Advertisement

Advertisement


Home > Politics - Opinion

నిరాశ నిస్పృహల్లో టీడీపీ

నిరాశ నిస్పృహల్లో టీడీపీ

తెలుగు దేశం పార్టీకి మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ ఎన్నికల్లో తమదే విజయమని కలలుకంటూ కాలక్షేపం చేయడం తప్ప మరొక దారి లేనట్టుగా కనిపిస్తోంది. 

అటు లోకేష్ పాదయాత్ర, ఇటు చంద్రబాబు ప్రసంగాలతో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో చంద్రబాబు అకస్మాత్తుగా అరెష్టవగానే టీడీపీలోని డొల్లతనమంతా బయటపడింది. 

సరైన అవకాశం వచ్చినా లోకేష్ తన నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయాడు. అతనిలోని సామర్ధ్యలోపం చంద్రబాబుకి కూడా అర్ధమయ్యుండాలి. ఇప్పటికీ అర్ధం కాకపోతే మితిమీరిన పుత్రప్రేమ అతని మెదడుని కప్పేసిందని అనుకోవాలి. పార్టీ కేడర్లోకి, జనాల్లోకి చంద్రబాబు తర్వాత తెదేపాని నడపడం లోకేష్ వల్ల సాధ్యం కాదని తేటతెల్లమైపోయింది. 

అదలా ఉంటే చంద్రబాబు అరెష్టైనప్పుడు కనీసం చిడతలు వాయించడమో, పళ్లేల మీద కొట్టడమో, కొవ్వుత్తులు పట్టుకుని తిరగడమో ఇలా ఎదో ఒక నిరసన కార్యక్రమం నిత్యం ఉండేది. నారా భువనేశ్వరి స్పీచులు, సభలతో కాస్త పచ్చజెండాల రెపరెప కనబడేది. అటు కవరింగులు, ఇటు ట్రోలింగులు ఉండేవి.

చంద్రబాబు జైల్లో ఉన్నాడని మనస్థాపానికి గురయ్యి 90 మంది ప్రజలు చనిపోయారని లెక్క తేల్చారు తెదేపావారు. వారందరికీ 3 లక్షల రూపాయల సొమ్ముని ఓదార్పులో భాగంగా ఇస్తామని ప్రకటించారు భువనేశ్వరి. కానీ మూగ్గురికో నలుగురికో ఇచ్చి చంద్రబాబు విడుదలవ్వగానే ఆ కార్యక్రమం ఆపేశారు. బహుశా బాబు విడుదలయ్యాడని చనిపోయిన మిగిలిన 87 మంది బతికి లేచి కూర్చుని ఉంటారని భువనేశ్వరి గారు అనుకున్నారేమో! 

ఇంతకీ బాబు జైల్లో ఉన్నప్పుడే కాస్త తెదేపా చప్పుడు వినపడేది. ఇప్పుడాయన బయటికొచ్చాక అంతా మూకీ సినిమా చూస్తున్నట్టుగా ఉంది. బయటికొచ్చి సభలు అవీ పెట్టకూడదని కోర్టు చంద్రబాబుకి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇక బయటికొచ్చి ఉపయోగమేముంది? ఉన్న కుటుంబసభ్యుల్లో ఒక్కరూ సరిగా మాట్లాడలేరు. పోనీ ఏ రామమోహన్ నాయుడుకో ప్రచారం బాధ్యత అప్పజెప్పొచ్చు కదా అంటే అది చంద్రబాబుకి ఇష్టం ఉండదు. అతని ప్రసంగాలు వింటే తన కుటుంబాన్ని, కొడుకుని జనం కరివేపాకులా తీసి పారేస్తారని భయం అయ్యుండొచ్చు. అందుకే తమకన్నా మెరుగైన వాళ్లని పూర్తిగా ఎదగనీయకుండా కాళ్ళదగ్గర కట్టప్పల్లాగ ఉంచుకుంటారంతే నారావారు!

