లక్షల రుణ మాఫీ. దీనికయ్యే ఖర్చు దాదాపు 20,000 కోట్ల రూపాయలు. 

- ఇంటింటికీ 200 యూనట్ల వరకు ప్రతి నెలా ఉచిత కరెంటు. దీని భారం ఏడాదికి రూ. 2500 కోట్లు

- రూ 500 లకే గ్యాస్ సిలిండరు. దీని బరువు ఏడాదికి రూ 3200 కోట్లు

- ఇందిరమ్మ ఇళ్లకి రూ 5 లక్షలు- ఈ పథకం విలువ దాదాపు రూ 9000 కోట్లు

- దళిత బంధు ఏడాదికి కి 40,000 కోట్లు

- మహలక్ష్మి స్కీములో ప్రతి మహిళకి నెలకి రూ 2500 - దీని ఖర్చు ఏడాదికి దాదాపు 25000 కోట్లు. 

ఇంతేసి డబ్బు ఎక్కడినుంచి తేవాలి? ఆదాయం చూస్తే లక్షన్నర కోట్లు ఉందని ఒక లెక్క. పై స్కీముల ప్రమేయం లేకుండానే 2024-25 వార్షిక బడ్జెట్టే దాదాపు 3 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. దానికి అదనంగా ఈ 68వేల కోట్ల ఖర్చు కలిపితే ఏకంగా 3.7 లక్షల కోట్ల మొత్తం కావాలి, ఒక ఏడాది షో నడపడానికి. 

అంటే లక్షన్నర కోట్లు ప్రతి ఏడాది ఎక్కడి నుంచి తేవాలి? 

దీనికి తోడు ఇప్పటికే అధికంగా రుణాలు తీసుకోవడం వల్ల తదుపరి రుణాలు తీసుకునే సామర్ధ్యం తెలంగాణా ప్రభుత్వానికి పరిమితమయిపోయిందని తెలుస్తోంది. 

పోనీ ఏదో ఒకలాగ కేంద్రం నుంచి ఏదైనా సహాయం అందుతుందా అంటే...కేంద్రంలో  బీజేపీ ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగ్గానే ఇచ్చే ప్రసక్తి ఉండదు కదా! 

నాంచి నాంచి, గీకి గీకి అడిగిన ఎన్నాళ్లకో కొంత ఇవ్వచ్చు లేదా అసలే ఇవ్వకపోవచ్చు. 

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి దారేది? 

హైద్రాబాదులో వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని భారీ రేట్లకి వేలమేసి అమ్మడమొక్కటే దారిగా ఉంది. 

గత ప్రభుత్వం కూడా చేసింది ఇదే పని. 

ఆల్రెడీ రాచకొండ వైపు దృష్టి పెడతానని చెప్పారు రేవంత్ రెడ్డి. అంటే పశ్చిమ హైద్రాబాదైన గచ్చిబౌలి వైపు కాకుండా తూర్పు వైపు రియల్ బూం తెచ్చి దాని మీద నెట్టుకొస్తారేమో చూడాలి. 

అలా హైప్ తీసుకురావడం, భారీ పెట్టువడులు తేవడం, ఇంకా భారీ రేట్లకి వేలమేయడం...ఇవన్నీ అనుకున్నంత తేలికైతే కాదు. కానీ ఆదాయమార్గాన్ని వెంటనే పెంచుకోలేనప్పుడు, ఖర్చులు మీద పడుతున్నప్పుడు ఆస్తుల్ని అమ్ముకోవడమొక్కటే దిక్కు మనిషికైనా, రాష్ట్రానికైనా. అదే తంతు జరిగేలా ఉంది తెలంగాణాలో. 

ఇంతకీ కర్నాటకలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నరా? అక్కడి చాలెంజే ఇక్కడ కూడా ఉంటుంది కదా!

