cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

విన‌రా విన‌రా ఓ న‌రుడా...బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం

విన‌రా విన‌రా ఓ న‌రుడా...బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం

ఇప్పుడు ఎక్క్డ‌డ చూసినా  వీరబ్ర‌హ్మేంద్ర‌స్వామి కాల‌జ్ఞానం వినిపిస్తోంది. ప‌ల్లైనా, ప‌ట్ట‌ణ‌మైనా, ఇల్లైనా, ర‌చ్చ బండ ద‌గ్గ‌రైనా ఏ ఇద్ద‌రు క‌లిసినా "విన్నారా....చూశారా అంతా బ్ర‌హ్మంగారు చెప్పిన‌ట్టే జ‌రుగుతోంది...పాపాలు పెరిగిపోయినాయి. అందుకే క‌లియుగం ఈ విధంగా అంత‌మైపోతోంది. లేక‌పోతే ఎప్పుడూ ఊహించ‌ని క‌రోనా వైర‌స్ ఏమిటి? ఎక్క‌డో చైనాలో పుట్టి, వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మ‌న‌ల్ని కూడా చుట్టుముట్ట‌డం ఏంటి?" అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా సాగుతోంది.  

"విన‌రా విన‌రా ఓ న‌రుడా బ్ర‌హ్మంగారి మాట పొల్లు పోదురా. కాల‌జ్ఞానం క‌ల్ల కాదురా. అంతుపొంతు లేని ఆప‌ద‌ల‌తో దేశం అల్ల‌క‌ల్లోలం అయిపోయేను. తిరుప‌తి వెంక‌న్న గుడి నాలుగు రోజులు పూజ‌లే లేక మూత‌ప‌డేను. తిరుప‌తి కొండ‌పై జ‌ల‌ధార పుట్టి అంద‌రికీ ఆధార‌మ‌య్యేను. అమెరికా దేశాన భూకంపం పుట్టి ప‌ట్ట‌ణాల‌కు చేటు తెచ్చేను. తెర‌మీద బొమ్మ‌లే ప‌రిపాల‌న‌లోకి వ‌చ్చి అధికారం చెలాయించేను. యాగంటి బ‌స‌వ‌య్య అంత‌కంత‌కూ పెరిగి క‌లియుగాంత‌మున రంకె వేసేను.  వితంతువు అధికారం చెలాయించేను.  కులం, మ‌తం పోయేను. వ‌ర్ణాంత‌ర వివాహాలు జ‌రిగేను".....ఇలా బ్ర‌హ్మంగారు చెప్పిన కాల‌జ్ఞానం వింటూ...ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని భ‌యం గుప్పిట్లో పెట్టుకున్న క‌రోనా గురించి క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకుంటున్నారు.

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆల‌యం మూసివేత‌ను ప్ర‌ధానంగా జ‌నం ఓ సెంటిమెంట్‌గా చెప్పుకుంటూ ఆశ్చ‌ర్యంతో పాటు ఆందోళ‌న చెందుతున్నారు. బ్ర‌హ్మంగారు చెప్పిన‌ట్టు తిరుమ‌ల‌లో ఏడుకొండ‌ల వాడి గుడి మూసివేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తిరుమ‌ల కొండ‌పై న‌ర మాన‌వుడు లేక‌పోవ‌డం అస‌లు ఎప్పుడైనా, ఎన్న‌డైనా ఊహించారా అని ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. అలాగే తెర‌మీద బొమ్మ‌లు అధికారంలోకి వ‌చ్చారంటే...ఎన్టీఆర్‌, ఎమ్జీఆర్‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకుంటున్నారు. వితంతువు ప‌రిపాలిస్తుందంటే ఇందిరాగాంధీని గుర్తు చేసుకుంటున్నారు. అన్నీ కాల‌జ్ఞాని వీర‌బ్ర‌హ్మేంద్ర గారు చెప్పిన‌ట్టే జ‌రుగుతున్నాయ‌ని....ఆయ‌న చెప్పిన అంశాల‌పై వివ‌రంగా చ‌ర్చించుకుంటున్నారు.

