Advertisement

Advertisement


Home > Politics - Political News

స్ప‌ష్ట‌మైన సందేశ‌మిచ్చిన బీజేపీ హైక‌మాండ్!

స్ప‌ష్ట‌మైన సందేశ‌మిచ్చిన బీజేపీ హైక‌మాండ్!

బుజ్జ‌గింపులు ఉండ‌వు, ఎవ‌రినీ బ‌తిమాలేది ఉండ‌దు.. ఎవ‌రు స‌మ్మ‌తితో ఉన్నా, మ‌రెవ‌రు అస‌మ్మ‌తితో ఉన్నా.. ప్ర‌భుత్వం అయితే ప‌డిపోదు... ఈ ధీమాతో ఉన్న‌ట్టుగా ఉంది భార‌తీయ జ‌న‌తా పార్టీ హై క‌మాండ్. క‌ర్ణాట‌క మంత్రివ‌ర్గ కూర్పును గ‌మ‌నించాకా.. ఈ అంశం పై స్ప‌ష్ట‌త వ‌స్తోంది.  

మాస్ లీడ‌ర్ య‌డియూర‌ప్ప‌ను అర్ధాంత‌రంగా సాగ‌నంపిన బీజేపీ హైక‌మాండ్ ఇప్పుడు పూర్తిగా త‌మ చేతిలోని మ‌నిషిని ముఖ్య‌మంత్రిగా నియ‌మించింది. త‌మ ఆదేశాల‌ను పాటిస్తున్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇస్తూ, మీడియా ముందు మాత్రం అధిష్టానం పై వీర‌విధేయ‌త‌ను క‌న‌బ‌రుస్తూ, లోప‌ల మాత్రం త‌ను చేసేది చేస్తూ వ‌చ్చిన య‌డియూరప్ప విష‌యంలో బీజేపీ హైక‌మాండ్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది.

త‌న‌కు కులంపై ప‌ట్టుంది, రాజ‌కీయ చాణక్య‌ముంద‌నుకున్న య‌డియూర‌ప్ప‌కు గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఇక కొత్త ప్ర‌భుత్వం విష‌యంలో కూడా క‌మ‌లం పార్టీ హైక‌మాండ్ క‌ఠినంగానే ఉన్న‌ట్టుగా ఆదిలోనే సంకేతాల‌ను ఇచ్చింది. బొమ్మై కేబినెట్లో ఒక్క ఉప ముఖ్య‌మంత్రి కూడా లేడు! అదే పెద్ద విశేషం. 

య‌డియూర‌ప్ప‌కే అంత‌మందిని ఉప ముఖ్య‌మంత్రుల‌ను పెట్టిన బీజేపీ హైక‌మాండ్ బొమ్మై కేబినెట్లో మాత్రం ఒక్క‌రికీ అలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. త‌ద్వారా.. ఎవ‌రినీ బుజ్జ‌గించ‌బోమ‌ని స్ప‌ష్ట‌మైన సందేశాన్ని ఇచ్చింది. ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల‌న్నీ బుజ్జ‌గింపుల‌కే వాడుకున్నారు గ‌తంలో. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి బుజ్జ‌గింపులు లేవు.

కుల స‌మీక‌ర‌ణాల‌ను మాత్ర‌మే పాటించింది. లింగాయ‌త్ ల‌కూ, వ‌క్క‌లిగ‌ల‌కు ముఖ్య‌ప్రాధాన్య‌త‌ను ఇచ్చింది. ఇత‌ర కుల‌స్తుల‌కు వారి వారి జ‌నాభాను బ‌ట్టి కాకుండా త‌క్కువ ప్రాధాన్య‌త‌ను ఇచ్చింది. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు స్వల్ప‌మైన ప్రాధాన్య‌త‌నే ఇచ్చింది.

ఇక య‌డియూర‌ప్ప త‌న‌యుల్లో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి అనే ప్ర‌చారం కూడా నిజం కాలేదు. త‌ద్వారా పాల‌న‌లో య‌డియూర‌ప్ప జోక్యం ఉండ‌ద‌నే సందేశాన్ని ఇచ్చింది. య‌డియూర‌ప్ప‌ను ఏ మాత్రం బుజ్జిగించేది ఉండ‌ద‌ని కూడా క్లారిటీ ఇచ్చింది. 

కొత్త మంత్రివ‌ర్గ కూర్పు ద్వారా బీజేపీ ఏ సందేశం ఇచ్చినా, దీనికి రెండు మీనింగులు బ‌య‌ట‌కు స్ప‌ష్టం అవుతున్నాయి. ఒక‌టి.. రాష్ట్ర నాయ‌క‌త్వాల‌కు ఇక ప్రాధాన్య‌త ఉండ‌దు. మోడీని చూసి మాత్ర‌మే ప్ర‌జ‌లు ఓటేస్తున్నారు, కాబ‌ట్టి.. ఇక య‌డియూర‌ప్ప‌నే కాదు, ఏ అప్ప‌నూ ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌ని బీజేపీ హైక‌మాండ్ గ‌ట్టిగా ఫిక్స్ అయిన‌ట్టుగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?