అసలిప్పుడు పచ్చమీడియాకి తెదేపా పరంగా ఏదైనా హడావిడి చూపించాలనుకున్నా యాక్టివిటీ లేకుండా ఉంది. అసలు బాబు జైల్లో ఉంటేనే నయమనుకుంటున్నాయి ఆ ఛానల్స్. అందుకే ఈ నవంబర్ 28న గడువు ముగిసిన వెంటనే చంద్రబాబు ఏ సాకూ చెప్పకుండా లొంగిపోయి మళ్లీ జైల్లో కూర్చుంటే బాగుండునని అనుకుంటున్నారు ఆయా ఛానల్స్ వారు. జైల్లో ఉన్న బాబుకోసం మరి కొందరు గుండాగి పోయే అవకాశముంటుంది. దాంతో వాళ్లకి డబ్బిచ్చే సన్నివేశాలు చిత్రీకరించొచ్చు. ఇదంతా ప్రచారమే కదా! 

ఒకపక్క పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే చంద్రబాబు పొత్తులు, ఎత్తులు మరింత దిగజారుడుగా ఉన్నాయి. సప్తసముద్రాలు దాటి మురికి గుంటలో పడినట్టు 45ఏళ్ల రాజకీయ జీవితం గడిపి ఆఖరికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేనతో పొత్తేంటో! అసలా పొత్తుతో ఏదో జరిగిపోతుందని ఒక్క పచ్చమీడియాలోనూ, ఆ ఛానల్స్ కి బానిసలైన కొందరు ప్రజలు తప్ప...తక్కిన అశేషజనవాహినిలో ఎవ్వరూ అనుకోవడం లేదు. ఇది వాస్తవమని చెప్పినా చెవుల్లో పచ్చ సీసం పోసుకున్న తెదేపా తీవ్రవాదులకి వినపడదు. 

పవన్ కళ్యాణ్ కంటే కే.ఏ పాల్ ఎన్నో రెట్లు నయమంటున్న జనం ఉన్నారు. ఎందుకంటే అతనే రాజకీయాల పట్ల ఫోకస్డ్ గా కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ కంటే. 

అన్నట్టు జనసేన-తెదేపా మీటింగ్ అంటూ ఒక ఫోటో బయటికొచ్చింది. ఆ గదిలో ఏదో అమెరికా-రష్యా మధ్యలో అణు ఒప్పందం మీద సంతకాల సీను లాగ టేబుల్ కి అటు ముగ్గురు, ఇటు ముగ్గురు కూర్చున్నారు. అయితే వారిలో తెదేపా పక్షాన కూర్చున వారిలో పట్టాభి, యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు ఉన్నారు. వీరిలో యనమలని పక్కనపెడితే మిగిలిన ఇద్దరూ ఏ పాటి నాయకులో జనానికి తెలుసు. ఇక జనసేన వైపు కూర్చున్నవారిలో ఒక్కరి పేరు కూడా తెలీదు. రోజూ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్లకే తెలీడం లేదంటే ఇక జనం సంగతి చెప్పక్కర్లేదు. ఈ విషయం ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగులు కూడా అవుతున్నాయి. 

మరోపక్క.. ముసుగులో గుద్దులాటలాగ రేవంత్ రెడ్డితో చంద్రబాబు మంతనాలు. ఇంకో వైపు ఆంధ్రలో బీజీపీతో పొత్తుకోసం వంపర్లాడడం.. అలాగే కమ్యూనిష్టులకి కన్నుకొట్టి వారితో స్నేహం. 

తెలంగాణాలో అయితే తెదేపా జెండాలు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపిస్తాయో అర్ధం కావడం లేదు. కోదాడలో కాంగ్రెస్ ఊరిగేంపులో కనిపించాయి. ఇది చంద్రబాబుకి రేవంత్ పై ప్రేమకు నిదర్శనం కావొచ్చు. 

మరో జిల్లాలో బీ.ఆర్.ఎస్ ఊరేగింపుల్లో కనిపిస్తున్నాయి తెదేపా జెండాలు. బహుశా ఇవి కేటీఆర్ తాజాగా చంద్రబాబు, లోకేష్ ల పై సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞత కావొచ్చు. 

మరీ విడ్డూరంగా భాజపా కమలం జెండాల మధ్యన కూడా తెదేపా జెండాలు మోస్తున్న వాళ్లు కనిపిస్తున్నారు. ఇదైతే ఆంధ్రలో పొత్తు కోసం కేంద్ర భాజపాని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం కావొచ్చు.