అక్కడ ప్రామిస్ చేసిన స్ఖీములు ఇవ్వలేక రొప్పుతూ ఆయాసపడుతోంది కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక నెల కొందరికి ఇచ్చి, మరొక నెల మిగిలినవారిలో కొందరికిచ్చి...ఆ పై నెల మరి కొందరికిచ్చి..ఇలా సాగుతోంది. 

అంటే ఎవ్వరికీ పూర్తిగా ఇవ్వట్లేదు. అలాగని ఇవ్వకుండానూ ఉండత్లేదు. 

అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, ఇస్తానని మాటిచ్చి ఇవ్వకపోయినా, లేక సగమే ఇచ్చినా ప్రజలు సంతోషంగా ఉండరు. ప్రభుత్వ వ్యతిరేకతని విపరీతంగా పెంచుకుంటారు. 

దానికి తోడు కర్నాటకలో ప్రస్తుతం చిన్న రోడ్డు రిపేరుకు కూడా ఖజానాలో డబ్బులుండడంలేదట. దేశంలోనే ఎక్కడా లేనన్ని విడ్డూరమైన భారీ స్కీములు పెట్టుకుని ఆ భారాన్ని మోయలేక చతికిలబడుతోంది అక్కడి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అనే పశ్చాత్తాపం కూడా ప్రజల్లో కలుగుతోందట. 

ఇక కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉండి భయంకరమైన పరిణామాన్ని రుచి చూపించే పథకం "ఫ్రీ కరెంటు". ఇది ఎంత గణనీయమైన భారమో అనుభవిస్తేతప్ప తెలీదు. దీనిని నిలబెట్టుకోవాలంటే ముందుగా నగారాల్లో ఇచ్చే కరెంటుకి కోత విధించి గ్రామాల్లో పంచాలి. దానికి తోడు అదనంగా ఉత్పత్తి చెయ్యాలి. లేదా పక్క రాష్ట్రాల నుంచి కొనగలగాలి. దానికి మళ్లీ డబ్బు కావాలి. 

గత పదేళ్లుగా అసలు కరెంటు కోత అంటే ఏంటో తెలియని ప్రజానీకానికి ఆ రుచి చూపిస్తే తిరుగుబాటు మామూలుగా ఉండదు. కనుక కోతలు విధించకుండా ప్రామిస్ చేసిన మేరకు ఉచితంగా కరెంటు అందించే పనే పెట్టుకోవాలి. 

అసలే ఆదాయం సరిపోవట్లేదంటే ఇలాంటి భారాలు ఎలా ఉంటాయో ఊహించండి. 

ఏది ఏమైనా రేవంత్ రెడ్డి నాయకుడిగా నిరూపించుకున్నాడు. పోరాట యోధుడిగా గెలుపొందాడు.  "ఎప్పుడొచ్చామన్నది కాదు..బులెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్" అన్నట్టుగా ఇలా వచ్చి అలా సీయం అయిపోయాడు. ఇక పరిపాలనా దక్షత విషయంలో నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. 

ఇన్ని చాలెంజుల మధ్యన... పార్టీలో సీనియర్ల నుంచి అసమ్మతి రాకుండా జాగ్రత్తపడుతూ, 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున ఏ బీజేపీయో రాజకీయాస్త్రం ప్రయోగించి ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి వస్తే దానిని ఎదుర్కొంటూ, ప్రజలకి వాగ్దానాలు నెరవేర్చి సుస్థిర పాలన అందజేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. 

ఇన్ని ప్రమాదాల మధ్య రేవంత్ రెడ్డి అభిమణ్యుడౌతాడా? లేక అర్జునుడిలా గెలుస్తాడా? అనేది కాలమే చెప్పాలి. 

ఒకవేళ గెలిస్తే మాత్రం తెలంగాణా రాష్ట్రానికి మరొక వై.ఎస్.ఆర్ వచ్చినట్టే అనుకోవాలి. ముఖ్యమంత్రిగా తన హీరోయిజాన్ని నిలబెట్టుకుని చరిత్రలో నిలవడానికి రేవంత్ రెడ్డి ఏ మార్గాల్ని అవలంబిస్తారో చూడాలి. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?