అస‌లు ఆ క‌రోనా వైర‌స్ ఏమిటి?  దాని నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునేందుకు ప్ర‌ధాని మోడీ పిలుపు మేరకు జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించ‌డం? ఆ త‌ర్వాత కూడా పాల‌కుల సూచ‌న మేర‌కు రోజుల త‌ర‌బ‌డి ఇళ్ల‌లోనే స్వీయ నిర్బంధం విధించుకోవ‌డం...అంతా ఓ పీడ‌క‌ల‌లా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇళ్ల‌లో ఉంటూ టీవీల్లో చూస్తూ...ప్ర‌పంచం లాక్‌డౌన్ కావ‌డాన్ని క‌ళ్లారా వీక్షిస్తున్నారు. మ‌నం నిత్యం తిరిగే ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు మాన‌వ సంచారం లేకుండా నిర్మానుష్యంగా క‌నిపిస్తుండ‌టం మ‌నిషి న‌మ్మ‌లేకున్నాడు. బ‌స్సులు, రైళ్లు తిర‌గ‌క‌పోవ‌డం, ఇద్ద‌రికి మించి ఒక వాహ‌నంలో అనుమ‌తించ‌క పోవ‌డాన్నిఅస‌లు ఊహించ‌లేక‌పోతున్నారు. ఇది క‌లా?  నిజ‌మా అనే డోలాయ‌మాన ప‌రిస్థితి ఈ క‌రోనా క‌ల్పిస్తోంది.

అస‌లేంటీ మాయా ప్ర‌పంచం? ఏం జ‌రుగుతోంది?  మున్ముందు ఏం జ‌ర‌గ‌బోతుంది అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు ప‌ర‌స్ప‌రం ఫోన్లు చేసుకుంటూ త‌మ‌త‌మ ఊళ్ల‌లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయంటూ ఆరా తీస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా భార‌తీయులు ఎక్కువ‌గా ఉండే అమెరికాలో, అర‌బ్ దేశాల్లో ప‌రిస్థితి చేయి దాటి పోతోంద‌ని టీవీల్లో చూస్తూ తెలుసుకుంటున్న భార‌తీయులు ఒకింత ఆందోళ‌న చెందుతున్నారు.

అమెరికాలో క‌రోనా మృతులు పెరుగుతుండ‌టంతో పాటు పాజిటివ్ కేసులు కూడా అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో మ‌రీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న త‌ల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ఆందోళ‌న‌కు గురి అవుతున్నారు. ఒక‌ప్పుడు అమెరికా లేదా ఇత‌ర దేశాల నుంచి సొంతూరికి వ‌స్తున్నారంటే...ప్ర‌త్యేక మ‌ర్యాద‌లు జ‌రిగేవి. కానీ కరోనా దెబ్బ‌తో...విదేశాల నుంచి వ‌స్తున్నార‌ని తెలిస్తే...వ‌ద్దే వ‌ద్ద‌ని, అస‌లు ఊళ్ల‌లోకి అడుగు పెట్ట‌నివ్వ‌ని వింత ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ క‌రోనా అంతిమంగా ప్ర‌పంచాన్ని ఏ విప‌త్క‌ర ప‌రిస్థితికి నెట్టి వేస్తుందో అర్థం కావ‌డం లేదు. అస‌లు మందే లేని వైర‌స్ కావ‌డంతో, ముందు జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం ఒక్క‌టే మ‌న‌ముందున్న ఏకైక మార్గం. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా, ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటున్నా భార‌త‌దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు నెమ్మ‌దిగా పెరుగుతుండ‌టం....ఆందోళ‌న క‌లిగించే అంశం.

అయినా క‌రోనా వైర‌స్‌తో యుద్ధం చేయ‌క తప్ప‌ని స‌రి ప‌రిస్థితి. స‌మ‌స్య వచ్చింద‌ని పారిపోవ‌డం కాదు...విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పోరాడేందుకు మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు ఇస్తున్న మాన‌సిక స్థైర్యంతో భార‌తీయులంతా ఏక‌తాటిపై నిలిచారు. అంతిమ విజ‌యం మ‌న‌దే కావాలి. అవుతుంది కూడా. కాక‌పోతే గెలుపు రుచి చూసే వ‌ర‌కు ఇలాంటి చేదు అనుభ‌వాల‌ను ఎదుర్కోవ‌ల్సిందే.

పురిటి నొప్పులు భ‌రించాల్సి వ‌స్తుంద‌ని త‌ల్లి బిడ్డ‌ను క‌న‌డం మానేస్తుందా?  మాతృత్వం మాధుర్యం తెలియాలంటే పురిటి నొప్పులు భ‌రించాల్సిందే. క‌రోనాపై యుద్ధ వేళ కూడా అలాంటి స్ఫూర్తితో మ‌న‌మందరం పోరాటం చేసి విజ‌యం సాధిస్తామ‌ని ప్ర‌తిన‌బూనుదాం.

400 ఏళ్ల భాగ్యనగరి చరిత్రలో తొలిసారి ఇలా

 


×