ఇలా ఒక అడ్రస్సంటూ లేకుండా ఏ గుంపులో పడితే ఆ గుంపులో పసుపు జెండాలు మోసుకు తిరుగుతోంది తెదేపా.  

ఇంత దుస్థితా?!! ఇంతటి దయనీయ పరిస్థితా? 

తాజాగా మేనిఫెష్టోలో భాగంగా "తల్లికి వందనం" అనే స్కీము ప్రకటించారు తెదేపా వారు. ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ 15,000 చొప్పున విద్యాభ్యాసం కోసం ఇస్తారట. ఇది వైకాపా వారి "అమ్మ ఒడి"కి కాపీ అని ప్రత్యేకం చెప్పక్కర్లేదు. ఒక్క వైకాపా స్కీమనే కాదు, తెదాపా ఏ స్కీము పెట్టినా అది ప్రస్తుత కేంద్ర భాజపా స్కీమో, లేదా గతంలో కాంగ్రెస్ స్కీమో, లేదా ఏ ఇతర రాష్ట్రంలోనో చలామణీలో ఉన్న స్కీమో అయ్యుంటుంది తప్ప చంద్రబాబు బుర్రలో పుట్టేది ఒక్కటీ ఉండదు. 

పోనీ ప్రకటించిన స్కీముల్ని అమలుపరుస్తాడా అంటే నూటికి నూరు శాతం అమలుపరచని ఏకైక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే. ట్రస్ట్ చేయడానికి ఏమాత్రం అర్హత లేని విధంగా తన ట్రాక్ రికార్డుని పెట్టుకున్నాడు. కానీ యెల్లో మీడియా మాత్రం అతని అసలు రూపాన్ని దాచి పెద్ద అభివృద్ధిసారధిగా, సంస్కరణవాదిగా చూపిస్తుంది. 

చంద్రబాబుకి సొంత ఆలోచన అంటూ ఉండదు. ఊళ్లో వాళ్ల ఆలోచనలన్నీ తన మెదడులో పుట్టిన ఆలోచనలుగా ప్రచారం చేసుకుంటూ, చేయించుకుంటూ బతికేసిన "గోబెల్స్ ప్రచారానికి మానవరూపం" చంద్రబాబు. హైటెక్ సిటీ అయినా, అంతర్జాతీయ విమానాశ్రయమైనా, మెట్రో రెయిలైనా ..ఇలా ఏదైనా సరే..ఏదీ చంద్రబాబు విజన్ కానే కాదు. అవన్నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఆలోచనలని ఏకంగా రేవంత్ రెడ్డే మొన్నీమధ్యన చెప్పాడు. 

భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడే చంద్రబాబు వైకాపా స్కీములకే పేర్లు మార్చి పెడతాడు తప్ప సొంతంగా ఏం పెట్టగలడు?

ఇదిలా ఉంటే.. "ఉన్న ఇల్లు తగలబడుతుంటే పక్కింటి గోడకి సున్నాలేయడానికి వెళ్లినట్టు..." చంద్రబాబుకి ఆంధ్రలో రాజకీయ చితి అంటుకుంటే తెలంగాణాలో కాంగ్రెస్ రావాలని కలలుకనడం, అందులో భాగంగా రేవంత్ రెడ్డితో మంతనాలు..ఇవన్నీ కామెడీగా ఉంటున్నాయి. 

ఏతావాతా చెప్పేదేంటంటే తెలుగుదేశం ప్రస్తుతం నిరాశ నిస్పృహల్లో ఉంది. ఆ నాయకుల మొహాల్లో కాంతి లేదు. అసలు చాలామంది తెదేపా నాయకులు మొహం చాటేసి కనపడడంలేదు కూడా. 

ఈ 2024 ఎన్నికల్లో బతికి బట్టకట్టకపోతే ఇక తెదేపాని చరిత్రలో మూటకట్టి అటకమీద పారేయడమే అన్నట్టుంది. అంటే ఇదే ఆఖరి ఛాన్స్. ఎన్నికలు ఇంకా మూడు-నాలుగు నెలల్లోకి వచ్చేసాయి. ఏం చేస్తారో చూడాలి!

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?